Off The Record: ముతుకుమిల్లి శ్రీభరత్….విశాఖపట్టణం ఎంపీ…!. బలమైన రాజకీయ వారసత్వ పునాది మీద భవిష్యత్ వెతుక్కుంటున్న నేత. గంటా శ్రీనివాసరావు… ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అవసరంలేని సీనియర్ పొలిటీషియన్. రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో పార్టీలైతే మారారుగానీ… ఒక్కసారి కూడా ఓడిపోకపోవడం ఈ మాజీ మంత్రి ట్రాక్ రికార్డ్. రాజకీయ పరిణితి, అనుభవంలో ఈ ఇద్దరు నేతలకు అసలు పోలికే వుండదు. కానీ… ఇప్పుడు ఇద్దరూ భీమిలి మీద పట్టుకోసం పోటీపడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇక టీడీపీ వర్గాలైతే… దీని గురించి రకరకాల విశ్లేషణలు చేసేస్తున్నాయి. భవిష్యత్ విశాఖకు దిక్సూచి కావడంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై ఎంపీ కన్నేశారనే టాక్ ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఆ దిశగా జరుగుతున్న ప్రతీ రాజకీయ పరిణామాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారట భరత్.
టీడీపీ హైకమాండ్‌కు అత్యంత సమీప బంధువు కూడా కావడంతో అడ్మినిస్ట్రేషన్ మీద ఎంపీదే పైచేయి అవుతోందని చెప్పుకుంటున్నారు. ఇక భీమిలితో సుదీర్ఘ అనుబంధం పెనవేసుకున్న గంటాకు ఇక్కడ పటిష్టమైన నాయకత్వ బలం వుంది. 2024 ఎన్నికల్లో భీమిలి తప్ప ఎక్కడి నుంచైనా పోటీ చేయమని పార్టీ హైకమాండ్ సూచించినప్పటికీ పట్టుబట్టి మరీ… ఇదే సీటు సాధించుకున్నారు ఎక్స్ మినిస్టర్. క్యాస్ట్ కార్డ్ కూడా బాగా వర్కవుట్ కావడంతో రాష్ట్రంలోనే సెకండ్ హయ్యస్ట్ మెజార్టీ దక్కింది ఆయనకు. అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎంపీ, ఎమ్మెల్యేలు సఖ్యతగానే కనిపించేవారు….అంతదాకా ఎందుకు , ఇప్పటికీ పరస్పరం ఎదురుపడితే ఎక్కడలేని ఆప్యాయతలు ఒలకబోసుకుంటారు. భరత్ మీద గంటా చూపించే వాత్సల్యం… అలాగే గంటాకు భరత్ ఇచ్చే గౌరవం బయటి నుంచి చూస్తున్న వాళ్ళకు బహు ముచ్చటగా ఉంటాయి. కానీ.. కాస్త మొహాలు అటు తిరిగాక కనిపించే ఎక్స్‌ప్రెషన్సే తేడాగా ఉంటున్నాయట. రాజకీయం దగ్గరకు వచ్చేసరికి నోటితో పలకరించి నొసటితో వెక్కిరించుకున్నట్టుగా ఉంటోందట వీళ్ళిద్దరి వ్యవహారం.
2026 T20 World Cup: 2026 టీ20 ఫైనల్ మ్యాచ్ ఈ రెండు టీంలకే.. : కెప్టెన్ సూర్య
ఒకరి ఉనికిని మరొకరు ప్రశ్నించుకునే తత్వం ఇటీవల ఎక్కువైందనే చర్చ జరుగుతోంది వైజాగ్ పొలిటికల్ సర్కిల్స్‌లో. ఆ మధ్య భీమిలి నియోజకవర్గంలో కొందరు నాయకులు ధిక్కారస్వరం వినిపించారు. ఎమ్మెల్యే ఎప్పుడు పిలుస్తారా…? అని ఎదురు చూస్తే వాళ్ళు సైతం గంటా వైఖరిపై ఫిర్యాదు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది. వాస్తవానికి సీనియర్ శాసనసభ్యుడి మీద ఏదైనా ఆరోపణ లేదా ఫిర్యాదు వచ్చినప్పుడు గుట్టుగా హైకమాండ్ పరిశీలనకు వెళ్తుంది. కానీ, అందుకు భిన్నంగా తన మీద వచ్చిన ఫిర్యాదుల గురించి ఓ వర్గం పనిగట్టుకుని విస్తృత ప్రచారం కల్పించిందన్న అభిప్రాయం గంటాకు ఉందట. ఈ పరిణామాలన్నిటినీ బేరీజు వేసుకుని ఎంపీ శ్రీ భరత్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తున్నట్టు క్లారిటీకి వచ్చిన ఎమ్మెల్యే వర్గం… కౌంటర్ స్ట్రాటజీకి రెడీ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికలకు ఇంకా దాదాపు మూడున్నరేళ్ళు వుండగానే భీమిలి సీటు విషయంలో కాక మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కూడా తాను పోటీ చేసినా… లేదంటే తన కుమారుడు రవితేజను రంగంలోకి దించినా… రాజకీయంగా కలిసి వచ్చిన ఈ స్ధానం నుంచే జరగాలని భావిస్తున్నారు గంటా.
