ఆ జిల్లాలో బీజేపీ.. కాంగ్రెస్‌తో సై అంటే సై అంటోందా? గట్టిగా మాట్లాడుకుంటే…. అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? హస్తం నేతలు సైతం… మా అభివృద్ధి మంత్రం ముందు మీరెంత? ఉఫ్‌మని ఊదేస్తామని అంటున్నారా? ఏ జిల్లాలో ఉందా వాతావరణం? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అన్ని పార్టీలు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం సంగతి ఒక ఎత్తయితే… నారాయణపేట జిల్లాలో మాత్రం పరిస్థితులు కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయట. ఇక్కడ కమలం పార్టీ దూకుడు కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. గత మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మించి ఈ సారి ఇక్కడ బీజేపీ పనితీరు కనబరుస్తుందన్న అంచనాలు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇక్కడి మక్తల్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులుండగా గత ఎన్నికల్లో 8 వార్డుల్లో గెలిచిన బీజేపీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. వైస్ చైర్మన్ పదవి కూడా కమలం ఖాతాలోనే పడిపోయింది. అప్పట్లో ఎక్స్ అఫిషియోగా ఉన్న ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఓటు కూడా కీలకం కాగా… నాడు ఐదు వార్డుల్ని గెల్చుకుని బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించింది. కాంగ్రెస్ కేవలం రెండు వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నారాయణపేట మున్సిపాలిటీలో నాడు 10 వార్డుల్లో గెలిచిన బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. కేవలం ఒక్క వార్డ్ తేడాతో తొమ్మిది చోట్ల గెలుపొందిన బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.
కాంగ్రెస్ అయితే… ఇక్కడ కూడా మక్తల్లోలాగే… కేవలం రెండు వార్డులకే పరిమితం అయింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఈ సారి ఈ రెండు మున్సిపాలిటీల్లో ఫలితాలు ఎలా ఉంటాయోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ హస్తవాసి మారుతుందా? కారు దూసుకొచ్చి బల్దియాలో తిష్ట వేస్తుందా? లేక రెండు పురపాలక సంస్థలపై కమలం జెండా ఎగురుతుందా అన్న ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు ఈ పుర పోరులో కమలనాథులు రెండు పట్టణాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జనసంఘ్ సమయం నుంచి మక్తల్ , నారాయణ పేట పట్టణాల్లో బీజేపీకి బలమైన పునాదులున్నాయి. గత మున్పిపల్ ఎన్నికలతో పోల్చకుంటే ఇప్పుడు పార్టీ బలోపేతమైందని, గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీ డికే అరుణకు మక్తల్ , నారాయణ పేట పట్టణాల్లో వచ్చిన మెజార్టీనే ఇందుకు ఉదాహరణ అంటున్నారు కాషాయ నేతలు.
అదే ఊపుతో ఈ బల్దియాల్లో పాగా వేస్తామన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్. బొటాబొటిగా వార్డులను గెలుచుకున్నా.. ఈసారి ఎంపీ, ఎమ్మెల్సీ ఎక్స్ అఫిషియో ఓట్లు సపోర్ట్‌గా ఉంటాయని లెక్కలేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో నారాయణపేటతో పాటు , మక్తల్‌ను కూడా మేమే కైవసం చేసుకుంటామంటున్నారు కాంగ్రెస్ నాయకులు. స్థానికంగా ఉన్న మంత్రి శ్రీహరి క్రుషి, ప్రభుత్వం అభివృద్ధి మంత్రంతో తాము సునాయాసంగా గెలవడం ఖాయమన్నది హస్తం నేతల విశ్వాసం. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం… మున్సిపాలిటీల్లో ప్రజలు తమవైపు ఉన్నారని , ఆశాజనకమైన ఫలితాలే సాధిస్తామనే ధీమాతో ఉంది. మొత్తం మీద నారాయణ పేట జిల్లాలోని రెండు మున్సిపాలిటీల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి ఎవరి లెక్కలు ఎలా ఉంటాయో, ఎవరి మద్దతు ఎవరికి కీలకం అవుతుందో చూడాలి.