Site icon NTV Telugu

Off The Record: రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వెనుక పెద్దలెవరు?

Srikanth Parole

Srikanth Parole

Off The Record: అంతా శాఖాహారులే….. కానీ… బుట్టలోని రొయ్యలు మాత్రం మాయం. ప్రస్తుతం రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ పెరోల్‌ ఎపిసోడ్‌కు ఈ సామెత సరిగ్గా సరిపోతుందంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. ఈ కేసుకు సంబంధించి పేర్లు బయటికి వచ్చిన నేతలంతా… మాకు సంబంధం లేదంటే మాకు లేదంటున్నారు. కానీ… పెరోల్‌ మాత్రం వచ్చింది, రచ్చ అయ్యాక మళ్లీ శ్రీకాంత్‌ని లోపలికి నెట్టారు. కానీ.. ఇక్కడ అసలు దోషులెవరన్నది బిగ్‌ క్వశ్చన్‌. ఒక హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న, అంతకు ముందు కూడా నేర చరిత్ర ఉన్న వ్యక్తిని పెరోల్‌ మీద బయటికి తీసుకువచ్చి… అతనితో ఏం చేయిద్దామనుకున్నారన్నది మిలియన్‌ డాలర్ క్వశ్చన్‌. ఒక రౌడీషీటర్‌కు అసలు రెండు సార్లు పెరోల్‌ ఎందుకు ఇచ్చారు? ఈ ప్రభుత్వంలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలా సిఫారసు లేఖలు ఇచ్చారు? మానవతా దృక్పధంతో లెటర్‌ ఇచ్చామన్నదే వాళ్ళ సమాధానమైతే… ఒక కరుడుగట్టిన నేరస్తుడి మీద అంత మానవత్వం ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చింది? మా సిఫారసు లేఖలు రిజెక్ట్‌ అయ్యాయని ఎమ్మెల్యేలు చెబుతున్నారు సరే… మరి పెరోల్‌ వచ్చేలా పావులు కదిపింది ఎవరు? హోంశాఖలో ఉన్నతాధికారులు పావులు కదిపారా? ఇందులో అసలు హోం మంత్రి అనిత పాత్ర ఎంతవరకు? ఆమె పెరోల్‌కి అనుమతి ఇచ్చారా లేదా? ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించి ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఒకవేళ పెరోల్‌ వద్దని మంత్రి చెప్పి ఉంటే… ఆమె వద్దన్నా అదే డిపార్ట్‌మెంట్‌లో మినిస్టర్‌ మాట కాదని నేరస్తుడిని బయటికి తీసుకువచ్చింది ఎవరన్నది కూడా తేలాల్సి ఉంది.

Read Also: Pemmasani Chandrasekhar: అమరావతిపై కీలక వ్యాఖ్యలు.. సెప్టెంబర్ క్లియర్‌గా కనిపిస్తుంది..

