డీసీసీల నియామకంపై కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య వైరం కొనసాగుతోంది. ముఖ్యంగా ఏడు జిల్లాలపై మొదలైన కుస్తీ.. కత్తులు దూసుకునేలా మారింది. ఆ ఏడింటిని ఎందుకు ఆపారు? ఆ ఏడు DCCల విషయంలో ఏం జరిగింది?
సమన్వయ లోపంతో ఏడుచోట్ల డీసీసీల ప్రకటనకు బ్రేక్
పీసీసీ కమిటీల ప్రకటన సమయంలో తెలంగాణలోని 26 జిల్లాలకు మాత్రమే కాంగ్రెస్ అధ్యక్షులను ప్రకటించింది పార్టీ అధిష్ఠానం. ఏడింటిని వాయిదా వేసింది. ఇటీవల సీనియర్ల భేటీ తర్వాత మీడియా ముందుకు వచ్చిన పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఆపిన ఆ ఏడు డీసీసీల అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ గెలిచిన చోట అధ్యక్షుల నియామకం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు ఉత్తమ్. సీనియర్లు.. పీసీసీ చీఫ్ రేవంత్ మధ్య సమన్వయ లోపంతోనే డీసీసీల నియామకం వాయిదా పడిందనే ప్రచారం జరుగుతోంది. ఎవరికివారు తమ నాయకుడిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలని పట్టుబట్టడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.
సికింద్రాబాద్ డీసీసీపై పీటముడి
సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో రేవంత్, ఉత్తమ్ మధ్య పోటీ ఉంది. సికింద్రాబాద్ జిల్లా పార్టీ పగ్గాలను మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అనిల్‌కు ఇవ్వాలని రేవంత్ చూస్తుండగా.. పార్టీ నేత ఆడెం సంతోష్‌కు ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేయడంతో పీటముడి పడింది. అంజన్ కుమార్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండగా.. ఆయన కుమారుడు అనిల్‌కు డీసీసీ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. జనగామ డీసీసీ విషయంలో మూడు ముక్కలాట సాగుతోంది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఒకరి పేరును సూచిస్తే.. జంగా రాఘవరెడ్డి కోసం ఉత్తమ్.. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి రేవంత్ మద్దతుగా నిలిచారు. ముగ్గురు పార్టీలో కీలక నేతలు కావడంతో ప్రకటన కొలిక్కి రాలేదు.
సికింద్రాబాద్‌కు సూర్యాపేటకు లంకె ..?
భూపాలపల్లిలో కూడా మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పీసీసీ చీఫ్‌ల మధ్య పోటీతో డీసీసీ ప్రకటన వాయిదా పడిందట. అధ్యక్ష పదవిని ప్రకాష్‌రెడ్డికి ఇవ్వాలని సూచించారు శ్రీధర్‌బాబు. అయితే ఇక్కడ గండ్ర సత్యనారాయణకి పగ్గాలు ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ ఉన్నారట. ఆ హామీతోనే గండ్రను కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్టు రేవంత్ వర్గం చెబుతోంది. అయితే శ్రీధర్‌బాబు మెట్టుదిగకపోవడంతో భూపాలపల్లి పెండింగ్‌లో పడింది. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వెంకన్నను కొనసాగించాలని ఉత్తమ్‌తోపాటు మాజీమంత్రి దామోదరరెడ్డి సూచించారు. సికింద్రాబాద్ డిసిసి విషయంలోఉత్తమ్ అడ్డుపడ్డారని.. సూర్యాపేటను రేవంత్ ఆపినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో రేవంత్‌పై దామోదర్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. రేవంత్, ఉత్తమ్ వార్ మధ్యలో ఇబ్బంది పడుతున్నారట దామోదర్‌రెడ్డి.
సంగారెడ్డిలోనూ నేతల తకరారు
సంగారెడ్డి డిసిసి చీఫ్‌గా ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల పనిచేశారు. మళ్లీ నిర్మలనే కొనసాగించాలని జగ్గారెడ్డితోపాటు దామోదర రాజనర్సింహ కోరారట. అయితే పీసీసీ మాత్రం గత ఎన్నికల్లో పటాన్చెరు నుంచి పోటీ చేసిన కాట శ్రీనివాసగౌడ్‌కు జిల్లా పార్టీ బాధ్యతలు ఇవ్వాలని రేవంత్ భావించారట. దాంతో సంగారెడ్డి విషయంలోనూ వర్గపోరు కీలకంగా మారింది. ఇప్పటికే సీనియర్ల పంచాయితీ కాక మీద ఉన్న సమయంలో ఏడు డీసీసీల అంశాన్ని నాన్చుతారో… తేల్చుతారో చూడాలి.