జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్కెచ్‌లు సిద్ధం చేస్తోందా? గెలుపు ఇప్పుడు పరువు ప్రతిష్టల సమస్యగా మారిపోయిందా? అందుకే… అందరికంటే ముందే కసరత్తు మొదలుపెట్టేసిందా? ఇంతకీ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? తెలంగాణ కాంగ్రెస్‌కు ఇప్పుడో అగ్ని పరీక్ష ఎదురైంది. అదే… జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఈ బైపోల్‌లో గెలుపన్నది అటు పార్టీ… ఇటు ప్రభుత్వానికి సవాల్ అన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో ఉంది.18 నెలల పరిపాలన ముగిసిన క్రమంలో… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిచి తీరక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇందులో మంత్రుల మధ్య సమన్వయం, పార్టీ వ్యూహం చాలా కీలకంగా మారబోతున్నాయి. అందుకే… ఇంకా నోటిఫికేషన్ రాక ముందే… సీఎం రేవంత్‌రెడ్డితో మొదలుకుని.. పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ వరకు అంతా బైపోల్ కసరత్తులో మునిగిపోయినట్టు సమాచారం. ఇటీవల ఖర్గే పర్యటనలో, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌లో జూబ్లీహిల్స్ సీటు కొట్టాల్సిందేనని టార్గెట్ ఫిక్స్ చేశారట. అందుకే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే రెండు సార్లు సర్వే జరగ్గా…. బీఆర్‌ఎస్ కంటే తాము ఐదు నుంచి 7 శాతం ముందున్నట్టు తేలిందన్నది కాంగ్రెస్ వర్గాల మాట. అధికార పార్టీ అవ్వడం తో అది కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనికి తోడు.. ఇప్పటికే ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఐదు నుంచి 10 కోట్ల మేర పనులు మొదలయ్యాయి. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపు బాధ్యతను ఇప్పటికే మంత్రి వివేక్‌కి అప్పగించింది పార్టీ. దీనికి తోడు.. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా డివిజన్స్ వారీగా ఫోకస్ పెంచారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు లోకల్‌గా ఉన్న రాజకీయ పరిస్థితిని సమీక్షిస్తున్నారట. చేతిలో అధికారం ఉంది… హంగు…ఆర్భాటాలు భేష్. అయితే… అభ్యర్థిగా ఎవరిని బరిలో దించాలన్న విషయమై పార్టీ పెద్దలు మల్ల గుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇక్కడ అజారుద్దీన్ పోటీ చేశారు.
ఇప్పుడు కూడా తానే పోటీ చేయాలన్నది ఆయన ఆరాటం. ఐతే ఆయన విషయంలో పార్టీ అంత అనుకూలంగా కనిపించడం లేదు. మైనార్టీ నుంచే మరో నేత కూడా ఇక్కడి నుండి బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మైనార్టీల ఓటు బ్యాంకు లక్షా 20 వేల వరకు ఉంది. పార్టీ మొత్తం ప్రస్తుతం బీసీ రిజర్వేషన్.. కుల గణన లాంటి అంశాల చుట్టూ తిరుగుతోంది కాబట్టి.. బీసీకి ఛాన్స్ ఇస్తారా..ఇస్తే ఎలా ఉంటుంది అనే కోణం లో చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. బీసీ కోటాలో నవీన్ యాదవ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఏదేమైనా.. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలి అనేదే కాంగ్రెస్ పార్టీ టార్గెట్. అందుకే.. అందరికంటే ముందుగా కసరత్తు మొదలుపెట్టి… కార్యకర్తలు ప్రతి ఓటర్‌ని కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు.