Off The Record: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం… ఎప్పుడు పొలిటికల్ హీట్ వుండే నియోజకవర్గం… టీడీపీ అయినా, వైసీపీ అయినా సరే… నిత్యం వార్తల్లో ఉండాల్సిందే. ఎమ్మిగనూరు వైసీపీ లో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక మధ్య వార్ నడుస్తుడగా తాజాగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి.
మంత్రాలయం, ఎమ్మిగనూరు పక్కపక్క నియోజకవర్గాలు. బాలనాగిరెడ్డికి ఎమ్మిగనూరులోను అంతో ఇంతో పట్టుంది. బాలనాగిరెడ్డి కుమారుడు ధరణిధర రెడ్డి 2014 ఎన్నికల ముందు ఎమ్మిగనూరు సీటుపై దృష్టిపెట్టారు. అప్పట్లో టికెట్ కోసం సీరియస్ ఎఫర్ట్ కూడా పెట్టారు. అయితే 2012 లో అప్పటి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వైసీపీ గూటికి చేరి ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మళ్లీ గెలవడంతో ఆ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ అధిష్టానం. 2014 ఎన్నికల్లో చెన్న కేశవ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో పొలిటికల్ గా విరామం తీసుకున్నారు బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి. కానీ, వచ్చే ఎన్నికల్లో మాత్రం పక్కాగా టికెట్ కావాలని జోరుగా లాబీయింగ్ చేస్తున్నారట.
ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ కోసం ఇప్పటి నుంచే వైసీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వైసీపీ ఇంచార్జ్‌గా మొన్నటి దాకా మాజీ ఎంపీ బుట్టా రేణుక వున్నారు. ఈ మధ్యనే మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి ని నియమించింది అధిష్టానం. దీంతో బుట్టా రేణుక, రాజీవ్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగింది. ఇంఛార్జి ఎవరున్నా సరే… రాబోయే ఎన్నికల్లో టికెట్ తనదేనంటూ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఇప్పటికే బహిరంగంగా చెబుతూ వస్తున్నారు. ఎమ్మిగనూరును వదిలేది లేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డి తాను కూడా రాబోయే ఎన్నికల్లో బరిలో ఉంటానని, వైసీపీ అధినేత జగన్ ను కలసి ఈ విషయం చెబుతానని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఇవ్వకపోతే… కొన్ని కండీషన్లు పెట్టారు.
ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ ఇస్తే సీనియర్లకు ఇవ్వండి… లేదంటే తాను ఇండిపెండెంట్ గా అయినా బరిలో ఉంటా… అంటూ మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు హాట్ కామెంట్స్ చేశారు. చెన్న కేశవ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కి టికెట్ ఇచ్చినా సరే.. లేదంటే బుట్టా రేణుక అయినా ఒకే… లింగాయత్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ రుద్రగౌడ్ కి ఇచ్చినా ఒప్పుకుంటా.. కానీ, చెన్న కేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి టికెట్ ఇస్తా నేను ఇండిపెండెంట్ అయినా పోటీ చేస్తా అంటూ కుండ బద్దలు కొట్టారు. ఈ విషయం వైసీపీ అధినేత జగన్ ను కూడా కలసి చెబుతానన్నారు. ఎవరైనా, ఎక్కడైనా పోటీ చేయవచ్చని, ఇది ప్రజాస్వామ్యమని లాజిక్ కూడా చెప్పుకొచ్చారట ధరణీధర్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో ఆయన వర్గీయులు సోషల్ మీడియాలో వైరల్ చేశారట. అంటే ఇదంతా వ్యూహాత్మకమేనా అనే చర్చ జరుగుతోందట. ధరణీధర్ రెడ్డి వ్యాఖ్యలు, లేదా ఎమ్మిగనూరు నుంచి పోటీ వంటి కామెంట్స్ పై మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మౌనం దాల్చారట. ఇప్పటికే బాలనాగి రెడ్డి సోదరులు నలుగురు ఎమ్మెల్యేలయ్యారు. తన కుమారున్ని ఎమ్మిగనూరు టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని కోరడంకానీ, వద్దని కొడుకును వారించడం కానీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారట బలనాగిరెడ్డి. మొత్తమ్మీద ఎమ్మిగనూరు సీటుకు వారసుల మధ్య వార్ తప్పేలా లేదు.