ఆ మాజీ ఎమ్మెల్యేని ఫ్యాన్‌గాలి చల్లగా రా… రమ్మని పిలుస్తోందా? పొలిటికల్ ఎడారిలో ఒంటరి ప్రయాణం చేస్తున్న ఆ నేత కూడా….అటువైపు వెళితే కూల్ కూల్‌గా ఉంటుందని భావిస్తున్నారా? నీ అవసరం నాకు, నా అవసరం నీకు అన్న లెక్కలు కుదురుతున్నాయా? 2024 ఎన్నికల తర్వాత రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆ లీడర్ ఎవరు? ఏ జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేయాలనుకుంటున్నారు? రాజకీయాల్లో జనరల్‌గా ఒక్కొక్కరికి ఒక్కో టైం ఉంటుంది. ఎంత తోపులైనా… కాలం ఖర్మం కలిసిరాకపోతే… శంకరగిరి మాన్యాలే. అంతా బాగున్నప్పుడు ఓ వెలుగు వెలిగి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు కూడా టైమ్ బ్యాడ్ అయినప్పుడు అడ్రస్ లేకుండా పోతారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే ఉన్నారట మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. 2024 ఎన్నికల్లో చివరికి కాంగ్రెస్ పార్టీ తరఫున తన సొంత నియోజకమైన చీరాలలో పోటీ చేసి ఓడారాయన. తాను ఓడినా,… తన రాజకీయ శత్రువుగా భావించే కరణం కుటుంబాన్ని కూడా ఇంటికి పంపడంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పుకుంటారు. మరోవైపు గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకున్న ఏకైక అభ్యర్ది కూడా ఆమంచే.
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య శిష్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కృష్ణమోహన్… తదనంతర పరిస్దితుల్లో 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచి టీడీపీలోకి వెళ్ళారు. తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఫ్యాన్ గూటికి చేరిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడారాయన. చీరాల టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం అండ్ ఫ్యామిలీ వైసీపీలోకి రావటంతో ఆమంచి రాజకీయలను పర్చూరుకు షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచే పోటీ చేస్తారని భావించే లోపు తిరిగి చీరాలలోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ తరపున బరిలో దిగారు. ఓడిపోయాక తన పని తాను చేసుకుపోతున్నా… ఆమంచి చుట్టూనే లోకల్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణమోహన్ వ్యతిరేకించే మరోనేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనకు వెళ్ళడం, ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో కరణం ఫ్యామిలీ రాజకీయం గందరగోళంలో ఉండటంతో ఆమంచి పేరు మరోసారి తెర మీదికి వచ్చింది. అసలు కరణం బలరాం వైసీపీలో ఉంటారా లేక మరో గూడు వెదుక్కుంటారా? ఒకవేళ పార్టీ మారినా చీరాలలో కొనసాగుతారా.. లేక అద్దంకికి షిఫ్ట్ అవుతారా అన్న డౌట్స్ చాలానే ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో ఆమంచి వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. సమీకరణాలను బట్టి వైసీపీ కూడా ఆయనకు సముచిత స్ధానం ఇవ్వవచ్చన్న అంచనాలున్నాయి. గతంలో టీడీపీని వీడిన టైంలో, ఆ తర్వాత కూడా చంద్రబాబును టార్గెట్ చేసి చాలాసార్లు మాట్లాడిన ఆమంచి.. వైసీపీని వదిలేసినా…. జగన్‌ను మాత్రం పల్లెత్తు మాట అనలేదని, అదే ఆయనకు పార్టీలో రీ ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆమంచి లాంటి బలమైన నేత అవసరం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఉందని, బాలినేని వెళ్ళిపోయాక ఆ లోటు కనిపిస్తోందని అంటున్నాయి జిల్లా పార్టీ శ్రేణులు. ఇప్పటికే పార్టీ కీలక నేతలు ఆమంచిని తిరిగి ఆహ్వానించేందుకు సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. కానీ… ఇప్పటివరకూ ఇటు వైసీపీ నుంచిగాని.. అటు మాజీ ఎమ్మెల్యే వైపు నుంచిగానీ… రియాక్షన్ రాలేదు. ప్రస్తుతం చీరాల వైసీపీ ఇన్ఛార్జ్‌గా కరణం వెంకటేష్ కొనసాగుతుండటంతో ఆమంచికి ఒంగోలు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది వైసీపీ సర్కిల్స్‌లో. ఆమంచి కాపు సామాజికవర్గానికి చెందిన బలమైన నేత కావటం, ఒంగోలులో ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ గట్టిగానే ఉండటంతో తర్వాత రాజకీయ పరిణామాల సంగతి అటుంచితే… ప్రస్తుతానికి వైసీపీ ఓటు బ్యాంక్ పక్కకు పోకుండా ఉంటుందని లెక్కలేస్తున్నారట పార్టీ పెద్దలు. అటు మాజీ ఎమ్మెల్యేకు కూడా ఇప్పుడో బ్రాండ్ కావాలని, ఆ ప్రకారంగా చూస్తే ఇద్దరి లెక్కలు సరిపోతాయంటున్నారు పరిశీలకులు.
దీంతో… ఉమ్మడి ప్రకాశం జిల్లా పాలిటిక్స్‌లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది.