డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ళు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాయా? పాత, కొత్త పోరాటం మళ్ళీ మొదలైందా? ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను గుర్తు చేస్తూ…. పాత కాంగ్రెస్ నాయకులు ఫీలైపోతున్నారా? ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేకి ఇవేం పట్టడం లేదా? ఎక్కడ జరుగుతోందా వర్గపోరు? దాని మూలాలు ఎక్కడున్నాయి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇళ్ళ పంచాయితీ తీవ్రమవుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యనే… పాత వర్సెస్ కొత్త అన్నట్టుగా గొడవలు జరుగుతున్నాయి. మాకు తక్కువఇచ్చారు, పార్టీలు మారి వచ్చిన వారి కోటాలో ఎక్కువ ఇళ్లు కేటాయించారంటూ అంతర్గతంగా మండిపడుతున్నారట పలువురు నాయకులు. ఉమ్మడి జిల్లా అంతటా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ… కొన్ని నియోజకవర్గాల్లో శృతిమించిపోతున్నట్టు సమాచారం. తాజాగా బెల్లంపల్లిలో అయితే ఏకంగా ఓ కాంగ్రెస్ లీడర్ వార్డు నాయకురాలితో ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు కావాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలని మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. మరీ అంత ఎక్కువా అని ఆ నాయకురాలు ప్రశ్నిస్తే 10నుంచి 20 లక్షల విలువైన ఇళ్ళు ఊరికే వస్తాయా అన్న ఆడియో వివాదాస్పదం అవుతోంది. ఇది ప్రతిపక్ష పార్టీలకు, సొంత పార్టీలోని ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతోందట.బెల్లంపల్లిలో ప్రతిపక్షాలేమోగానీ… స్వపక్షంలోని వాళ్ళే నిగ్గదీసి అడుగుతున్నారట. అదంతా ఎమ్మెల్యే చుట్టూ తిరిగే క్యాడర్ పనే అంటూ బాహాటంగానే అక్రమ వసూళ్ళ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్‌లోని మరోవర్గంనాయకులు.
వసూళ్ళ బ్యాచ్ లు పేట్రేగిపోవడం,వాటిపై ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోక పోవడం మూలంగా పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నది కట్టర్ కాంగ్రెస్ క్యాడర్ ఆవేదనగా చెప్పుకుంటున్నారు. ఇంకొందరైతే మరో అడుగుముందుకేసి తమ దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్నారట. అటు ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గానికి గెస్ట్ ఆర్టిస్ట్‌లాగా అలా వచ్చి ఇలా వెళ్తారని, పీఏలు, ఇతర పార్టీలనుంచి వచ్చిన అక్రమార్కులు, దీన్ని బాగా వాడుకుని పార్టీని, ప్రభుత్వాన్ని భష్టు పట్టిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాత కాంగ్రెస్ నాయకులు. సొంత పార్టీలోనే ఇలాంటి గొడవల వల్ల కొన్ని సీక్రెట్స్ కూడా బయటికి వస్తున్నాయని చెప్పుకుంటున్నారు బెల్లంపల్లిలో. ఇటీవల డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ఏఐసీసీ అర్జీలను స్వీకరించింది. నమ్మిన బంట్ల పేర్లను ప్రతిపాదించి అధిష్టానానికి పంపారు ఎమ్మెల్యే. అయితే ఈ మధ్య వాళ్ళలోని ఓ నేత ఆడియో వైరల్ కావడం వివాదాస్పదమైంది. ఈ పరిణామాలన్నిటిని గమనిస్తున్న క్యాడర్ మాత్రం… అసలు కాంగ్రెస్ పార్టీ ఎటు పోతోంది? ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు..కట్టడి చేయాల్సిన నేత కామ్‌గా ఉండడం దేనికి సంకేతం అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
కొంతమంది అయితే అక్రమాలతో పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వారిపై చర్యలు తీసుకోకపోతే వెళ్ళిపోతామని కూడా హెచ్చరిస్తున్నారట. అంతే కాకుండా కొన్ని చోట్ల ధనవంతులకు సైతం ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం, కొన్ని కాలనీల్లో లెక్కకు మించి మంజూరు పత్రాలు ఇవ్వడం పట్ల జనంలో సైతం పైసలిస్తేనే పని అవుతుందనే భావన పెరిగిపోతోందంటున్నారు. ఇదొక్కటే కాదు బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణతో అంశంతో పాటు భూ దందాలు, సర్కార్ భూముల కబ్జాల్లో సైతం కొంతమంది వేళ్లు పెట్టడంతో పార్టీలో అంతర్గత వివాదం ముదురుతోంది. ఈ వ్యవహారాలతో ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు పార్టీకి, ప్రభుత్వానికి కూడా మైనస్ మార్కులు పడుతున్నాయట. అటు బోథ్‌లో అయితే కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన ఓ కాంగ్రెస్ లీడర్ డబ్బులు ఇవ్వలేదని ఏకంగా ఓ లబ్దిదారు భర్తను చెట్టుకు కట్టేసి కొట్టడం కేసుల దాకా వెల్లింది. అది వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికి పార్టీకి చెడ్డపేరోచ్చిందట. ఇలాంటి వ్యవహారాలతో ఉమ్మడి జిల్లాలో పార్టీ పరువు పోతోందని, పెద్దలు జోక్యం చేసుకోవాలంటున్నారు కార్యకర్తలు.
TG TET 2025 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల