కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? అసెంబ్లీలో చర్చించాక తదుపరి చర్యల మాటేంటి? ఏ తరహా ఎంక్వైరీ వేయబోతోంది? దర్యాప్తు అధికారాన్ని తన పరిధిలోనే ఉంచుకుంటుందా? లేక బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు సీబీఐకి అప్పగిస్తుందా? కాళేశ్వరం రిపోర్ట్ చుట్టూ వస్తున్న కొత్త డౌట్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటు పై.. తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసింది. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో ఇదే విషయమై… అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారం చేస్తోందన్న మాజీ మంత్రి హరీష్‌రావు కామెంట్స్‌కు స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి అప్పుడే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. అలా వేసిన కమిషన్… అన్ని రకాల విచారణలు పూర్తిచేసి… ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దాని మీద కేబినెట్‌లో చర్చ జరిగింది.
కమిషన్ ఇచ్చిన పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది సర్కార్. ఈ క్రమంలో…ఈ నెల 30న శాసనసభ సమావేశాలు మొదలవబోతున్నాయి. తొలి రోజునే… కమిషన్ నివేదికను సభ్యుల ముందుంచాలని డిసైడైంది ప్రభుత్వం. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఇంత వరకు బాగానే ఉన్నా… అసలు కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. కమిషన్ సూచించిన చర్యలను ఎలా అమలు చేయాలనుకుంటోందన్న చర్చ మొదలైంది. సభలో వివిధ పార్టీల నుంచి వచ్చిన అభిప్రాయాల ప్రకారం ముందడుగు వేయాలని నిర్ణయించినా… ఆ అడుగు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ప్రభుత్వ పెద్దల ఆలోచన ఎలా ఉందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. సర్కార్‌కు అందిన నివేదికలో నాటి అధికారులు, మంత్రుల పొరపాట్లు… నిధుల దుర్వినియోగం..లాంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని.. ఏసీబీ విచారణకి ఆదేశించే అవకాశం ఉందన్నది ఒక వెర్షన్. ఇప్పటికే తెలంగాణ ACB దగ్గర ఫార్ములా ఈ రేస్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన విచారణ నడుస్తోంది.
ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసును కూడా అప్పగిస్తే…రెండు పెద్ద కేసుల్ని దర్యాప్తు చేసేంత మంది సిబ్బంది ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారా అన్నది ప్రశ్నార్థకమే. ఇక రెండో ఆప్షన్.. అన్ని విభాగాల అధికారులతో కలిపి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేయడం. కమిషన్ నివేదికపై సిట్ దర్యాప్తు చేయించే అవకాశం కూడా ఉందంటున్నారు. ఐతే…. ఒక ప్రతిపక్షం బీజేపీ మాత్రం సీబీఐ దర్యాప్తు కోసం పట్టుబడుతోంది. ఆ విషయంలో కొన్ని రాజకీయ అనుమానాలు ఉన్నాయట. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. ఇప్పుడు ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే… పరిణామాలు ఎలా ఉంటాయోనన్న అనుమానం కాంగ్రెస్ ముఖ్యులకు ఉందట. ఆ విషయంలో తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లోనే కొందరు నేతలు కమిషన్ నివేదికపై… సీబీఐ దర్యాప్తు చేయిస్తేనే బెటర్ అని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సీబీఐ దర్యాప్తులో తేడా వస్తే….. బీజేపీ.. BRS మైత్రి ఇంకా బలపడుతుందని, ప్రజలకు కూడా ఇదే అంశంపై మరింత క్లారిటీ వచ్చినట్టవుతుందన్న చర్చ సైతం నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. కేసును సీబీఐకి అప్పగిస్తే… బీజేపీ రంగు కూడా బయటపడుతుందన్నది కాంగ్రెస్‌లోని ఓ వర్గం వాదన. ఇలా రకరకాల వాదనలు నడుస్తున్న క్రమంలో… ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా… కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్యలన్నది మాత్రం రేవంత్ సర్కార్‌కి సవాలేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.