బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా JP నడ్డాకు కొనసాగింపు దక్కింది. మరి.. రాష్ట్రాల్లోని బీజేపీ సారథుల పరిస్థితి ఏంటి? వాళ్ల పదవులకూ పొడిగింపు ఉంటుందా.. మారుస్తారా? తెలంగాణలో బండి సంజయ్ పరిస్థితి ఏంటి?
నడ్డా పదవీకాలం వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగింపు
బీజేపీలో పార్టీ అధ్యక్షుల పదవికాలం మూడేళ్లు. జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా బాధ్యతలు చేపట్టి ఈ నెల 20కి మూడు సంవత్సరాలు. ఈ నెల 16, 17న జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నడ్డాకు మరో టర్మ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది పార్టీ. ప్రధాని మోడీ.. నడ్డా కాంబినేషన్‌లో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది బీజేపీ. ఆ మేరకు ఆయన పదవి కాలాన్ని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించారు. బీజేపీలో సంస్థాగత ఎన్నికలు జరగక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల వరకు వరసగా వివిధ రాష్ట్రాల ఎలక్షన్స్ ఉండడంతో ఆలోపు సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం లేదు. సంస్థాగత ఎన్నికలపై ఫోకస్ పెడితే సాధారణ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం పడుతుందనేది కమలనాథుల అభిప్రాయం.
తెలంగాణలో బండి సంజయ్ పదవీకాలం పరిస్థితి ఏంటి?
ఇదంతా బాగానే ఉన్నా.. నడ్డా పదవీకాలం పొడిగించడంతో.. రాష్ట్రాల్లోని బీజేపీ అధ్యక్షుల పరిస్థితి ఏంటనే చర్చ కాషాయ శిబిరంలో ఉంది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల పదవీకాలం ముగిసింది. ఇప్పుడు వారిని కొనసాగిస్తారా లేక కొత్త వారిని తీసుకొస్తారా అనేది పార్టీ స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదవి కాలం కూడా ఈ మార్చితో ముగుస్తుంది. దాంతో అధ్యక్షుడి మార్పుపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ అంశంపై బీజేపీ పెద్దల నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో రోజు రోజుకీ మార్పు ప్రచారమే పార్టీ వర్గాల్లో కీలకంగా మారిపోతోంది.
ప్రస్తుత రాష్ట్రాల అధ్యక్షులను కొనసాగించాలనే రూల్ ఏమీ లేదా?
జేపీ నడ్డాకు పొడింపు ఇవ్వడంతో రాష్ట్రాల్లోని బీజేపీ అధ్యక్షులకు కూడా ఎక్స్‌టెన్షన్ ఇవ్వొచ్చన్న ఆశ పలువురు రాష్ట్ర అధ్యక్షుల్లో కనిపిస్తోంది. అయితే నడ్డాకు పదవీకాలం పొడిగించినంత మాత్రాన రాష్ట్రాల అధ్యక్షులను కూడా కొనసాగించాలనే రూల్ ఏమీ లేదని.. పార్టీ నిబంధనలు లేవని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రత్యేకించి బండి సంజయ్ విషయంలో రెండు రకాల వాదనలు ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది కనుక ఈలోగా బండిని కదపక పోవచ్చని ఒక వాదన. అయితే వచ్చే ఒకటి రెండు నెలల్లో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ కేబినెట్ విస్తరణ అంటూ ఉంటే తెలంగాణ నుంచి బండికి కూడా కేబినెట్‌లో స్థానం దొరికే ఛాన్స్ ఉంది. అప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మరొకరికి ఇవ్వక తప్పని పరిస్థితి.