Off The Record: పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ…. గత ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని కూటమి పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలిపారు. ఇక ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి తన సంగతి ఏంటని అడుగుతూనే ఉన్నారాయన. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోట్ చేస్తామని ఎన్నికలకు ముందు స్వయంగా ప్రకటించారు చంద్రబాబు. అటు వర్మకు గౌరవప్రదమైన స్థానం ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కూడా హామీ ఇచ్చేశారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8నెలలవుతున్నా.. తనను పట్టించుకోలేదన్న అసహనంతో ఉన్నారట మాజీ ఎమ్మెల్యే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పెట్టిన ఎక్స్ మెసేజ్ హాట్ టాపిక్ అయింది. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు వర్మ. అక్కడి వరకు ఓకే గానీ… ఆ పోస్ట్‌కి పిఠాపురం ఎన్నికల ప్రచారం వీడియోని జత చేయడంతో… తేడా కొట్టింది. బాగా హర్ట్ అయిన జన సైనికులు రీ ట్వీట్స్‌తో మోత మోగించేశారు. జనసేనను, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకునే… వర్మ సెటైరికల్‌గా ఆ మెసేజ్ పోస్ట్ చేశారన్నది జనసేన నాయకుల అనుమానం అట. దాంతో ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు ఫైరైపోయారు. తమ అధినేతను కించపరిచారంటూ అభ్యంతరం తెలిపారు. పొత్తు ధర్మం అంటే ఇదేనా అని ప్రశ్నించారు కూడా.
టిడిపి నియోజకవర్గాల్లో జనసేన మద్దతు లేకుండా, కష్టపడకుండా గెలిచారా అన్నది వాళ్ళ క్వశ్చన్. దాంతో విషయం మరింత హీట్ ఎక్కింది. రియాక్షన్ తీవ్రతను గమనించి ఎక్కడో…. తేడా కొడుతోందని భయపడ్డ వర్మ… కొద్ది గంటల్లోనే తన ఎక్స్ అకౌంట్ నుంచి ఆ మెసేజ్‌ని డిలీట్ చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్స్‌ని ఒక ప్రైవేట్ సంస్థ మూడేళ్ళ నుంచి ఆర్గనైజ్ చేస్తోందని, తనకు తెలియకుండానే ఆ మెసేజ్ పెట్టారంటూ వివరణ ఇచ్చుకున్నారు. అటు ఆ ప్రైవేట్ సంస్థ కూడా ఇదంతా తమ తప్పేనని క్లారిటీ ఇచ్చింది. అయినా సరే…. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. గ్రౌండ్ లెవెల్‌లో రెండు పార్టీల క్యాడర్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందని అంటున్నారు. ఇప్పటికే పిఠాపురంలో టిడిపి, జనసేనకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి ఉందట. రాష్ట్రమంతా ఒక లైన్‌లో ఉంటే… డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో రెండు పార్టీల నేతలు కనీసం వేదిక పంచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదని చెప్పుకుంటున్నారు. కార్యక్రమాలు కూడా ఎవరివి వాళ్లు సపరేట్ గా చేసుకుంటారు. ఇక ఈ తాజా సోషల్ మీడియా రచ్చతో వ్యవహారం మరింత ముదిరిందట. వర్మ అటెన్షన్ కోసమే ఆ మెసేజ్ పెట్టి ఉండవచ్చని, దాని ద్వారా తమను తక్కువ చేశారంటూ గుర్రుగా ఉన్నారట జన సైనికులు.
మరోవైపు ఎన్నికల్లో కష్టపడ్డారు కాబట్టే… తమ నాయకుడు దానికి తగ్గ ప్రతిఫలం కోసం ఆ విధంగా పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లి ఉండవచ్చంటూ నియోజకవర్గ టీడీపీ నాయకులు వర్మకు కోరస్ వాయిస్తున్నట్టు సమాచారం. కానీ… కోరి కాంట్రవర్సీ తెచ్చారంటూ.. పార్టీ పెద్దలు ఆయన్ని కోప్పడ్డట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఏదన్నా ఉంటే… ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలిగాని ఇలా… రచ్చకెక్కితే ఏం ప్రయోజనం అని క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇలాంటివి పునరావృతం అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చేసినట్టు జనసైనికులు పోస్టింగులు పెట్టేస్తున్నారు.. మరోవైపు ఈ విషయంపై మాత్రం జనసేన అధినాయకత్వం మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. మొత్తానికి వర్మ చేసి, డిలీట్ చేసిన ఎక్స్ మెసేజ్‌తో పిఠాపురం పొలిటికల్ రచ్చ పీక్స్‌కు చేరింది. నన్ను గుర్తించండంటూ… ఆయన ఏదో చేయబోతే… చివరికి చిరిగి చేటైందని అంటున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందో, లేక మరిన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.