ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ నేత సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీకి ఇన్‌ఛార్జ్ కూడా ఉన్నారు. కానీ ఆ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో పెద్దఎత్తున లాబీయింగ్ జరుగుతోంది. ఒక్కొక్క పార్టీ నుండి నలుగురు అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపుతుండటంతో ఆశావహుల లిస్ట్ రోజురోజుకు పెరిగిపోతోంది. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు… ఇలా ఆ జాబితా కాస్తా ఎక్కువే ఉంది. అక్కడ పోటీకి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎందుకంత ఉత్సాహంగా ఉన్నారు? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? జస్ట్ వాచ్ ఇట్.
గుంటూరు పశ్చిమలో పెరిగిన ఆశావహులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆశావహుల లిస్టు రోజురోజుకు పెరుగుతోంది. ఈ నియోజకవర్గం గుంటూరు నగరం నడిబొడ్డున ఉంది. జిల్లాలో ఎవరు ఎక్కడ తిరిగినా గుంటూరు ప్రాంతానికి క్యూ కడతారు. కీలక నాయకుల నివాసాలు ఇక్కడే ఉన్నాయి. దీంతో ఈ నియోజకవర్గంలో గ్రిప్ ఉంటే నాయకుల మీద పెత్తనం మొత్తం మనమే చేయొచ్చన్న ఆలోచన ఒకవైపు, జిల్లా కేంద్రానికి హెడ్ క్వార్టర్‌గా ఉన్న నియోజకవర్గం కావడం మరోవైపు ఉండటంతో ఇక్కడ పోటీ చేయడానికి మాత్రం అనేకమంది నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రధానంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పలువురు నేతలు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు హబ్బో చెప్పుకుంటే పెద్ద క్యూనే ఉంది.
బాపట్ల, పల్నాడు జిల్లాలోని ఇద్దరు కీలక నేతలు
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మద్దాలిగిరి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి మళ్లీ తనకే పార్టీ టికెట్ దక్కుతుందని ఆశతో ఆయన ఉన్నారు. అయితే ఇక్కడ పోటీ చేయడానికి మాజీ డిప్యూటీ స్పీకర్‌తో పాటు ప్రస్తుత మంత్రి పోటీ పడుతున్నారని సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల ప్రకారం… ప్రస్తుతం బాపట్ల, పల్నాడు జిల్లాలో ఉన్న ఇద్దరు కీలక నాయకులు అధిష్టాన పెద్దల సూచనతో గుంటూరు పశ్చిమలో పోటీకి ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరి నియోజకవర్గాల్లో వీరిపై వ్యతిరేకత రావడంతో… అధిష్టానం గుంటూరు వెస్ట్‌ను ఆప్షనుగా తీసుకోమని చెప్పిందట. దీంతో ఈ నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ఈ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ అప్పి రెడ్డి ప్రజాక్షేత్రంలో గెలవాలన్న ఆలోచనలో ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ నుండి మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ పోటీ చేస్తే… కుల సమీకరణలో భాగంగా నేను పోటీ చేస్తానని మేయర్ కావటి మనోహర్ కర్చీఫ్ వేసుకొని కూర్చున్నారు. ఇలా అధికార పార్టీలో ఒక సీటుపై నలుగురు నాయకులు కన్నేశారు.
టీడీపీలో కూడా సేమ్ టు సేమ్ సీన్
ఇక ప్రతిపక్ష టీడీపీలో కూడా సేమ్ టు సేమ్ సీన్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కోవెలమూడి రవీంద్ర ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ సీటు కోసం ప్రయత్నిస్తూ… ఆ దిశగా ఆయన పని చేసుకుపోతున్నారు. అయితే ఈసారి గుంటూరు వెస్ట్ నుంచి నేనే పోటీ చేస్తానంటూ ఎన్నారై మన్నవ మోహనకృష్ణ కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక కాపుల కోటాలో టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పావులు కదుపుతున్నారు. ఒకవేళ పొత్తులు పొడిస్తే… కన్నా లక్ష్మీనారాయణ ఇక్కడి నుండే పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. పొత్తులు కుదిరితే… మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను తెనాలి నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకురావాలన్న ఆలోచనలో టీడీపీ పెద్దలు ఉన్నారట.
గుంటూరు పశ్చిమ సీటుకి భలే గిరాకీ
మొత్తంమీద గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటుకి భలే గిరాకీ కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని ఆశావహులు ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలో ఇంత మంది కన్నేసి ఉండటంతో… సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలి గిరికి, ఇక్కడి టీడీపీ ఇన్‌ఛార్జ్‌కి ఏం చేయాలో పాలుపోక నీళ్లు నములుతున్నారని టాక్. మరి పోటీ చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో తెలియాలంటే… వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.