అసలు గూడూరు ఎమ్మెల్యే సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పెరోల్ కోసం ఎవరు అప్రోచ్ అయ్యారన్న డౌట్స్‌ కూడా ఇప్పుడు పెరుగుతున్నాయట. శ్రీకాంత్‌ కుటుంబ సభ్యుల పేర్లను పైకి చెబుతున్నా… వాళ్ళని కూడా వెనక నుంచి ఏదో శక్తి డ్రైవ్‌ చేసిందన్న సందేహాలు పెరుగుతున్నాయి. శ్రీకాంత్ తండ్రి పెరోల్ కోసం తన దగ్గరకు వచ్చారని, అందుకే లెటర్ ఇచ్చానంటున్నారు కోటంరెడ్డి. అయినాసరే… తన సిఫారసు లేఖతో పెరోల్‌ రాలేదన్నది ఆయన వాదన. అదే నిజమనుకుంటే…. మరి పెరోల్ ఎలా వచ్చింది? తెర వెనక చక్రం తిప్పింది ఎవరన్నది మిస్టరీగా మారింది. ఒకవేళ శ్రీకాంత్ ప్రియురాలు నడిగంటి అరుణ పెరోల్‌ కోసం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను అప్రోచ్ అయిఉంటే…. ఆమెతో వాళ్ళకున్న సంబంధాలేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. వెనకున్న అదృశ్య శక్తి ఏదో…. శ్రీకాంత్‌ను పెరోల్‌ మీద బయటికి రప్పించి చేయకూడని పనులేవో చేయించాలనుకుందన్న చర్చ జరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఎమ్మెల్యేలు ఇద్దరూ పెరోల్ కోసం సిఫార్సు చేస్తే… విచారణ తరువాత హోమ్ మంత్రి అనిత వెనక్కి తగ్గారని, పెరోల్ అవసరం లేదని అన్నారని, ఆ తర్వాతే స్టోరీ మారిపోయిందన్నది ఇంకో వెర్షన్‌. హోమ్ మంత్రి తిరస్కరించిన వెంటనే… సీన్‌లోకి శ్రీకాంత్ లవర్…అరుణ ఎంటరైపోయి….అనితతో చర్చలు జరిపిందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి సచివాలయవర్గాల్లో. ఆ తర్వాతే పెరోల్ ఫైల్ ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్ళి ఓకే అయిందని చెప్పుకుంటున్నారు. ఇక్కడే ఒక పెద్ద డౌట్‌ వస్తోందట అందరికీ. అసలు పెరోల్‌కు హోమ్‌ మంత్రి అనుమతి ఇచ్చారా? లేదా అన్నదే ఆ అనుమానం. మంత్రే పెరోల్‌కు రికమండ్‌ చేశారా? లేక ఫైల్‌ ఆమె దగ్గరి నుంచి వెళ్ళిపోయాక దాన్ని ఆసరా చేసుకుని… డిపార్ట్‌మెంట్‌లో ఉన్నతాధికారులు చక్రం తిప్పారా అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also: Number of madrasas in Pakistan: పాక్‌లో ఫ్యాక్టరీల కంటే మసీదులు, మదర్సాలే ఎక్కువ..

అదే నిజమైతే… రౌడీ షీటర్‌ పెరోల్‌కు తెర వెనక నుంచి సహకరించిన ఆ పోలీసు అధికారులెవరో తేలాల్సి ఉంది. ఇందులో… ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలున్నాయి? ఏ పనిమీద నేరస్తుడిని బయటకొచ్చారన్న చర్చ ఇప్పుడు ఏపీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో సైతం తీవ్ర స్ధాయిలో జరుగుతోంది. ఈ వ్యవహారంపై ముందు ఎవరూ మట్లాడొద్దని ఎంత కట్టడి చేసినా… పోలీస్‌ వర్గాల్లో కూడా చర్చ ఆగడం లేదు. హోమ్ శాఖలోని కీలక అధికారి, అలాగే… ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతాధికారి నేతృత్వంలోనే పెరోల్ మంజూరైందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది సచివాలయ వర్గాల్లో. ఆ పెద్ద ఉన్నతాధికారి హోమ్ శాఖ అధికారిని తన ఛాంబర్‌కు పిలిపించుకుని మరీ… పెరోల్ ఇమ్మన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ స్థాయిలో వచ్చిన రికమండేషన్ కారణంగానే… ఆఘమేఘాల మీద ఫైల్‌ కదిలి రౌడీ షీటర్‌ బయటికి వచ్చాడని మాట్లాడుకుంటున్నారు. ఆ… పెద్ద ఉన్నతాధికారికి, శ్రీకాంత్‌ లవర్‌ అరుణకు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు రికమండ్‌ చేశాక పెరోల్ ఫైల్..ముందుకు వెళ్ళింది. కానీ… హోమ్ మంత్రి విచారణ తర్వాత ఆగింది. అదే సమయంలో ఉన్నతాధికారులు ఎంటర్ అయ్యారని, దీనికి సంబంధించి దాదాపు 2 కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ప్రచారం ఉంది. అదే నిజమైతే… ఆ డబ్బు ఎవరికి చేరింది? ఇందులో హోమ్ మంత్రి, ఇతర అధికారుల పాత్ర ఎంత అన్న విషయమై హాట్ హాట్‌ చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో ఉన్న పెద్ద అధికారి పాత్ర ఇందులో ఉన్నట్టు వాసన రావడంతో… ఇటు సర్కార్‌ పెద్దలు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారట. మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద ఒక రౌడీ షీటర్‌కు పెరోల్‌ వ్యవహారం ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ సచివాలయాన్ని కూడా షేక్‌ చేస్తోంది.

Exit mobile version