ఆమె అసలు వినడం లేదా? లేక వినీ విననట్టుగా వదిలేస్తున్నారా? పట్టు బిగించాల్సిన మంత్రులే… కట్టు తప్పి… పార్టీ పరువును నడి రోడ్డు మీద నిలబెట్టి బజారుపాలు చేస్తుంటే… కట్టడి చేయాల్సిన ఇన్ఛార్జ్ మేడమ్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? పార్టీలో క్రమ శిక్షణ గురించి నాడు చెప్పిన భారీ డైలాగ్స్‌ని మర్చిపోయారా? అంతా ఆరంభ శూరత్వమేనా? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గురించి తెలంగాణ కాంగ్రెస్‌లో ఏమనుకుంటున్నారు? వాట్ మేడమ్…. వాటీజ్ దిస్. మీకసలు అర్ధమవుతోందా..? పార్టీలో అసలేం జరుగుతోందో తెలుస్తోందా? మీకు తెలియడం లేదా? లేక తెలిసి కూడా… తెలియనట్టుగా టైంపాస్ చేస్తున్నారా? వచ్చిన కొత్తల్లో తీసిన కొండంత రాగం ఇప్పుడు వినిపించండం లేదు ఎందుకు? ఇవీ… ప్రస్తుతం తెలంగాణలోని సగటు కాంగ్రెస్ కార్యకర్త మదిలో మెదులుతున్న ప్రశ్నలు. అది కూడా తమ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గురించే. కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లనే ఉంటది.. స్వేచ్ఛ ఎక్కువంటూ సర్ది చెప్పుకోవడం కాదు. ఆ పేరుతో…స్వేచ్ఛన్నర తీసుకుంటూ… మంత్రులతో సహా… ముఖ్యనాయకులు మూకుమ్మడిగా పార్టీ పరువును బజారుకీడుస్తుంటే… మీ డిసిప్లినరీ యాక్షన్ ఏమైంది? ప్రతిష్ఠ పలచన అవుతుంటే…
మేడమ్ మౌనంగా… యోగ నిద్రలో ఎందుకు ఉన్నారన్నది పార్టీలో చాలామంది మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లోనే ఉన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ ఎపిసోడ్ ఓ రేంజ్‌లో కాక రేపింది జరిగింది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.. ఆ పంచాయతీ సెటిల్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ… అదే లొల్లిని మళ్ళీ మంత్రి వివేక్ మొదలుపెట్టారు. ఇదిలా ఉండగానే…. కొండా దంపతుల మేడారం ఇష్యూ తో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు మళ్ళీ రచ్చకెక్కింది. అది పొంగులేటి వర్సెస్ కొండాగా మారింది. ఇక వరంగల్ జిల్లాలో అంతర్గత లొల్లి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పార్టీలో ఎవరో ఆల్తూ ఫాల్తూ లీడర్స్ అంటే… అది వేరే సంగతి. కానీ… సాక్షాత్తు కేబినెట్ మంత్రులే ఇలా కట్టు తప్పి ప్రవర్తిస్తుంటే…ఇన్ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు? కనీసం ఆ గొడవల్ని పట్టించుకున్నట్టు కూడా కనిపించలేదు ఎందుకు? మంత్రుల రచ్చ పదే పదే రిపీట్ అవుతున్నా… పిలిచి మాట్లాడాల్సిన ఇన్ఛార్జ్ ఎందుకు రియాక్ట్ అవడం లేదు? హైదరాబాద్‌లో ఉండి కూడా దాని గురించి పట్టించుకోకపోవడం ఏంటి? కొట్టుకుంటే కొట్టుకోనివ్వండి… మనకేంటని అనుకుంటున్నారా లాంటి రకరకాల ప్రశ్నలు మెదులుతున్నాయట సగటు కార్యకర్త మదిలో. కనీసం ఆమె మంత్రుల్ని పిలిచి మాట్లాడితే దారిలోకి వచ్చేవారేమో…. కానీ పట్టించుకోలేదు. మేడమ్‌కు మంత్రుల్ని పిలిచి మాట్లాడేంత టైం కూడా లేనట్టుంది అంటూ సెటైరికల్‌గా మాట్లాడుకుంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు.
మంత్రుల మధ్య పార్టీ పరమైన సమస్యలు ఉంటే దాన్ని కుటుంబ సమస్యగా భావించవచ్చు. కానీ…ఆ పోరు ఏకంగా కులాల కుంపట్లను ఎగదోసేలా జరుగుతోంది. ఇది ఇంకా ముదిరితే… ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి కూడా తలనొప్పులు తప్పవని అంటున్నారు. పరిస్థితి ఇంత సీరియస్‌గా మారుతున్నా… మీనాక్షి నటరాజన్ కనీసం మంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యంగానే ఉందన్నది కాంగ్రెస్ వర్గాల ఇంటర్నల్ టాక్. క్యాడర్‌కు ఆదర్శంగా నిలవాల్సిన మంత్రులే ఇలా వ్యవహరిస్తుంటే… కంట్రోల్ చేయాల్సిన ఇన్చార్జి కామ్‌గా ఎందుకుంటున్నారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. జిల్లా, మండల స్థాయిలో నాయకులు ఘర్షణ పడితే వాళ్లపై చర్యలు అంటూ క్రమశిక్షణ కమిటీకి పని చెప్తారు. కానీ మంత్రులే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ పార్టీని, ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టిస్తుంటే… ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారన్నది బేసిక్ క్వశ్చన్. ఓ వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల సవాళ్ళు ఇప్పుడు పార్టీ ముందు ఉన్నాయి. కానీ… మంత్రులు కొందరు అవేం పట్టనట్టు ఎవరి గొడవలో వాళ్ళు మునిగి తేలుతున్నారు. నాయకులు.. కేడర్‌కు దిశా నిర్దేశం ఇచ్చేలా ఉండాలి కానీ… ఇలా దారి తప్పి ప్రవర్తిస్తుంటే గాడిన పెట్టాల్సిన ఇన్చార్జి కూడా మౌనంగా ఎందుకు ఉంటున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోందట కాంగ్రెస్ అభిమానుల్లో. ఇన్చార్జి స్థాయిలో పిలిచి మాట్లాడితే ఈ వ్యవహారం రిపీట్ అయ్యేది కాదని, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ మండల, జిల్లా స్థాయి నాయకులకు తప్ప మంత్రులకు వర్తించదా…..? మేడమ్ ఇన్ఛార్జ్ అంటూ ఘాటు ప్రశ్నలే దూసుకువస్తున్నాయి కేడర్ వైపు నుంచి.