Site icon NTV Telugu

Off The Record: వరంగల్ లో డ్యూటీ చేయడానికి పోలీసులు హడలిపోతున్నారా?

Konda

Konda

Off The Record: అక్కడ ఖాకీలకు కొండంత కష్టం వచ్చిపడింది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారుల మధ్య నలిగిపోతున్న సగటు పోలీసులు ఈ డ్యూటీలు మావల్ల కాదు బాబోయ్‌… అని మొత్తుకుంటున్నారట. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? భయపెట్టే పోలీసులే ఎందుకు భయపడుతున్నారు?

Read Also: Janhvi Kapoor : బాయ్ ఫ్రెండ్ తో లండన్ లో జాన్వీకపూర్ ఎంజాయ్..

పోలీసింగ్‌లో వరంగల్‌కు ఒక స్పెషల్‌ స్టేటస్‌ ఉంది. అలాంటి పోలీసులు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారట. బదిలీలు, సస్పెన్షన్లు, మెమోలతో హడలిపోతున్నారు. అది కూడా వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధిలోనే జరగడం ఆసక్తికరంగా మారింది. తప్పు చేయకపోయినా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వత్తినందుకు వేటు పడడంతో పోలీసు వర్గాల్లో ఆందోళన పెరుగుతోందంటున్నారు. నేతల మెహర్బానీ కోసం ఉన్నతాధికారులు కింది స్థాయి పోలీసులతో తప్పులు చేయిస్తూ… బలిపశువులుగా మారుస్తున్నారని కింది స్థాయిలో గరం గరంగా ఉన్నారట. వరంగల్ తూర్పు నియోజకవర్గం అధికార పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు ఇక్కడ పని చేస్తున్న పోలీసులను ఇరకాటంలో పడేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి టార్గెట్‌గా నడుస్తున్న రాజకీయంలో పోలీసులు ఇరుక్కుపోతున్నారట. కొండా దంపతుల రాజకీయాలు డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళు బయటికి వస్తే హంగు అర్బటాలు ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీరి హవా నడిచినప్పుడు పెద్దగా ఇవేవీ సమస్య కాలేదుగానీ.. ఇప్పుడు వారి ప్రత్యర్థులు కూడా బలపడటంతో… ప్రతి పనిపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సోషల్‌ మీడియా ఎఫెక్ట్‌తో ప్రతి విషయంరచ్చఅవుతోంది.

Read Also: Keerthy Suresh : తడబడకుండా ‘ఉప్పుకప్పురంబు’ పద్యం చెప్పిన కీర్తిసురేష్..

ఇక, ఈ పరిస్థితుల్లో.. సిఫార్సు లేఖలతో పోస్టింగ్ పొందుతున్న పోలీసు ఉన్నతాధికారులు.. చేస్తున్న పనులు కొందరికి తలనొప్పిగా మారుతున్నాయని అంటున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మొత్తం మూడు లా అండ్‌ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్‌, ఒక ఏసీపీ ఆఫీస్.. ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఇంకో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదుగురు సిఐలు, ఇద్దరు ఏసీపీలు సుమారు 14 మంది ఎస్ఐలు పనిచేస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది కొండా దంపతుల ఆశీస్సులతో పోస్టింగ్స్‌ తెచ్చుకున్న వాళ్ళేనని చెప్పుకుంటారు. అందుకే వాళ్లు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. సహజంగానే హంగు ఆర్భాటం కోరుకునే కొండా మురళి… బయటికి వస్తే చాలు… ఆయన భార్య సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు నియోజకవర్గంలో పనిచేస్తున్న పోలీసు అధికారులంతా ఆయన చుట్టూ ఉండాల్సిందే. ఒక్కరు కనిపించకపోయినా.. ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి మరీ.. ఆ అధికారి ఎక్కడున్నారని అడుగుతారట. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ.. పైనుంచి ఆదేశాలు రాకముందే మురళిని కలవడం అలవాటు చేసుకున్నారు. ఇదే ఇప్పుడు వారికి తలనొప్పిని తెచ్చిపెడుతోందట. మురళికి ఏ పదవి ఉందని, ఏ ప్రోటోకాల్‌ ప్రకారం పోలీస్‌ అధికారులు ఆయన్ని కలుస్తున్నారు, వెంట తిరుగుతున్నారంటూ.. ప్రశ్నలు వస్తున్నాయి.

Read Also: Formula E Case: కేటీఆర్ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించనున్న ఏసీబీ..?

అయితే, ఈ క్రమంలోనే.. ఫిర్యాదులు పెరిగిపోయి గత ఆగస్ట్‌లో ఓ సీఐ సస్పెడ్‌ అయ్యారు. ఇక వరంగల్ మిల్స్ కాలనీలో పనిచేస్తున్న సీఐ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పై కేసు నమోదు చేయడం ఇటీవల వివాదాస్పదంగా మారింది. కొండా మురళి అనుచరుడి ఒత్తిడి మేరకే కేసు నమోదైందన్న ప్రత్యర్థుల ఫిర్యాదుతో మిల్స్ కాలనీ సిఐపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక తాజాగా కొండా మురళికి ప్రోటోకాల్ లేకపోయినా ఎస్కార్ట్ గా వ్యవహరిస్తున్నారంటూ… పోలీస్ కమిషనర్ మెమోలు జారీ చేయడంతో వరంగల్ తూర్పులో పనిచేస్తున్న పోలీసు అధికారులు అందరూ తలలు పట్టుకుంటారట. కొండా మురళి తాజాగా కొన్ని శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్‌ ఏసీపీ నందిరాం నాయక్‌, మిల్స్‌కాలనీ, ఇంతేజార్‌గంజ్‌, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్లు ఆయనకు ఎస్కార్ట్‌గా వెళ్లారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ మెమోలు జారీ చేశారు. ప్రోటోకాల్ లేని నాయకుడికి మీరు ఎస్కార్ట్ గా ఎలా వెళ్ళారో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించడం ఇప్పుడు వరంగల్‌ తూర్పు పోలీస్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. ఒత్తిడి కారణంగా… తప్పని పరిస్థితిలో ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు మాత్రమే కొండా మురళితో వెళ్లాల్సి వస్తోందని, చివరికి అది తమకే చుట్టుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వెళితే ఒక గొడవ, వెళ్ళకపోతే మరో గొడవ అని తలలు పట్టుకుంటున్నారట పోలీసులు. మొత్తంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం పోలీస్ స్టేషన్స్‌లో పని చేయడం కత్తిమీద సాము అయిందన్నది పోలీసు వర్గాల మాట.

Exit mobile version