Off The Record: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వ్యవసాయ శాఖా మంత్రి ఇలాకా వనపర్తిలో రాజకీయ ముసలం పుట్టింది. అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరి పలువురు అధికారపార్టీ నాయకులు BRSకు గుడ్‌బై చెప్పి కండువా మార్చే పనిలో ఉన్నారు. ఏకంగా మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యవహార శైలిని విమర్శిస్తూ రాజీనామాలు ప్రకటించారు. వీళ్లంతా బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వనపర్తి జిల్లా జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి.. వనపర్తి ఎంపిపి కిచ్చారెడ్డిలతోపాటు పలువురు సర్పంచ్‌లు, క్షేత్రస్థాయి నాయకులు బిఆర్ఎస్ ను వీడిన వారిలో ఉన్నారు. వీళ్లంతా గడిచిన ఎన్నికల్లో నిరంజన్‌రెడ్డి విజయానికి శ్రమించిన వారు కావడంతో అలజడి మొదలైంది.
Read Also: Off The Record: భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా..? ఏ పార్టీ నుంచి పోటీ..?
ఒక్కోక్కరు ఒక్కో అంశంలో మంత్రితో విభేదించి.. గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో జడ్పీ ఛైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డికి, మంత్రికి కొన్నాళ్లుగా పడటం లేదు. మంత్రి జోక్యంపై అధికారుల ముందే జడ్పీ ఛైర్మన్ తన అసహనాన్ని ప్రదర్శించారు. ఎంపీపీ మేఘారెడ్డి సైతం కొంత కాలంగా మంత్రితో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. మేఘారెడ్డి చేసిన కాంట్రాక్టు పనులకు సంబంధించి వందల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని రాకుండా మంత్రే అడ్డుకుంటున్నారనేది ఎంపీపీ ఆరోపణ. అందుకే వనపర్తితో మంత్రితో పడని నేతలను, ప్రజాప్రతినిధులను పోగేసి పార్టీ మారే ప్లాన్ వేసినట్టు చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడి వచ్చినట్టు టాక్.
రాజీనామాల సెగ గట్టిగా తగలడంతో మంత్రి నిరంజన్‌రెడ్డి ఆలస్యంగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పలువురు అసంతృప్తి నేతలను పిలిచి మాట్లాడినట్టు సమాచారం. లోక్‌నాథ్‌రెడ్డి, మేఘారెడ్డిలతో ఇతర నేతలు వెళ్లకుండా కట్టడి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గులాబీ పార్టీని వీడే ఆలోచనలో ఉన్న కొందరు నేతలు, కౌన్సిలర్లతో మంత్రి మాట్లాడారట. పనిలో పనిగా జడ్పీ ఛైర్మన్, ఎంపీపీ పదవులకు ఎసరు పెట్టేలా ఎత్తుగడ వేస్తున్నారట మంత్రి. వాళ్లెలాగూ పార్టీకి రాజీనామా చేయడంతో అవిశ్వాస తీర్మానాలు పెట్టి.. పదవుల నుంచి దించే వ్యూహాలు రచిస్తున్నారట. మొత్తానికి ఎవరి ఎత్తుగడలు ఎలా ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వనపర్తి BRSలో ముసలం పొలిటికల్ టెంపరేచర్‌ను పెంచేసింది. రానున్న రోజుల్లో ఇది ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. పనిలోపనిగా సమస్య పరిష్కారానికి మంత్రి తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో అని ఆరా తీస్తున్నారు మరికొందరు.