Off The Record: అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పాట గట్టిగా పాడింది వైసీపీ. కానీ… శృతి కుదరక మొదటికే మోసం వచ్చింది. గత ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు తత్వం బోధపడి ఇప్పుడు మళ్ళీ స్టాండ్ మార్చుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అటు తాము బాగా ప్రేమించిన విశాఖ వాసులు రాజధానిని ఓన్ చేసుకోలేకపోయారు, ఇటు కర్నూలు జిల్లా వాసులు అంతగా రియాక్ట్ అవలేదు. రాజధానిని మార్చవద్దని ఆందోళన చేసిన అమరావతి వాసుల్ని వైసీపీ లెక్కచేయలేదు. ఇలా… అన్నీ కలగలిసి గట్టి దెబ్బ కొట్టేసరికి ఇప్పుడు పాత నిర్ణయాన్ని పున: సమీక్షించుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్న ఉద్దేశ్యంతోనే…తాము వికేంద్రీకరణ అన్నాం తప్ప రాజధానిని పూర్తిగా తరలించాలనుకోలేదంటూ తాజాగా గొంతు సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ లీడర్స్. దీంతో ఒక్కసారిగా అటువైపు టర్న్ అయ్యాయి రాజకీయవర్గాల కళ్ళు. వీళ్ళకి తత్వం బోథపడి ఇక మూడు రాజధానుల అంశాన్ని మూత పెట్టేసినట్టేనా అన్న చర్చలు మొదలయ్యాయి. గతంలో మూడు రాజధానుల పాటను ఆరున్నొక్క రాగంతో ఆలపించిన వైసీపీ ఇప్పుడు మాత్రం అమరావతికి మేం వ్యతిరేకం కాదుగానీ…లక్షల కోట్ల ప్రజాధనం వృథా చేయడానికి వ్యతిరేకమంటూ సన్నాయి నొక్కులు నొక్కడం వెనకున్న బలమైన కారణాలను అన్వేషించే పనిలో బిజీగా ఉన్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి ఓకేగానీ…. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ప్రజలపై భారం వేయవద్దంటూ…
Read Also: Kukatpally Murder: కూకట్‌పల్లి మర్డర్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు! చిన్న క్లూతో..
తాజాగా స్వరం సవరించుకుంది వైసీపీ. మేం అమరావతిని తరలిస్తామని ఎప్పుడూ చెప్పలేదు.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్.. న్యాయ రాజధానిగా కర్నూలు అదనంగా ఉంటాయని మాత్రమే అన్నామంటూ తెగ వివరణలు ఇచ్చుకునే పనిలో ఉన్నారు పార్టీ ముఖ్యులు. ఈసారి జగన్ అధికారంలోకి వస్తే… అమరావతి నుంచే పాలన చేస్తారన్న సజ్జల వ్యాఖ్యలతో సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. అంటే… వైసీపీ ఇక మూడు రాజధానుల మాటను మర్చిపోయినట్టేనా? అమరావతికి పూర్తి స్థాయిలో ఓటేసినట్టేనా అన్న చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో ఓటమి తర్వాత పార్టీ పెద్దలకు తత్వం బాగా బోథపడ్డట్టయిందన్న సెటైర్స్ సైతం వినిపిస్తున్నాయి. రాజధానిని తరలించే ఉద్దేశ్యం మాకు ఎప్పుడూ లేదంటూనే… గుంటూరు, విజయవాడ మధ్య ఏర్పాటు చేస్తే ఒక మహా నగరం రూపుదిద్దుకుంటుందని, బందరు పోర్టు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి వేగంగా అభివృద్ది చెందుతుందని తాజాగా అన్నారు సజ్జల. ఇలా… పార్టీ వైఖరి మారటానికి చాలా కారణాలే ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు పొలిటికల్ పండిట్స్. మూడు రాజధానుల నినాదం గత ఎన్నికల్లో గట్టి దెబ్బే కొట్టినట్టు నిర్ధారణకు వచ్చారట ఫ్యాన్ పార్టీ పెద్దలు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారన్న అభిప్రాయంతో ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అదే సమయంలో తమ ప్రాంతానికి రాజధాని వస్తే సూపర్ స్పీడ్‌గా అభివృద్ది జరుగుతుందన్న పాజిటివ్‌నెస్ విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో రాలేదు. దీంతో మొత్తంగా నష్టపోయింది వైసీపీ. అంుకే ఇప్పుడు రాజధాని విషయంలో కొత్త టర్న్ తీసుకుని అమరావతికి మేం వ్యతిరేకం కాదు అని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: Robbery : హైదరాబాద్ శివారులో 40 లక్షల దోపిడీ.. 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు.!
ఇప్పటి నుంచే ఓ క్లారిటీ ఇస్తే రాజధాని తరలింపు విషయంలో పడ్డ వ్యతిరేకత ముద్రను ఎన్నికల నాటికి చెరిపేసుకోగలుగుతామని భావిస్తోందట వైసీపీ అధిష్టానం. పనిలో పనిగా గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని అయితే… తమకు అభ్యంతరం లేదంటూ తమ వైపు నుంచి ప్రభుత్వానికి ఓ ప్రపోజల్ చేసినట్లుగా ఆ పార్టీ నేతలు మాట్లాడి ఉండవచ్చని లెక్కలు వేస్తున్నారు.. మరోవైపు వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. అమరావతిని హైదరాబాద్ తరహాలో మహానగరంగా తీర్చిదిద్దుతామని, క్వాంటం వ్యాలీ, జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుందని, గుంటూరు – విజయవాడ – తెనాలి ప్రాంతాలు కలిస్తేనే మహానగరంగా మారుతుందని అన్నారాయన. దీంతో ఇప్పుడు అందరి మాటలు అమరావతి చుట్టూనే తిరుగుతున్నట్టయింది. టీడీపీ స్టాండ్ మొదట్నుంచి అమరావతే అయినా… ఇప్పుడు మారిన వైసీపీ వైఖరి గురించే హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. గట్టి దెబ్బ తగిలాక గానీ.. ఆ పార్టీకి వివరం తెలియలేదా? ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రాజధాని విషయంలో క్లారిటీ వచ్చిందా లేక మరోసారి మనసు మార్చుకునే అవకాశం ఉందా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి రాజకీయవర్గాల్లో.