Site icon NTV Telugu

Off The Record: జనసేన ఎమ్మెల్యేలను టీడీపీ నేతలు పక్కనపెట్టేశారా..?

Janasena

Janasena

Off The Record: 2024 ఎన్నికల్లో జనసేనను బలంగా నిలబెట్టిన జిల్లాల్లో ఒకటి ఉమ్మడి పశ్చిమగోదావరి. ఇక్కడ మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉంటే… ఆరు చోట్ల పోటీ చేసి గెలిచింది గ్లాస్‌ పార్టీ. అయినా సరే…. తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని తెగ ఫీలైపోతున్నారట లోకల్‌ లీడర్స్‌. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేష్‌కు మంత్రి పదవి దక్కింది. ఆయనతో సహా… మిగతా నియోజకవర్గాల నేతలంతా… స్థానిక తెలుగుదేశం నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోపల రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. కూటమి ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా టిడిపి నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జిల్లాలో రెండు పార్టీల మధ్య అంతరాన్ని బాగా పెంచినట్టు చెప్పుకుంటున్నారు. ఆ పేరుతో… తెలుగుదేశం నాయకులు ఇంటింటికి వెళ్తూ…. తమ ప్రాధాన్యతను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంటే.. తాము మాత్రం అలా… చూస్తూ ఉండిపోవాల్సి వస్తోందని తెగ మధనపడిపోతున్నారట గ్లాస్‌ పార్టీ లీడర్స్‌. మేం కూడా… ప్రభుత్వంలో భాగస్వాములమే అయినప్పటికీ తొలి అడుగు విషయంలో మాత్రం వెనకడుగు వేయాల్సి వస్తోందన్నది వాళ్ళ బాధగా చెప్పుకుంటున్నారు.

Read Also: APPSC: ఏపీపీఎస్సీలో కీలక సంస్కరణలు.. ఇక, వేగంగా నియామకాలు..
అలా ఎందుకంటే… జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా… టీడీపీ ఇన్ఛార్జ్‌లే అంతా తామై కార్యక్రమం నిర్వహిస్తున్నారట. కనీసం లోకల్‌ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని కూడా కలుపుకుని ప్రోగ్రాం నిర్వహిస్తే… అందరికీ బెటర్‌ కదా అన్నది వాళ్ళ వాదన. మేం జనంలో తిరుగుతున్నా… ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆ ఫీల్‌ వేరుగా ఉంటుందని, టీడీపీ నాయకులు అలాంటి సంతృప్తి తమకు దక్కనివ్వడం లేదన్నది జనసేన ఎమ్మెల్యేల బాధ. అసలు ఒక రకంగా తమను పక్కకి నెట్టేసినట్టయిందని ఫీలవుతున్నారట గ్లాస్ ఎమ్మెల్యేస్‌. గత ఎన్నికల్లో సీటు దక్కించుకోలేకపోయిన టీడీపీ నేతలందరికీ ఇపుడు తొలి అడుగు వరంలా మారినట్టు ఫీలవుతున్నారట. తాము అధికారంలో ఉన్నాసరే…. జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో ఏడాదిగా ఎలాంటి గుర్తింపు దక్కకుండా పోయిందని, అందుకే…. ఇప్పుడు తొలిఅడుగుతో ఆ డ్యామేజిని కవర్‌ చేసుకోవాలని భావిస్తున్నారట టీడీపీ నేతలు. అలాంటి వాళ్ళంతా ఒక్కసారిగా దూకుడు పెంచడాన్ని గ్లాస్‌ శాసనసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. పైగా ఇంటింటికి వెళ్ళి.. సమస్య ఏదైనా సరే…మాకు చెప్పేయండి చాలని టిడిపి నేతలు అంటున్నారని, ఆ మాత్రందానికి ఎమ్మెల్యేలుగా మేం ఎందుకున్నట్టు అంటూ చిన్నబుచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది.

Read Also: Indian Oil Companies: మోడీ సర్కార్కు అమెరికా షాక్.. భారత చమురు కంపెనీలపై ఆంక్షలు

పేరుకు కూటమిలో భాగస్వాములైనా… తొలి అడుగు కార్యక్రమం మొదలయ్యాక ఇరు పార్టీల నాయకులు ఎవరి రాజకీయం వారిదే అన్నట్టుగా ఉంటున్నారట. ముఖ్యంగా నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేల పాత్రను తగ్గించి…. వచ్చే ఎన్నికల్లో తిరిగి తమ సీట్లు తాము సాధించుకునేందుకు తెలుగుదేశం నేతలు తొలి అడుగు ప్రోగ్రామ్‌ని గట్టిగానే వాడుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. జనసేన నేతలకు కూడా ఇదే డౌట్‌ వచ్చి వాళ్ళలో వాళ్ళు తీవ్ర అంతర్మథనంలో ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కూడా బలమైన ఏరియా. ప్రస్తుతం ఆరు చోట్ల జనసేన శాసనసభ్యులుంటే.. మిగతా తొమ్మిది సీట్లలో టిడిపి విజయం సాధించింది. అయితే…కూటమి ఊపులో జనసేన ఆరు సీట్లు కొట్టగలిగినా… ఇప్పుడు మాత్రం ఎందుకో… ఆ స్థాయి ప్రభావం చూపలేక వెనుకబడుతోందని ఆపార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇదే అదనుగా…. అసలు గ్లాస్‌ పార్టీ గెలిచింది మా బలంతోనే అంటూ…. టీడీపీ లీడర్స్‌ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నా నేతలు చెప్పకనే చెబుతున్నారట. దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరిలో రెండు పార్టీల నాయకుల మధ్య కోల్డ్‌వార్‌ ఓ రేంజ్‌లో నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు.

Read Also: Kamala Harris: కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ క్లారిటీ

ఇలాగే కొనసాగితే.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుదో అనే అనుమానాలు ఆల్రెడీ కేడర్‌లో మొదలయ్యాయి. అంతా కలిసి ఉండండి, కలిసే పని చేయండని అధిష్టానాలు గట్టిగా చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వాతావరణం వేరుగా ఉందని, పశ్చిమలో పరిస్థితి చూస్తే.. వాస్తవం ఏంటో బోధపడుతుందని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. తాము గెలిచిన చోట్ల పవర్ షేరింగ్ ఉంటోంది తప్ప.. టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదన్నది గ్లాస్‌ వాయిస్‌. పై స్థాయిలో అధినేతలు ఆశిస్తున్నదొకటి.. క్షేత్రస్థాయిలో నేతలు పాటిస్తున్నదొకటి అన్నట్టుగా ఉంటోందట వ్యవహారం. కనీసం మరో పదేళ్ళు దోస్తీ అని పెద్దోళ్ళు చెబుతున్నా… నియోజకవర్గాల్లో పరిస్థితులు చూస్తుంటే మాత్రం లేనిపోని అనుమానాలు పెరుగుతున్నాయంటూ గుసగుసలాడుకుంటున్నారు రెండు పార్టీల కార్యకర్తలు.

Exit mobile version