పక్కా ప్లాన్‌తో ఓ వ్యాపారిని అడ్డగించి దారి దోపిడీ చేశారు…!! ఏకంగా 40 లక్షలు కాజేసి పరారయ్యారు..! అంతలోనే ప్లాన్ రివర్స్ అయ్యింది. పారిపోతుండగా కారు బోల్తా పడింది. ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో బ్యాగులతో పరుగులు పెట్టారు. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న మరో కార్‌లో ఎస్కేప్ అయ్యారు. ఆధారాలన్నీ అక్కడే వదిలి.. ఎక్కడికి పారిపోతే ఏం లాభం !! అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ శివారులో సినిమాటిక్ రేంజ్‌లో జరిగిన ఈ రాబరీ అండ్ ఎస్కేప్ కథా చిత్రాన్ని కేవలం 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు.
హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లిలో మిట్ట మధ్యాహ్నం జరిగిన ఓ దారిదోపిడీ సంచలనం రేపింది. ఓ వ్యాపారి కారును వెంబడించి.. కారులో ఉన్న 40 లక్షలతో ఉడాయించారు దొంగలు. కారు అద్దాలు పగలగొట్టి.. కారులో ఉన్న వాళ్ల కళ్లలో కారం కొట్టి.. డబ్బుల బ్యాగ్‌తో పారిపోయారు. ఇక్కడి వరకు పక్కాగా ప్లాన్ చేసినా… పారిపోయే క్రమంలో తడబడ్డారు. తప్పించుకుని వేగంగా పారిపోయే క్రమంలో కారు ప్రమాదానికి గురైంది. దుండగులు వెళ్తున్న కారు బోల్తా పడింది…
సాయిబాబా అనే వ్యక్తి.. మధు అనే ప్రయివేట్ డ్రైవర్‌కు చెందిన కారు తీసుకుని కలెక్షన్ కోసం వెళ్లాడు. ఉదయం 11:30కు వికారాబాద్ చేరుకున్న సాయిబాబా.. అక్కడ అన్సారీ అనే వ్యాపారి నుంచి రూ.40 లక్షలు వసూలు చేసి హైదరాబాద్‌కు తిరిగి బయల్దేరాడు. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న కారును ఓ స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. అందులో నుంచి ముగ్గురు దుండగులు దిగారు. కారులో ఉన్న వారి కళ్లల్లో కారం చల్లి, కత్తులతో బెదిరించి… సాయిబాబాను కొట్టారు. రూ. 40 లక్షలను దోచుకుని తమ కారులో పరారయ్యారు. కానీ వారు వెళ్తున్న కారు శంకరపల్లి- కొత్తపల్లి మధ్య అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో నిందితులు కారు అక్కడే వదిలేసి కాలి నడకన పరారయ్యారు. కొంత దూరం వెళ్లి.. ఎస్కార్ట్‌గా తెచ్చుకున్న మరో కారులో పారిపోయారు..
ప్రమాదం జరిగింది.. కానీ కారులో ఎవరూ లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి..బోల్తా పడ్డ కారు సెట్ చేసి చూడడంతో అందులో కత్తులు, కారం పొడి ప్యాకెట్లు, డబ్బులతో ఉన్న ఓ బ్యాగ్, ఓ సెల్‌ఫోన్ దొరికాయి. ఈ విషయంపై స్టేషన్‌కు సమాచారం అందించారు. మరోవైపు అప్పటికే సాయిబాబా కంప్లెయింట్ ఇవ్వడంతో పోలీసులు.. దోపిడీ చేసి పారిపోతుంది వీళ్లేనని గుర్తించారు. ఈ క్రమంలో మొత్తం 5 టీమ్స్‌తో నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు. దోపిడీలో మొత్తం 7 మంది ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది…
ఈ కేసులో కీలకంగా డ్రైవర్ మధు పాత్ర గుర్తించారు పోలీసులు. సాయిబాబా నిత్యం డబ్బు తీసుకు వస్తున్నాడని గుర్తించి.. తన స్నేహితులు విజయ్ కుమార్, అజార్‌లకు సమాచారం ఇచ్చాడు. వారు హర్షను దోపిడీలో భాగస్వామిని చేశారు. హర్ష తన స్నేహితులు అనుదీప్, దీపక్, షమీమ్ ముల్లాలను కలిపి మరో బృందాన్ని ఏర్పాటు చేశాడు. రెండు కార్లతో ఎస్కార్ట్ కమ్ బ్యాకప్ ప్లాన్ వేసి, హుస్సేన్‌పూర్ గేట్ వద్ద రోడ్డు ఖాళీగా ఉండే సమయంలో దాడి చేశారు. ఆ సమయంలో మధు డ్రైవింగ్‌లో వేగం తగ్గించి సహకరించడంతో.. హర్ష కారు ఢీ కొట్టి దోపిడీ సులభతరం చేశాడని దర్యాప్తులో తేలింది.. మొత్తంగా నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.17.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కొంత నగదును ప్రమాద స్థలం నుంచి స్థానికంగా ఉండేవారు పట్టుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. వారి గురించి ఎంక్వైరీ చేసి డబ్బు రికరవరీ చేస్తామంటున్నారు పోలీసులు..