ఆ ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎన్నిక తూతూ మంత్రమేనా? పైకి ఎన్నిక అని చెబుతున్నా… మంత్రులు మాత్రం ఎంపిక చేసేసి మమ అనిపించే ప్లాన్‌లో ఉన్నారా? పేరుకు అబ్జర్వర్స్ వచ్చినా… పెత్తనం మాత్రం మంత్రులదేనా? చెంబులో నీళ్ళు శంఖంలో పోస్తే తీర్ధం అయినట్టు తమ మనసులో ఉన్న పేర్లను పరిశీలన కమిటీతో చెప్పించబోతున్నారా? ఎక్కడ జరుగుతోందా తంతు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులకు జరుగుతున్న ఎన్నికలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.గతంలోలాగా డీసీసీ అధ్యక్షులను అధిష్టానం డిసైడ్ చేయకుండా… క్యాడర్ అభిప్రాయాల ప్రకారం ముందుకెళ్ళాలని డిసైడైంది. భవిష్యత్‌లో పార్టీ పదవులకు, ఎన్నికల్లో టికెట్లకు… డీసీసీలే ప్రామాణికం అని నిర్ణయించిన క్రమంలో ఆ పదవులకు ఎక్కడ లేని గిరాకీ ఏర్పడింది. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రులు కూడా తమకు నమ్మకమైన వారికి ఆ పదవి దక్కేలా చేసేందుకు సీరియస్‌గానే ప్రయత్నాలు చేస్తున్నారట.. మంత్రులు పట్టించుకోవడం మొదలయ్యాక ఎన్నికల పర్వం సమరాన్ని తలపిస్తోందని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు.అయితే ఆయా జిల్లాల పరిధిలో భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ ప్రధానంగా ఇద్దరు ముగ్గురి మధ్యే పోటీ ఉంటోంది. వాళ్ళు కూడా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నముగ్గురు మంత్రుల్లో ఎవరో ఒకరి అండదండలున్నవారేనంటున్నారు. దీంతో మంత్రులే రంగంలోకి దిగి తమ అనుచరులకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చేలా పావులు కదుపుతున్నారట. కొన్ని చోట్ల స్వయంగా మండల స్థాయి నేతలతో కూడా మంత్రులు మాట్లాడుతున్నట్టు సమాచారం.
కరీంనగర్లో అయితే తోపులాటకు దారితీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసారు. ఇక్కడ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌ల అనుచరుల మధ్యే పోటీ నడుస్తోంది. మధ్యలో పార్లమెంటు ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు ఎంట్రీ ఇవ్వడంతో రసవత్తరంగా మారింది. పొన్నం అనుచరులు పద్మాకర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌లు బరిలో ఉండగా ఒకరికి డీసీసీ, ఒకరికి నగర కాంగ్రెస్ పదవి దక్కేలా ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే సుడా చైర్మన్, నగర పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఈసారి డీసీసీ కోసం ప్రయత్నాలు సీరియస్‌గానే చేస్తున్నారు. రాజేందర్రావు మాత్రం గాంధీభవన్ ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారట. ఇక్కడ అనుచరుల కంటే ఇద్దరు మంత్రులే పట్టుమీద ఉన్నతరుణంలో మధ్యే మార్గంగా మేడిపల్లి సత్యం పేరు ఖరారు అవుతుందనే ప్రచారం సైతం జరుగుతోంది. సిరిసిల్ల డీసీసీ విషయానికొస్తే… ఇక్కడ నుంచి నిర్వాసిత గ్రామాల జాక్ లీడర్ కూస రవీందర్ మంత్రి పొన్నం అండతో బరిలోకి దిగగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సపోర్ట్‌తో మరో నేత సీన్లోకి వచ్చారట. సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్‌రెడ్డి కూడా బరిలో ఉండటంతో అటు మంత్రి పొన్నం మాట నెగ్గుతుందా…? ఆది అనుచరులకు దక్కుతుందా..? కే.కే మహేందర్‌రెడ్డిని అధ్యక్షుడిని చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. జగిత్యాల విషయానికొస్తే… ఇక్కడ పోటీ పెద్దగా లేకపోవడం…మంత్రి శ్రీధర్ బాబు అండ ఉంటే చాలు అన్నట్టుగానే ఉంది.
ఇప్పటికే ఆయన అనుచరుడు కల్వకుంట్ల సుజిత్ రావు బరిలో ఉండగా… కోరుట్ల పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అయితే డైరెక్టుగా తన అనుచరుడు నందయ్య పేరు ప్రకటించేశారు. ప్రస్తుత అధ్యక్షుడు, మంత్రి అడ్లూరి కూడా తన ప్రధాన అనుచరుడు సంగనభట్ల దినేష్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. పెద్దపల్లి డీసీసీకి సంబంధించి చిత్రమైన పరిస్థితి నెలకొందట… మిగతా జిల్లాల్లో తన అనుచరులకు సపోర్ట్ ఇస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు పై ప్రచారం సాగుతున్న తరుణంలో సొంత జిల్లాలో మాత్రం… అందరూ తన అనుచరులే బరిలో ఉండటం ఆయనకు కాస్త ఇబ్బందిగా మారిందట… ఎవరిని కాదన్నా సమస్య రావచ్చంటున్నారు. అందుకే ప్రస్తుత అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న వారికి తిరిగి రెన్యూవల్ లేదని పార్టీ ప్రకటించినప్పటికీ ఆయన కేవలం మూడేళ్లే పదవిలో ఉన్నాడు గనుక… తిరిగి కొనసాగించాలని కోరుతున్నారట. ఓవరాల్‌గా క్యాడర్ నిర్ణయమే ఫైనల్ అని పార్టీ అధిష్టానం చెప్పినప్పటికీ… జిల్లాపై మంత్రులు తమ పట్టు కొనసాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయో చూడాలి… ఏ