NTV Telugu Site icon

Off The Record: తెలంగాణ బీజేపీలో కేంద్ర బడ్జెట్ ప్రకంపనలు..

Bjp

Bjp

Off The Record: ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టుగా ఉందట తెలంగాణ బీజేపీ వ్యవహారం. కేంద్రం ప్రవేశ పెట్టిన జనరల్‌ బడ్జెట్‌ ఇక్కడ కాషాయ దళంలో ప్రకంపనలు రేపుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం, బడ్జెట్ స్పీచ్‌లో ఎక్కడా నిర్మలాసీతారామన్‌ తెలంగాణ పేరు ఎత్తక పోవడంపై భగ్గుమంటున్నాయి రాష్ట్ర కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌. తెలంగాణ పట్ల ప్రధాని మోడీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. పలుమార్లు ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి ఏం కావాలో వినతి పత్రాలు ఇచ్చినా.. పట్టించుకోలేదని విమర్శించారాయన. మీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తారా? మిగతా వాళ్ళు అవసరం లేదా అని కూడా ప్రశ్నించారు సీఎం. అటు బీఆర్‌ఎస్‌ కూడా అదే రీతిలో అటాక్‌ మోడ్‌లోకి వచ్చేసింది. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే… వాళ్ళు చేసింది ఏంటని ప్రశ్నిస్తోంది బీఆర్‌ఎస్‌. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోడీ ముందు మోకరిల్లారు తప్ప… వాళ్ళ హోదాతో రాష్ట్రానికి ఏం తెచ్చారు? వాళ్ళకు సొంత గడ్డ ప్రయోజనాలు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు గులాబీ లీడర్స్‌. వెంటనే వారిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

విభజన చట్టం హామీలు ఒక్క ఆంధ్రప్రదేశ్ కేనా.. తెలంగాణకు అవసరం లేదా సమాధానం చెప్పాలని కూడా అడుగుతున్నారు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు. రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఒక్కుమ్మడిగా మొదలైన ఈ దాడితో రాష్ట్ర బీజేపీ నేతలు డిఫెన్స్‌లో పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిని ఎలా సమర్ధించుకోవాలో, ఏం సమాధానం చెప్పుకోవాలో అర్ధంగాక సతమతం అవుతున్నారట టీజీ బీజేపీ లీడర్స్‌. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చెప్పుకోలేని పరిస్థితిలో… ఇంతగా విమర్శలు వస్తున్నా స్పందించలేకపోతున్నారట కేంద్ర మంత్రులు , తెలంగాణ బీజేపీ ఎంపీలు. తమ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటే… కౌంటర్‌ ఇవ్వలేని స్థితిలో ఉండటంపై బీజేపీ వర్గాల్లో సైతం చర్చ జరుగుతోందంటున్నారు.

దీంతో ఇప్పుడీ సమస్య నుంచి కాషాయ దళం ఎలా బయట పడుతుందని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణకు కేటాయించాల్సిన నిధులు, ఇవ్వాల్సిన అనుమతుల పై కేంద్రం వివక్ష చూపుతోందంటూ ఏకంగా తీర్మానం చేసేసింది తెలంగాణ అసెంబ్లీ. చర్చ సందర్భంగా మాట్లాడిన సభ్యులు కేంద్రం వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మామూలు రాజకీయ విమర్శలు చేయడం వేరు, అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయడం వేరు. అసెంబ్లీ తీర్మానం తర్వాత ఇది జనంలోకి బలంగా వెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ ప్లాన్‌ చేస్తున్న క్రమంలో ఇది నెగెటివ్‌ ఎఫెక్ట్‌ అవుతుందా అని కూడా భయపడుతున్నాయట టీజీ బీజేపీ వర్గాలు. ఫైనల్‌గా పార్టీ పెద్దలు దీన్ని ఎలా కవర్‌ చేసుకుంటారో చూడాలి మరి.