ఒక్కసారి నియోజకవర్గాన్ని వదిలేస్తే తిరిగి పట్టు బిగించడం ఎంత కష్టమో గంటాకు అనుభవం నేర్పిన పాఠం. అందుకే ముందస్తు వ్యూహాలతో ఎంపీని కట్టడి చేసే ప్రయత్నం లోపాయికారీగా జరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు, శ్రీభరత్ కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశ్యంతో భీమిలి నియోజకవర్గంలోని సమస్యలపై ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందా…? అన్న చర్చ మొదలైంది టీడీపీ సర్కిల్స్‌లో. భీమిలి నియోజకవర్గంలో భరత్ తనకంటూ ఒక వర్గాన్ని చాప కింద నీరులా తయారు చేసుకుంటున్నారట. గంటాతో విభేదాలున్న నాయకులందరినీ ఆయన దగ్గరికి తీస్తున్నారన్న ప్రచారం వుంది. గ్రౌండ్ లెవల్‌లో కూడా భరత్ మాటే ఎక్కువగా చెల్లుబాటు కావడంతో… సహజంగానే ద్వితీయ శ్రేణి ఎంపీవైపు మొగ్గుతోందన్న డిస్కషన్ జరుగుతోంది. ఈ క్రమంలో పద్మనాభం మండలంలోని పద్మనాభ స్వామి ఆలయం మెట్ల మార్గంలో దీపోత్సవం జరిగింది. తనకు కుదరకపోవంతో ఎంపీ ఈ ఉత్సవానికి అటెండ్ అవలేదు. అదే సమయంలో ఎమ్మెల్యేగా గంటా అంతా తానై నడిపించారు. ఈనెల 19న దీపోత్సవం నిర్వహించగా….మూడు రోజుల తర్వాత పద్మనాభుడి దర్శనం కోసం జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీతో కలిసి వెళ్ళారు ఎంపీ. ఆ టైమ్‌లో ఎమ్మెల్యే గంటా ఊళ్ళో లేకపోగా సెకండ్ కేడర్ ఎవరూ శ్రీభరత్ దగ్గరకు వెళ్ళలేదు. ఒకరిద్దరు మినహా ఎవరూ ఆయన్ని కలవలేదు.
Realme Watch 5: త్వరలో భారత మార్కెట్‌లోకి రియల్‌మీ కొత్త స్మార్ట్ వాచ్..
ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఉన్న గ్యాప్ కారణంగానే అలా జరిగి వుంటుందనే గుసగుసలు ఎక్కువయ్యాయి. తన నియోజకవర్గంలోని కేడర్ ఎంపీని నేరుగా కలవకుండా గంటా పొలిటికల్ ఫెన్సింగ్ వేశారా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే… ఈ కలవకపోవడానికి పెద్ద ప్రాధాన్యం ఉండదు. స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు హంగూ ఆర్భాటం ఎందుకని ఎంపీ భావించి ఉండవచ్చు, లేదా వ్యక్తిగత పర్యటన కోసం ఆయన గుడికి మనం వెళ్ళి హడావిడి చేయడం ఎందుకని లీడర్స్ అనుకుని ఉండవచ్చు. కానీ… ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం వేరు. భీమిలి మీద పట్టు కోసం ఇద్దరూ కబడ్డీ ఆడుతున్న క్రమంలో… ఇక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ప్రత్యేకంగానే చూడాలని, నిశితంగానే గమనించాలని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మొత్తంగా భీమిలి మీద పట్టు కోసం ఎంపీ, ఎమ్మెల్యే కదుపుతున్న పావులు కాక పుట్టిస్తున్నాయి.