ఆయన ఇన్నాళ్లూ వివాదాలకు చాలా దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం వివాదాల్లో మునిగి తేలుతున్నారు. సొంత పార్టీలోనే రాజకీయ ఘర్షణలకు.. మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో ఆయన తీరు ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఎందుకు ఆయన వైఖరిలో మార్పు వచ్చింది?
వరుస వివాదాల్లో చిన్నారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్‌లో వనపర్తి రాజకీయం రంజుగా మారింది. సొంత పార్టీ నాయకులు లొల్లితో దుమారం రేగుతోంది. మాజీ మంత్రి చిన్నారెడ్డి.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి మధ్య అస్సలు పడటం లేదు. నియోజకవర్గంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఈ క్రమంలో మాజీ మంత్రి వివాదాల్లో చిక్కుకుంటున్నారా? లేక వివాదాలు చిన్నారెడ్డి వరకు వెళ్తున్నాయా? అనేది అసలు చర్చ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక.. చిన్నారెడ్డి తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. దీంతో వనపర్తి నియోజకవర్గంపై శివసేనారెడ్డి దృష్టిపెట్టారు. సమస్య ఇక్కడే మొదలైంది. శివసేనారెడ్డి గ్రౌండ్‌లో ప్రచారం చేసుకోని కేడర్‌ను తనవైపు తిప్పుకొంటున్నారు. అయితే రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. చిన్నారెడ్డికి మళ్లీ వనపర్తిపై ఆశలు చిగురించాయట. పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చారట. వనపర్తిలో దూరమైన కేడర్‌ను దగ్గర చేసుకునే పనిలో పడ్డారు. ఈ పరిణామాలే వనపర్తి కాంగ్రెస్‌లో నిప్పు రాజేశాయి.
చిన్నారెడ్డిపై పార్టీ పెద్దలకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫిర్యాదు
చిన్నారెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర సన్నాహక సమావేశం దుమారం రేపుతోంది. చిన్నారెడ్డికి.. డీసీసీ మాజీ అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్ మధ్య రేగిన గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. చిన్నారెడ్డి అదునుగా తీసుకుని శంకర్ ప్రసాద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ హోదాలో చిన్నారెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని గాంధీభవన్ ముందు ధర్నా చేశారు వనపర్తి కాంగ్రెస్ నేతలు. ఇంతలో శివసేనారెడ్డి వెంట ఉన్న నాయకులపై వేటు వేయడం మెదలు పెట్టారు. ఈ అంశంపై ఆ మధ్య హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌కి.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిలకు శివసేనారెడ్డి ఫిర్యాదు చేశారు.
తాడోపేడో తేల్చుకునేందుకు చిన్నారెడ్డి వ్యతిరేకులు సిద్ధం..?
ఇప్పుడు చిన్నారెడ్డి వనపర్తిలో కొత్త వివాదానికి తెరలేపారు. నియోజకవర్గంలోని యూత్ కాంగ్రెస్ వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు. పదవులు ఇచ్చేస్తున్నారట. దీనిపై శివసేనారెడ్డి కౌంటర్ అటాక్‌కి సిద్ధమయ్యారట. మాజీ మంత్రి చర్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యిందని చెవులు కొరుక్కుంటున్నారు. యూత్ కాంగ్రెస్ నియామకాలు చిన్నారెడ్డి ఎలా చేపడతారని శివసేనారెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీంతో తాడోపేడో తేల్చుకోవడానికి నిర్ణయం తీసుకున్నారట శివసేనారెడ్డి. పార్టీ పెద్దలు ఈ సమస్య పరిష్కారానికి జోక్యం చేసుకోకపోతే మీడియాకు ఎక్కుతానని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట ఈ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు. మరి రానున్న రోజుల్లో ఈ సమస్య ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
.