Off The Record: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా మహేష్ గౌడ్‌ను గత సెప్టెంబర్‌లో నియమించింది పార్టీ అధిష్టానం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు… అంతా ఏక్ నిరంజన్ అన్నట్టుగానే ఉంది తప్ప… కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ… ఇన్ని రోజుల పాటు పీసీసీ కార్యవర్గాన్ని నియమించకుండా ఉండలేదన్న చర్చ జరుగుతోంది గాంధీభవన్ వర్గాల్లో. గతంలో రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించిన సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు , ప్రధాన కార్యదర్శులు, ప్రచార కమిటీ చైర్మన్‌ను కూడా ఒకేసారి అనౌన్స్ చేసింది పార్టీ. ఎన్నికల టైం కాబట్టి అప్పుడు అలా ప్రకటన చేసినట్టు పార్టీ హైకమాండ్ తనకు తాను సమర్ధించుకోవచ్చుగానీ…. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా కనీసం పూర్తి స్థాయిలో కమిటీని వేసుకోలేని దైన్యం ఎందుకన్నది కాంగ్రెస్ వర్గాల క్వశ్చన్. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా పార్టీ విస్తృతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలుపెట్టారట. కానీ అధిష్టానం నుంచి కమిటీ నియమాకానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి దిశా లేదని సమాచారం. ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఇదే అంశంపై గట్టి చర్చ జరిగినట్టు తెలిసింది. కమిటీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు చేయాలని కేసీ సూచించినట్టు చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. కానీ సమావేశం జరిగి చాలా రోజులైనా.. ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడుతున్న పరిస్థితి కనిపించట్లేదు.
ఈ నెలాఖరు లోపు పూర్తిస్థాయిలో కమిటీని వేయాలని కూడా కేసీ వేణుగోపాల్ ఆదేశించినట్టు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ కమిటీపై కూర్పుకు సంబంధించిన ఎలాంటి చర్చా లేదు. అధికారంలో ఉన్న పార్టీ పూర్తిస్థాయిలో కమిటీ వేసుకోకపోవడంతో ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పే పరిస్థితి లేకపోతోందట. ఇక పార్టీ నాయకులు కూడా అటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రాక, ఇటు పార్టీలో పదవులు లేక అసంతృప్తితో ఉన్నారట. పిసిసి అధ్యక్షుడిని నియమించి ఐదు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయిలో కమిటీని వేసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్నది ఎవరికీ అంతుపట్టని వ్యవహారంగా ఉందని అంటున్నారు కాంగ్రెస్‌నేతలు. పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నేతలు చాలామందే ఉన్నారు. పార్టీ పదవి వస్తే అటు ప్రభుత్వంలో, ప్రభుత్వంలో పదవి దక్కితే ఇటు పార్టీలో అవకాశం ఉండకపోవచ్చు. ముందు ఎక్కడో ఒక చోట కొందరికి అవకాశం ఇస్తే… మిగిలిన వారికి ఇంకోచోట వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. కానీ… ఇప్పటిదాకా ఏదీ జరక్కపోవడంతో అంతా అయోమయం గందరగోళంలా మారిందని అంటున్నారు నాయకులు. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు దీటైన సమాధానం ఇచ్చే నాయకులను కనీసం అధికార ప్రతినిధులుగా నియమించుకున్నా.. రాజకీయం నడుస్తూ ఉంటుంది. కానీ కమిటీ వేయడానికే కాలయాపన చేయటం వెనక అసలేం జరుగుతోందన్న చర్చ జోరుగా జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో.
అటు పిసిసి చీఫ్‌కి కూడా తన టీం లేకపోతే చేయి విరిగినంత పని అవుతుందన్నది అంతా అంగీకరించే విషయం. వెంటనే ఉపాధ్యక్షులను నియమించుకుంటే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా ఏం జరుగుతోందో తెలిసిపోతుంది. ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేక కట్టు తప్పుతోందన్న వాదన బలపడుతోంది. పదవులు రాక పని చేయడానికి ముందుకు వచ్చే నేతలు తక్కువైపోతున్నారట. ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా… ఇంకా ఏం లేదంటూ… కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోందట. వీలైనంత త్వరగా పీసీసీ కమిటీని నియమించకుంటే… ఈ అసంతృప్తులు మరింత పెరిగిపోయి తర్వాత సెట్ చేయాలనుకున్నా అవని పరిస్థితులు తలెత్తుతాయని, అందుకే ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్న వార్నింగ్స్ వస్తున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.