ఆ ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి కేవలం ఉత్సవ విగ్రహంలా మారిపోయారా? అసలు అలాంటి వ్యక్తి ఒకరున్నారన్న సంగతిని అదే జిల్లాకు చెందిన సీనియర్ మినిస్టర్స్‌తో పాటు ఉన్నతాధికారులు సైతం మర్చిపోయారా? ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా మారింది? ఏయే సమీకరణలు తేడా కొడుతున్నాయి? కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు కేరాఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా. మామూలుగా పార్టీలో వ్యవహారాలే తేడాగా ఉంటాయని అనుకుంటే… అందులోనూ… నల్లగొండ మేటర్స్ ఇంకాస్త తేడాగా ఉంటాయంటూ హస్తం నేతలే చమత్కరించుకుంటూ ఉంటారు. వాళ్ళ చమత్కారాల సంగతేమోగానీ…. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం డిఫరెంట్‌గానే కనిపిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకవైపు, సీనియర్ నేతలు జానారెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరొక వైపు.. పలువురు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా హస్తం పార్టీకి కంచుకోటే. దాంతో… జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి పార్టీ పెద్దలు సైతం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. ఇలాంటి వాతావరణంలో ఇక ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండటమంటే కత్తి మీద సామేనన్నది విస్తృతాభిప్రాయం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా సీనియర్ అయిన తుమ్మల నాగేశ్వరరావును నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి కీలక సమీక్షలు జరిగాయి. నిర్ణయాలు, ముఖ్యనేతల పర్యటనలు, పార్టీ కార్యక్రమాలు, పదవుల పంపకాలు అన్నీ తుమ్మల సూచనలతోనే జరిగేవి. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకునే వారట. అధికారులు కూడా ఇన్ఛార్జ్ మంత్రికి సమాచారం లేకుండా ఏ నిర్ణయం తీసుకునేవారు కాదు. కానీ… అదంతా గతం. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిందనే చర్చ పార్టీలో, ప్రభుత్వ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. పరిపాలనాపరమైన కొన్ని మార్పులు చేర్పుల్లో భాగంగా… అడ్లూరి లక్ష్మణ్‌కు జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
ఆ హోదాలో జిల్లాకు వచ్చిన మొదటిసారి ఆయనకు ఘన స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ఇక తమ పని అయిపోయిందని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడసలు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒకరున్నారన్న సంగతి కూడా మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నారట. ఏ విషయంలోనూ… ఎవ్వరూ ఆయన్ని సంప్రదించడం లేదని చెప్పుకుంటున్నారు. అడ్లూరి తమకంటే జూనియర్ కావడం వల్లే…. జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పట్టించుకోవడం మానేసినట్టు కాంగ్రెస్ శ్రేణులే మాట్లాడుకుంటున్నాయి. అడ్లూరి బాధ్యతలు తీసుకున్నాక మూడు, నాలుగు కార్యక్రమాలకు మాత్రమే ఆయన్ని పిలిచారు. ఏ సమీక్షగాని, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోగాని ఇన్ఛార్జ్ మంత్రికి భాగస్వామ్యం ఇవ్వలేదు. అంతేకాదు…. కొద్దిరోజుల క్రితం నల్లగొండకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వస్తున్నసమాచారం కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్‌కు ఇవ్వలేదట. ఆ విషయంలో అధికారులు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదనే విమర్శలున్నాయి. సీనియర్ మంత్రులకు మేమేం తక్కువకాదన్నట్టుగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారట. దీంతో… అధికారులు బాధ్యతలు మరిచారా లేక జిల్లా మంత్రులకు భజన చేస్తున్నారా అని మండిపడుతున్నారు కొందరు. ఈ పరిణామాలను గమనిస్తున్న ఇంకొందరు మాత్రం… యథా మంత్రులు… తధా అధికారులు అంటూ పెదవి విరుస్తున్నారు. ఇటు సీనియర్ మంత్రుల నిర్లక్ష్యం… అధికారుల వ్యవహారిస్తున్న తీరుతో ఉమ్మడి జిల్లాలో ఏం పనులు జరుగుతున్నాయో కూడా ఇన్చార్జ్ మంత్రికి కనీస సమాచారం ఉండటంలేదంట. తన ప్రమేయం లేకుండానే… ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సమావేశాలు, సమీక్షలు, కీలక నిర్ణయాలు జరిగిపోతున్నాయని తెలిసి కూడా బయటకు చెప్పుకోలేని స్థితిలో మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉందట. దీంతో…ఈ పరిణామాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయని, ఇది ఇంకా ముదిరితే సీనియర్ మినిస్టర్స్‌కు మచ్చలు తప్పవని అంటున్నారు. ఈ వ్యవహారం ఇంకాస్త ముదిరి కులాల కోణంలో చర్చ జరిగి… రచ్చ కాకముందే జిల్లా మంత్రులు జాగ్రత్త పడితే బెటర్ అన్నది పొలిటికల్ పండిట్స్ సలహా. చేతులు కాలాక ఆకులు పట్టుకునే బదులు ఆ జాగ్రత్తేదో ముందే తీసుకుంటే… వాళ్ళ గౌరవం కూడా నిలబడుతుందన్న సలహాలు వినిపిస్తున్నాయి.