Off The Record: ఇన్ఛార్జ్ మంత్రిగారూ…. గత సమావేశంలో చర్చించిన విషయాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.. పరిస్థితిలోమార్పులేదు, మా మాటవినే దిక్కులేదు…. మీరన్నా కాస్త చెబుతారా? ఇవీ… ఇటీవల ఏలూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేల నోటి నుంచి వచ్చిన మాటలు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. సీనియర్, జూనియర్ అన్న తేడా లేదు. అందరిదీ అదే రాగం. అధికారులు మా మాట వినడం లేదన్నదే బాధ. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే… మంత్రి పార్థసారధి కూడా మీరంతా నాకు చెబుతున్నారు సరే… నేనెవరికి చెప్పుకోవాలన్నట్టుగా మాట్లాడారట. ఇదంతా చూస్తున్నవాళ్ళు మాత్రం విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్తిబాబు కేరక్టర్‌ని గుర్తు చేసుకుంటున్నారు. అందులో బాధితులంతా ఎమ్మెల్యే భార్య దగ్గరికి వెళితే… ఆమె కూడా విగ్గు తీసు చూపించి నేను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఏలూరు జిల్లాలో సీన్ సేమ్ టు సేమ్ అట.
Read Also: Young Woman Suicide: పెళ్లి చేసుకుంటానన్నాడు.. అంతా బాగుంది అనుకునే టైమ్‌లో..
ఇంతకీ అసలు విషయం ఏంటంటే…. ఏలూరు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల్ని అస్సలు లెక్కచేయడం లేదట. ప్రతి మీటింగ్‌లో ఫలానా పని చేయమని చెప్పడం, నెక్స్ట్ మీటింగ్‌కు అధికారులు అంతే నిర్లక్ష్యంగా రావడం, వాళ్ళ మీద మంత్రి, ఎమ్మెల్యేలు చిందులేయడం పరిపాటిగా మారిపోయిందంటున్నారు. నిస్సిగ్గుగా మాట్లాడుకోవాలంటే… ఏం చేసుకుంటారో చేసుకోండన్నట్టుగా ఆఫీసర్స్ వ్యవహారం ఉందని ఎమ్మెల్యేలు తమలో తాము మాట్లాడుకుంటున్నారట. జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాత్రమే కాదు సాక్షాత్తు మంత్రి సైతం గొంతుచించుకుని ప్రజాసమస్యలకు పరిష్కారం చూపండి మహాప్రభో అంటున్నా… డోంట్‌కేర్ అన్నట్టు ఉంటోందట అధికార యంత్రాంగం. సమావేశం నిర్వహించిన ప్రతిసారి పొలోమంటూ అంతా వచ్చి మీటింగ్ హాల్ నిండిపోవడం, అయిపోగానే ఛలో అంటూ ఎవరిదారిన వాళ్ళు వెళ్లిపోవడమే తప్ప పైసా ప్రయోజనం ఉండటం లేదని అంటున్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో తాజాగా నిర్వహించిన సమావేశంలో కూడా అదే సీన్ కనిపించడంతో చిర్రెత్తిపోయారట ప్రజా ప్రతినిధులు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల ముందు ఈ విషయమై ఎమ్మెల్యేలు నెత్తీ నోరు బాదుకున్నట్టు తెలిసింది.
Read Also: Railway Luggage Rule: రైల్వే ప్రయాణికుల అదనపు లగేజీపై ఛార్జీలు.. క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి
ఫలానా ఎమ్మెల్యేగారితో కలిసి ఆ ఫలానా సమస్యను పరిష్కరించడంటూ సాక్షాత్తు జిల్లా ఇంఛార్జి మంత్రి చెప్పినా.. ఏదోసాకు చూపించి పెండింగ్‌లో ఉంది అనడమే తప్ప పరిష్కార మార్గాలు మాత్రం వెదకడం లేదట అధికారులు. తాజా మీటింగ్‌లో అయితే… ఇక వీళ్ళతో మేం పడలేం బాబోయ్ అంటూ ఎమ్మెల్యేలు చేతులెత్తేసినట్టు సమాచారం. ప్రజలు ఎన్నుకున్నందుకు మేమేదో చేద్దామనొస్తే.. అధికారులు అందుకు సహకరించడం లేదంటూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఏలూరు జిల్లా నాయకులు. ముఖ్యంగా ఇరిగేషన్, అటవీశాఖ, రవాణా, గృహనిర్మాణ శాఖల అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేయని నాయకుడులేడు. సాక్షాత్తు జిల్లా మంత్రిగా ఉన్న కొలుసు పార్ధసారధి పరిస్థితి కూడా ఇంతేనట. తన నియోజకవర్గంలో ఉన్న అటవీభూముల్లో వ్యవసాయానికి అనుమతిచ్చి.. సాగుచేసుకోడానికి నీరు ఇచ్చే విషయంలో అటవీ శాఖ అధికారులు కొర్రీపెట్టడంపై చిందులు తొక్కారట మంత్రి. ఆయన అంతలా అడుగుతున్నా… అటవీ శాఖ అధికారులు మాత్రం తాపీగా కుదరదని సెలవిచ్చినట్టు తెలిసింది. దెందులూరు-కైకలూరు నియోజకవర్గాల మధ్య కోమటిలంక రోడ్డు నిర్మాణం విషయంలో సీనియర్ నాయకులు చింతమనేని, కామినేనిలకు సమాధానం ఇచ్చే దిక్కులేకుండా పోయిందట. డీఆర్సీ కథ అలా ఉంటే… జడ్పీ వ్యవహారం అంతకు మించి అన్నట్టుగా ఉందట. ఇక్కడ కేంద్ర మంత్రి, ఎంపీకి ఆన్సర్ చేసే దిక్కు లేకుండా పోయిందంటున్నారు. జడ్పీ చైర్మెన్ గంటా పద్మశ్రీ, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఎంపీ పాకా, ప్రభుత్వవిప్ బొలిశెట్టి ఇతర ఎమ్మెల్యేలంతా సమావేశానికి వచ్చాక కూడా అధికారులు అడ్రస్ లేరట. ఈ పరిస్థితుల్లో జిల్లా అభివృద్ధి కోసం జరగాల్సిన సమావేశాలు ఉత్తుత్తి మీటింగ్స్‌గా మారిపోతున్నాయని, అధికార యంత్రాంగం వ్యవహారం కళ్ళేలు లేని గుర్రాల్లా మారిపోయిందన్న చర్చ జరుగుతోంది.