Off The Record: వల్లభనేని వంశీ.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి ఎంపీగా ఒకసారి, ఎమ్మెల్యేగా రెండుసార్లు బీఫామ్స్ తీసుకున్నారాయన. ఎంపీగా ఓడినా గన్నవరం ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచారు. ఇక 2019లో టీడీపీ తరపునే గెలిచిన వంశీ నాడు అధికారంలోకి వచ్చిన వైసీపీకి జైకొట్టారు. వెళ్లేవాడు ఊరికే వెళ్ళకుండా అప్పటిదాకా తనకు ఆశ్రయం ఇచ్చిన పార్టీ మీదికి గట్టిగానే రాళ్ళు విసిరినట్టు చెప్పుకుంటారు. వైసీపీలో చేరిపోయాక వంశీ మాటలు హద్దులు దాటి పోయాయన్నది రాజకీయవర్గాల్లో ఉన్న విస్తృతాభిప్రాయం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్ సహా పార్టీ నేతలందరిపై విచ్చలవిడి వ్యాఖ్యలు చేశారంటూ… తమ హిట్ లిస్ట్ టాప్‌లోనే పెట్టారు తెలుగుదేశం నాయకులు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ బీఫాం మీద గన్నవరం నుంచే పోటీ చేసి ఓడిపోయారు వల్లభనేని. అలాగే రాష్ట్రంలో కూడా పవర్ మారిపోయి కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి వంశీ అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే వంశీ నివాసంపై దాడికి ప్రయత్నించాయి టీడీపీ శ్రేణులు. ఇక గతంలో జరిగిన ఘటనలపై కూడా కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయటం మొదలు పెట్టడంతో వంశీ సైలెంటయ్యారు.
కానీ… కీలకమైన గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు విషయంలో ఆయన అంచనాలు, ఆలోచనలు బెడిసికొట్టాయనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. దానిమీద 2023లో కేసు నమోదైనా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ, ఆయన అనుచరుల పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్న కోర్ట్ ఆదేశాలు ఉన్నాయి. అందుకు సంబంధించి తుది తీర్పు కూడా రావాల్సి ఉంది. ఈ సమయంలో… ఇదే కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేసి బలవంతంగా కేసు విత్ డ్రా చేయించారన్న ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించే…ఆయన అరెస్టు కావటం కలకలం రేపింది. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేయలేదని, స్వచ్చందంగానే కేసు విత్ డ్రా చేసుకున్నాడనేది వంశీ వర్గం మొదటి నుంచి చెబుతున్న మాట. కానీ…. టెక్నికల్ ఎవిడెన్స్ అంటూ టీడీపీ సీసీ కెమెరా ఫుటేజ్ విడుదల చేయడంతో… మేటర్ కొత్త మలుపు తిరిగింది. తాజాగా సత్యవర్ధన్‌ని వంశీ తన అపార్ట్ మెంటుకు తీసుకెళ్తున్నప్పటి లిఫ్ట్‌లోని విజువల్స్ విడుదల చేసింది టీడీపీ. దీని ద్వారా సత్యవర్ధన్‌ను వంశీ బెదిరించారని, ఆయనే కేసు విత్ డ్రా చేయించారన్న తమ వాదనకు బలం చేకూరిందని అంటున్నారు తెలుగుదేశం నాయకులు. కేసు, విచారణ, తీర్పులు…. శిక్షలు… ఇవన్నీ లేకుండా, అసలు ఫిర్యాదునే వెనక్కి తీసుకుంటే ఏ గొడవ ఉండదన్న తెగింపుతోనే.. వంశీ ఇదంతా చేశారన్నది టీడీపీ నేతల ఆరోపణ. ఇదే సమయంలో వంశీ తీరుపై కూడా రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
ఓవైపు టీడీపీ హిట్ లిస్ట్‌లో ఉన్నాడని తెలుసు, మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని కూడా తెలుసు… అయినా సరే… అంత ధైర్యంగా కెమెరాల సాక్షిగా వ్యవహారాలు నడిపించారంటే… వంశీది తెగింపా? ఇంకేదన్నానా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన టైంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి అడ్డంగా బుక్ అయ్యాడంటూ వైసీపీలో సైతం మాట్లాడుకుంటున్నారట. తాము అధికారంలో ఉన్నప్పటికీ… అయితే ఏంటి అన్నట్టుగా… వంశీ, అసలు కేసే లేకుండా చేయాలనుకోవడాన్ని టీడీపీ అధిష్టానం, పార్టీ శ్రేణులు అవమానంగా భావించినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే… వెంటనే వంశీ యాక్షన్‌కు గట్టి రియాక్షన్ ఇవ్వాలన్నట్టుగా…ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి ఉండవచ్చన్న అంచనాలున్నాయి. మరోవైపు ఇది జస్ట్ ట్రయల్ మాత్రమేనని, వల్లభనేని వంశీకి అసలు సినిమా ముందు ముందు ఉంటుందని, బుక్ అవ్వాల్సిన కేసులు చాలానే ఉన్నాయని కసిగా కామెంట్ చేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన మీద అనేక ఫిర్యాదులు అందాయట. మట్టి తవ్వకాలు మొదలు… వచ్చిన ప్రతి ఫిర్యాదుపై ఆధారాలు సేకరించి కేసు నమోదు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారనేది లోకల్ టాక్. మరో వైపు పాత కేసుల్లో వంశీని విచారించటానికి పీటీ వారెంట్లు కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ లెక్కన మాజీ ఎమ్మెల్యేకి ఈ కేసులో బెయిల్ వచ్చినా… మరో కేసులో అరెస్టు చేయటానికి, విచారించటానికి రంగం సిద్ధమవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అధికారంలో లేనపుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి… తనను ఎవరూ ఏం చేయలేరన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌లో వంశీ ఉండవచ్చని, ఆ అంచనాలు తప్పి ఆయన ఫేట్ తిరగబడిందన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఈ స్టోరీలో ముందు ముందు ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి.