ఆ నియోజకవర్గంలో డబ్బుకు తప్ప పార్టీ లాయల్టీకి విలువలేదా? ఆ చర్చే ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇరకాటంగా మారిందా? దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు ఆవేదనతో రాజీనామా చేయడం శాసనసభ్యురాలికి ఇబ్బంది కాబోతోందా? టీడీపీకి రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగుతుందా? లేక ఇంకా ఉందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం… హాట్ హాట్ పాలిటిక్స్‌కు ఎప్పుడూ కేరాఫ్ అడ్రస్. మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల దాడులు, వసూళ్ళ ఆరోపణలు, పోలీస్ కేసులతో తరచూ వివాదాస్పదమవుతున్న సెగ్మెంట్. ఇవన్నీ కలగలిసి… ఓవైపు…. అఖిలప్రియకు తీవ్ర ఇబ్బందిగా మారిన క్రమంలో…. మరోవైపు స్థానికంగా మారుతున్న పరిణామాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. అన్నిటికీ మించి చాలా కాలంగా టీడీపీలో కొనసాగుతున్న, నమ్మకమైన నాయకులు ఇప్పుడు పార్టీకి గుడ్‌బై చెప్పడం హాట్ టాపిక్ అయింది. వాళ్ళు ఏకంగా పదవులకు రాజీనామా చేయడంతో ఆళ్లగడ్డ నియోజకవర్గం రాజకీయాలు వేడెక్కాయి. సిరువెళ్ల మండలం గుంపరమాన్ దిన్నె ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త, నీటిసంఘం అధ్యక్షుడు కుందనూరు మోహన్ రెడ్డి టీడీపీకి, తమ పదవులకు రాజీనామా చేశారు.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామా చేశారంటే వేరుగానీ… ఇప్పుడు, ఇంకా నాలుగేళ్లపాటు అధికారం ఉన్న టైంలో నమ్మకమైన, పాత నేతలు రిజైన్ చేశారంటే…వెనక చాలా బలమైన కారణమే ఉండి ఉంటుందన్న చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయవర్గాల్లో. దీంతో.. భూమా నాగిరెడ్డి, శోభా దంపతుల హయాం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న కుందనూరు మోహన్ రెడ్డి, తులసమ్మ రాజీనామాలపై ఆరాలు పెరిగిపోయాయట. మొత్తం నియోజకవర్గం మీద ప్రభావం చూపే నాయకులు కాకున్నా… దశాబ్దాలుగా నమ్మకంగా ఉన్నవాళ్లు ఇప్పుడెందుకు వదిలేశారు, వాళ్ళకు అంత అన్యాయం ఏం జరిగింది, దీని ప్రభావం నియోజకవర్గంలో ఇతరుల మీద కూడా ఉంటుందా అన్న చర్చలు నడుస్తున్నాయి ఆళ్ళగడ్డలో. దీని గురించి ఎవరికి నచ్చిన విశ్లేషణలు వాళ్ళు చేసేకుంటూ… ఇంకా రక్తి కట్టిస్తున్నారు. ఎవరేం మాట్లాడుతున్నా…అటు కుందనూరు మోహన్ రెడ్డి, తులసమ్మ దంపతులు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. పార్టీలో మాకు గుర్తింపు లేదు, పనులు కావడం లేదు, అలాంటపుడు ఇక్కడ ఎందుకనుకుని రాజీనామా చేసినట్టు చెప్పేస్తున్నారట.
అంగన్‌వాడి టీచర్ పోస్ట్ కోసం సిఫార్సు చేస్తే తమ మాటకు విలువ లేదుగానీ… డబ్బులకు విలువ ఉందని మోహన్ రెడ్డి దంపతులు ఫీలవుతున్నట్టు ప్రచారం ఉంది. తమ గ్రామ పరిధిలో ఉన్న రోడ్డు పనులు తమ ప్రమేయం లేకుండా ఇతరులు దక్కించుకున్నారన్న బాధ ఉందట వాళ్ళలో. పార్టీ కోసం, భూమా కుటుంబం కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నామని, టీడీపీ గెలుపు కోసం కృషి చేశామని, అయినా సరే… అధికారం వచ్చాక ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇక ఎందుకు కొనసాగాలని రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. ఈ దంపతుల రాజీనామాలను ఇప్పటి వరకు పార్టీ ఆమోదించలేదు. దీంతో పార్టీ పెద్దలు బుజ్జగిస్తారా లేక వదిలేస్తారా అన్న చర్చలు నడుస్తున్నాయి. వ్యవహారం వీరి రాజీనామాలతో ఆగిపోతుందా…లేక మరికొందరు ఇదే బాట లో నడుస్తారా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి జిల్లా రాజకీయ వర్గాల్లో. ప్రత్యర్థి పార్టీల వాళ్ళో, లేదా సొంత పార్టీలోనే పడని వాళ్ళో ఆరోపణలు చేసినా, వ్యతిరేక ప్రచారం చేసినా పెద్దగా ప్రాధాన్యత వుండదని, కానీ… ఏళ్ళుగా భూమా కుటుంబాన్ని అంటి పెట్టుకొని ఉన్నవాళ్లు ఆవేదనతో రాజీనామా చేయడం మాత్రం ఎమ్మెల్యే అఖిలప్రియకు ఇబ్బందేనని అంటున్నారు. వీళ్ల రాజీనామాల ద్వారా…. అఖిల హయాంలో నియోజకవర్గంలో డబ్బుకు తప్ప… లాయల్టీకి విలువ లేదని అర్ధమవుతోందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తంగా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో వరుస పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నది టీడీపీ వర్గాల అభిప్రాయం.