Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో మెజారిటీ ఎమ్మెల్యేలకు రాజకీయం ప్రవృత్తి మాత్రమే. అధికారంలో ఉన్నా ,లేకపోయినా నో మేటర్. వ్యాపార ప్రయోజనాలే వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ. అయితే… ఆ వ్యాపారాలు నేరుగా ప్రజలను ప్రభావితం చేసేవి కాకపోవడంతో ఇన్నాళ్ళు పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. కానీ… ఇప్పుడు ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది. 2024 ఎన్నికల తర్వాత కూటమి ఎమ్మెల్యేలు డైరెక్ట్ అయిపోయారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. వైన్, మైన్, ల్యాండ్….ఇతరత్రా ఏ డీల్ అయినాసరే….. ఇప్పుడంతా ఓపెనేననట. జనం ఫీలింగ్స్‌తో సంబంధంలేకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాన్న వైఖరి పెరిగిపోయిందన్న చర్చ జరుగుతోంది విశాఖలో. ఆ క్రమంలో చాపకింద నీరులా వ్యతిరేకత పెరుగుతున్నా.. ఎమ్మెల్యేల తీరు మాత్రం పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న చందంగానే ఉందన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే టీడీపీకి చెందిన ఒక సీనియర్ శాసనసభ్యుడి వైఖరి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయనగారి లిక్కర్ లెక్కలు, బెదిరింపుల పంచాయితీల చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది విశాఖలో. ఇటీవలి కాలంలో ఆ సీనియర్ ఎమ్మెల్యే దూకుడు ఎక్కువ కావడంతో చివరికి బార్స్ టెండర్లు వేసేందుకు కూడా వ్యాపారులు ముందుకు రావడం లేదని చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో ముందు ఎక్సైజ్ అధికారులు కూడా కాస్త గందరగోళపడ్డారట.
పాలసీలో ఇబ్బందుల కారణంగా మద్యం వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని తొలుత భావించిన ఎక్సైజ్ ఆఫీసర్స్‌వాటిలో మార్పుల తర్వాత కూడా అదే తీరు కనిపించడంతో… ఎక్కడ తేడా కొడుతోందని ఆరా తీసి అవాక్కయినట్టు తెలిసింది. అధికారులు కాస్త లోతుల్లోకి వెళ్ళి ఆరా తీస్తే… అసలు సంగతి బయటపడిందట… సీనియర్ శాసన సభ్యుడు లిక్కర్ సిండికేట్ దందాను టాప్ గేర్ లోకి తీసుకువెళ్ళడమే కారణమని తెలిసి అడకత్తెరలో పడ్డట్టు ఫీలవుతున్నారట ఆఫీసర్స్. గ్రేటర్ విశాఖ పరిధిలో 125 బార్లు ఉండగా….నోటిఫికేషన్ టైం నుంచే బేరసారాలు మొదలైనట్టు తెలిసింది. ముందే ఎక్సెైజ్ ఫీజులు భారం అనుకుంటుంటే… సార్ చెప్పిన కప్పం కట్టి మరీ వ్యాపారాలు చేయడం మా వల్ల కాదని వ్యాపారులు చేతులెత్తేసినట్టు సదరు ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ప్రచారం చేస్తోంది. ఆయన రేట్ కార్డ్ పెట్టీ మరీ వసూలు చేస్తున్నారన్నది వాళ్ళ అభియోగం. ఒక్కో బార్ లైసెన్స్‌కు 2 లక్షలు కప్పం కట్టడంతో పాటు నెలకు 50 వేలు ఫిక్స్ చేసి మరీ వసూలు చేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా బార్ల లైసెన్సుల వ్యవహారంలో ఏక మొత్తంగా దాదాపు రెండున్నర కోట్లు చేతులు మారాయన్నది వైసీపీ ఆరోపణ. ఇవి కాకుండా ఇక ప్రతి నెలా సదరు లిక్కర్ డాన్ కమ్ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ద్వారా వసూలయ్యే మొత్తం అరకోటికి పైగానే ఉంటుందని చెప్పుకుంటున్నారు.
అయితే… తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు వసూలు చేసిన దాంట్లో కొంత మొత్తాన్ని ఆయన ఇతర శాసన సభ్యులకు కూడా షేర్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వ్యవహారశైలిపై వాళ్ళకు కూడా వ్యతిరేకత ఉన్నప్పటికీ కరెన్సీ నోట్ల దెబ్బకు కామ్ అయిపోతున్నారన్న చర్చ జరుగుతోంది వైజాగ్‌లో. అటు జిల్లాలో కల్లుగీత కుటుంబాలకు కేటాయించిన బార్ల లైసెన్సుల విషయంలో కూడా లిక్కర్ డాన్ మాట చెల్లుబాటు అయ్యే వరకూ లైసెన్సులు ఇవ్వలేదని, దీన్ని బట్టే ఇక్కడ సిండికేట్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే….ఈ వసూళ్లు, పంపిణీ వెనుక ఒక అదృశ్య శక్తి కూడా ఉందట. ఎక్సైజ్ శాఖలోని ఓ సీనియర్ అధికారి కీలక పాత్ర పోషిస్తున్నట్టు గుసగుసలు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే తరపున కప్పం వసూలు చేసి, చెప్పినట్టుగా అందరికీ వాటాలు పంచే బాధ్యతను సుదీర్ఘ కాలంగా సిటీలోనే పనిచేస్తున్న ఉన్నతాధికారికి అప్పగించినట్టు ఎక్సైజ్ వర్గాల్లోనే మాట్లాడుకుంటున్నారు. అందుకు కాదు, కూడదని ఎవరైనా ఎదురు తిరిగితే రూల్స్ మాట్లాడతాట. అలాంటి వాళ్ళకు నిబంధనల ప్రకారం లైసెన్సులు వస్తాయిగానీ… వ్యాపారం చేసే పరిస్థితులు ఉండవన్నది సిండికేట్ టాక్. అలా ఎదురు తిరిగిన వాళ్ళు బార్ ఏర్పాటు చేసేందుకు స్థలాలుగాని, భవనాలుగాని అద్దెకు దొరక్కుండా అడ్డు పడుతున్నారనే ప్రచారం సైతం ఉంది వుంది. ఇంత జరుగుతున్నా పెద్దల అండదండలు ఉండడంతో ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ కూడా చోద్యం చూస్తోందట.