గుడివాడ టీడీపీలో కొత్త పంచాయతీ తెరమీదకు వచ్చింది. పార్టీ టికెట్ ఆశిస్తూ ఓ NRI చేస్తున్న హడావిడితో.. అక్కడ రావి వెంకటేశ్వరరావుతో కోల్డ్‌వార్ మొదలైందట. గతంలో ఇదేవిధంగా వచ్చిన కొందరు కొన్నాళ్లు చర్చల్లో ఉన్నా తర్వాత సోదిలో లేకుండా పోయారు. NRI మాత్రం పక్కా స్కెచ్‌తోనే ఫీల్డ్‌లోకి దిగినట్టు కనిపిస్తోంది.
కొడాలిని ఢీకొట్టే నేత ఎవరు అని టీడీపీలో చర్చ
గుడివాడ నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో అందరికళ్లు ఈ సీటు మీదే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడను ఎలాగైనా సరే తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ చూస్తోంది. టీడీపీ అధినేతను.. ఆయన కుమారుడిని ఓ రేంజ్‌లో విమర్శిస్తున్న నానిపై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. సొంత సామాజికవర్గంలోనూ మాజీ మంత్రిపై వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. కొడాలి నానిపై టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టినా.. గుడివాడలో మాజీ మంత్రిని ఢీకొట్టే సమర్థుడైన నాయకుడు ఎవరనేది సైకిల్ పార్టీలో పెద్ద బ్లాంక్. సరైన అభ్యర్థి దొరకడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు.
బలమైన అభ్యర్థి టీడీపీకి తారస పడటం లేదా?
గుడివాడ టీడీపీ ఇంఛార్జ్‌గా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. కొడాలి ముందు రావి బలం.. బలగం ఏ మాత్రం సరిపోదనే చర్చ పార్టీలోనే ఉందట. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఎన్నికల్లో దేవినేని అవినాష్‌ను టీడీపీ బరిలో దించింది. అవినాష్‌పై స్థానికేతరుడనే ముద్ర వేయడం.. కాపు సామాజికవర్గం ఓట్లు జనసేనకు మళ్లడంతో నాని గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం పక్కాగా అడుగులు వేయాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఆ ఆలోచనలకు తగ్గట్టుగా బలమైన అభ్యర్థి అధిష్ఠానానికి తారసపడటం లేదట. రకరకాల పేర్లు చర్చల్లోకి వస్తున్నా.. అవి వర్కవుట్ కావడం లేదు. తాజాగా NRI వెనిగండ్ల రాము గుడివాడలో ఎంట్రీ ఇచ్చారు. ఇదే నియోజకవర్గానికి చెందిన ఆయన కొత్త సమీకరణాలతో అడుగుపెట్టారట.
టీడీపీ టికెట్ తనకే అని తిరుగుతున్న వెనిగండ్ల రాము
రాము కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడే అయినప్పటికీ.. ఆయన భార్యది ఎస్సీ సామాజికవర్గం. ఆ కాంబినేషన్ గుడివాడలో వర్కవుట్ అవుతుందని టీడీపీ పెద్దల ముందు చర్చకు పెట్టారట రాము. అధిష్ఠానం ఆయనకు ఏం చెప్పిందో ఏమో.. రాము మాత్రం టీడీపీ టికెట్ తనకే కన్ఫామ్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. పార్టీ పెద్దలు చెప్పబట్టే ఆయన గుడివాడలో తిరుగుతున్నారనేవాళ్లూ ఉన్నారు. ఏదో సాదాసీదాగా కాకుండా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు రాము. ముందుగా ఎస్సీ ఓట్లను టార్గెట్ చేస్తూ.. ఎస్సీ పల్లెల్లో పర్యటనలు చేస్తున్నారు. చర్చిలకు వెళ్లి.. క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నారు. అయితే టీడీపీ బ్యానర్‌పై కాకుండా వ్యక్తిగతంగా కానుకలు ఇస్తున్నారు.
రాము పర్యటనలపై రావివర్గం గుర్రు
వెనిగండ్ల రాము కదలికలు.. కొడాలి నాని శిబిరంలో ఎంతటి చర్చకు దారి తీశాయో కానీ.. టీడీపీ ఇంఛార్జ్ రావి వెంకటేశ్వరరావు క్యాంపులో మాత్రం సెగలు పుట్టిస్తోందట. ఇప్పటికే ఓవైపు పిన్నమనేని ఫ్యామిలీతో తలనొప్పులు ఉన్నాయని అనుకుంటే.. మధ్యలో శిష్ట్‌లా లోహిత్ వచ్చి రావిని కొంత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు రాము వంతు వచ్చిందని కలవర పడుతున్నారట. టీడీపీకి చాలా కాలంగా అండగ ఉంటున్నా.. తమకు కాదని గతంలో కొడాలి నానికి టీడీపీ టికెట్ ఇచ్చినా ఏమీ అనలేదని.. గత ఎన్నికల్లోనూ అదే జరిగిందని గుర్తు చేసుకుంటున్నారట. ఇప్పుడు కూడా రాము పేరు చెప్పి సీన్ రిపీట్ చేస్తే టీడీపీలో తమకు గౌరవం ఏముంటుందని రావి వర్గం వాదిస్తోందట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోన్న రావికి.. రాము కదలికలు ఎంత మాత్రం నచ్చడం లేదట. పైకి చెప్పలేకపోయినా.. టీడీపీ అధినేత తీరుపైనా రావి గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల ఓ కార్యక్రమంలో రావి-రాము కలిసి మాట్లాడుకున్నారు. అక్కడేం ఒప్పందం జరిగిందో ఏమో.. ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గుతుందా లేదా అని తెలుగు తమ్ముళ్లు ఆరా తీస్తున్నారట.