Off The Record: ఆంధ్రా ప్యారిస్‌లో పొలిటికల్ హీట్ ఎండాకాలం వేడిని మించి పోతోంది. కానీ…అది రాజకీయ ప్రత్యర్థుల మధ్య అయితే వేరే లెక్క. అలా కాకుండా మిత్ర పక్షాలైన టీడీపీ, జనసేన మధ్య, అందునా… ఇద్దరు ముఖ్య నేతల అనుచరగణం తలపడుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కూటమి పొత్తులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి గెలిచారు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్. ఇదే సీటు కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి విఫలమయ్యారు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ ఆలపాటి రాజేంద్రప్రసాద్. అయితే… ఇటీవల జరిగిన ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించారు రాజా. తెనాలిలో ఆలపాటి వర్గీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఓవైపు నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మంత్రిగా, జనసేన కీలక నేత కావడం, పార్టీలో ఆయన మాటలు తిరుగులేకుండా ఉండటం, మరోవైపు ఆలపాటి రాజా కూడా ప్రజాప్రతినిధిగా విజయం సాధించడంతో తెనాలి కూటమిలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయంటున్నారు.
Read Also: Shahid Afridi: షాహిద్ అఫ్రీది యూట్యూబ్ ఛానెల్‌పై నిషేధం..
తాజాగా ఈ ఇద్దరు నేతల మధ్య ఓ ఆలయ కమిటీ వ్యవహారం చిచ్చు రేపింది. తెనాలి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయానికి చాలా చరిత్ర ఉంది. దాదాపు 130ఏళ్ళ ఈ ఆలయానికి ఆస్తులు కూడా భారీగా ఉన్నాయి. ఆలయ సత్రం కమిటీ పాలకవర్గం ఆ వ్యవహారాలన్నిటినీ పర్యవేక్షిస్తూ ఉంటుంది. అయితే… ప్రస్తుతం ఉన్న పాలకవర్గం గడువు తీరక ముందే, వాళ్ళు యాక్టివ్‌గా ఉండగానే… కొత్తగా మరో పాలకవర్గం ప్రకటన రావడం తాజా వివాదానికి ప్రధాన కారణం. రెండు వారాల క్రితం తీవ్ర ఉద్రిక్తతల నడుమ పాలకవర్గం సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌లో ఓ వర్గానికి చెందిన పెండేల వెంకట్రావు తన అనుచరులతో గొడవకు దిగారు. దీనిపై పాలకవర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… వెంకట్రావు, అతని అనుచరులపై కేసులు బుక్ అయ్యాయి. అయితే పెండేల వెంకట్రావు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వర్గీయుడు. దీంతో ఆ కేసుల వెనక మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే… కేసుల నమోదుకు ముందు పాలకవర్గం మంత్రి మనోహర్‌ను కలిసినట్టు తెనాలిలో గుసగుసలాడుకుంటున్నారు. కమిటీ వివాదంపై పాలకవర్గం అటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కూడా కలిసిందట.
Read Also: Rahul Gandhi: ‘‘మా విజన్ స్వీకరించినందుకు సంతోషం’’.. కుల గణనపై రాహుల్ గాంధీ..
అయితే… అది నాపని కాదని, మీరే ఆలపాటి, నాదెండ్లతో కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకోమని చెప్పినట్టు ప్రచారం ఉంది. ఆ సంగతి ఎలా ఉన్నా… తన వర్గానికి చెందిన వెంకట్రావు మీద నమోదవడంతో భగభగలాడిపోతున్నారట ఆలపాటి రాజా. అసలు అధికార పార్టీ నాయకుడి మీద కేసు బుక్ అవడాన్ని నార్మల్‌గా తీసుకోకూడదని, పై నుంచి చాలా వత్తిడి ఉంటే తప్ప ఆ పని చేసి ఉండరంటూ నాదెండ్ల వర్గం మీద ఆగ్రహంగా ఉన్నారట రాజా. ఆ ఊపులోనే కొత్త కమిటీని ప్రకటించడమే కాకుండా… పాత కమిటీ ఉండగానే వీళ్ళు ప్రమాణస్వీకార ఏర్పాట్లు చేసుకున్నారు. వెంకట్రావు వర్గం దూకుడు వెనుక ఆలపాటి ఉన్నారన్నది తెనాలిలో ఓపెన్ సీక్రెట్. దీంతో ప్రస్తుతం తెనాలి వాసవీ సత్రం పాలక మండలికి నాదెండ్ల వర్గానికి చెందిన పాత కమిటీ, ఆలపాటి వర్గానికి చెందిన కొత్త కమిటీ ఉన్నట్టయింది. కొత్తగా కమిటీ ప్రకటించుకున్న వెంకట్రావు వర్గం తమ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వస్తున్నట్టు ఫ్లెక్సీలు కట్టడం ఇంకా కాక రేపింది. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలు కూటమికే చెందిన మంత్రి, ఎమ్మెల్సీ మధ్య దూరం పెంచుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఇద్దరు పెద్దలు పైకి మాత్రం ఆ కమిటీల వివాదాలతో సంబంధంలేదన్నట్టు వ్యవహరిస్తున్నా… లోలోపల పైచేయి కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద వాసవీకన్యకాపరమేశ్వరి సత్రం వ్యవహారం తెనాలి కూటమిలో కుంపటి రాజేసిందని అంటున్నారు పరిశీలకులు. ఇద్దరూ ముఖ్య నాయకులే కావడంతో ఈ ఆధిపత్యపోరు ఎటు దారి తీస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.