ఎంత పెద్ద ఉన్నతాధికారి అయినా రాజకీయ ఒత్తిళ్లకు కొన్నిసార్లు తలగ్గొక తప్పదు. కాదూ కూడదు అంటే ఉన్నచోట కుర్చీ వదిలేసుకోవాల్సిందే. ఆ జిల్లాలో కలెక్టర్ బదిలీ వెనుక కూడా అదే జరిగిందా? అధికారుల్లోనూ.. అధికారపార్టీ వర్గాల్లోనూ జరుగుతున్న చర్చ ఏంటి?
సడెన్‌గా వరంగల్ కలెక్టర్ గోపీ బదిలీ ఎందుకు?
డాక్టర్ బి.గోపి. మొన్నటి వరకు వరంగల్ జిల్లా కలెక్టర్. సడెన్‌గా బదిలీ అయ్యారు. ఆయన ప్లేస్‌లో జిల్లా కలెక్టర్‌గా వచ్చారు పి. ప్రావీణ్య. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న ప్రావీణ్యను కలెక్టర్‌గా బదిలీ చేశారు. గోపీని జీఏడీలో రిపోర్ట్ చేయమన్నారు. బదిలీ ఉత్తర్వులు రాగానే గోపీ కుర్చీ ఖాళీ చేయడం.. ప్రావీణ్య బాధ్యతలు తీసుకోవడం ఆగమేఘాలపై జరిగిపోయింది. ఎందుకు ఇంత సడెన్‌గా గోపీని బదిలీ చేశారు? ఉదయం పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన్ను సాయంత్రానికల్లా ట్రాన్స్ఫర్ చేస్తూ.. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నల చుట్టూనే ప్రస్తుతం జిల్లాలో చర్చ జరుగుతోంది.
కలెక్టర్ బదిలీలో అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు?
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు అధికారపార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు కలెక్టర్‌ను బదిలీ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పర్వతగిరి మండలం ఏనుగల్లులో ఓ క్యాంప్ నిర్వహించగా.. అక్కడికి వచ్చిన మంత్రి కేటీఆర్‌కు కొందరు నేతలు కలెక్టర్‌పై ఫిర్యాదు చేశారట. ఆ తర్వాతే బదిలీ చేశారనేది కొందరి వాదన. జిల్లాలో కొందరు తహశీల్దార్ల వైఖరిపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకపోవడంతోనే ట్రాన్స్ఫర్ చేశారనేది మరికొందరి అభిప్రాయం. ఇవేమీ కాదు.. రైతులకు చెల్లించే పంట నష్టం పరిహారంలో కలెక్టర్ గోపీ నిక్కచ్చిగా వ్యవహరించడంతో అది అధికారపార్టీ ఎమ్మెల్యేలకు నచ్చక.. బదిలీ చేయించారని కూడా చెవులు కొరుక్కుంటున్నారట.
ఎక్కువ నిధుల కోసం కలెక్టర్‌పై నేతల ఒత్తిడి..!
గత ఏడాది వడగళ్ల వానకు మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు దెబ్బతినడంతో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు పర్యటించి.. రైతులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టంపై అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. 24వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తేల్చి.. 17 కోట్ల పరిహారం మంజూరు చేశారు. అయితే పరిహారం చెల్లించే విషయంలో అధికారపార్టీ ఎమ్మెల్యేల మధ్య పోటీ ఏర్పడిందట. తమ తమ ప్రాంతాలకు ఎక్కువ నిధులు కావాలని కలెక్టర్‌పై ఒత్తిడి చేశారట. దీంతో రైతులకు పరిహారం అందలేదు. ఇంతలో విపక్షాలు సైతం ఆందోళనకు దిగాయి. చివరకు సమస్య అటు ఇటూ తిరిగి కలెక్టర్‌పై వేటు వరకు వెళ్లిందని అధికారులు, అధికారపార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నెల క్రితమే బదిలీని అడ్డుకున్న ఓ నేత..?
గోపీ వరంగల్ కలెక్టర్‌గా దాదాపు 18 నెలలు పనిచేశారు. నెల క్రితమే ఆయన్ని బదిలీ చేస్తారని అనుకున్నా.. ఒక నాయకుడు అడ్డుకున్నారని టాక్. ఇప్పుడు మరో నాయకుడి ఫిర్యాదుతో ట్రాన్స్ఫర్ తప్పలేదని అనుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఏ అంశంపై ప్రచారం జరుగుతున్నా.. పొలిటికల్ వేటుకు ఓ అధికారి బదిలీ అయ్యారనే చర్చ మాత్రం పీక్స్‌లో ఉంది.