పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.. అంతా బాగుంది అనుకునే టైమ్‌లో ప్లేట్ ఫిరాయించాడు. వాడు చేసిన నికృష్టపు పనికి.. వధువు.. పెళ్లి కాక ముందే తనువు చాలించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సీతారాంపురంలో జరిగింది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లి సంతోషంగా జీవిస్తుందనుకున్న కూతురు.. విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు బిచ్చ. అమ్మాయిలతో ఆడుకోవడంలో ఆరితేరిన మృగాడు. ఇంకా చెప్పాలంటే కిరాతకుడు. ఇతడు పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు.
Also Read:Russia Ukraine war: యుద్ధం ముగింపు ఉత్తుత్తి మాటలేనా?.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
మాయమాటలు చెప్పడం… లైంగికంగా అమ్మాయిలను వాడుకోవడం.. ఆ తర్వాత ముఖం చాటేయడంలో బిచ్చ మాస్టర్ డిగ్రీ చేశాడని చెప్పవచ్చు. ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కానీ అన్నీ కన్నింగ్ తెలివి తేటలే ఉన్నాయంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ అమ్మాయి పేరు తుళ్లిక శ్రీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకట్య తండాకు చెందిన గుగులోత్ వీర మోహన్ కూతురు. ఈమె కూడా ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఇటీవల పెద్దలు ఈ అమ్మాయిని బిచ్చకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. ఇరువైపుల పెద్దలు కూర్చుని పెళ్లి విషయాలు మాట్లాడుకున్నాడు. ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నందున తనకు రూ. 60 లక్షలు కట్నం కింద కావాలని బిచ్చ డిమాండ్ చేశాడు. అందుకు తుళ్లిక శ్రీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అంతా ఓకే అనుకున్నాక ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా నిర్వహించారు.
ఎంగేజ్‌మెంట్ అయింది మొదలు బిచ్చ.. తన కథ షురూ చేశాడు. తనకు కాబోయే భార్యను దేవాలయాలకు తీసుకు వెళ్తానని అత్త మామలకు చెప్పాడు. వారి అనుమతితో విజయవాడ, భద్రాచలం, కొత్తగూడెం తదితర ప్రాంతాలకు తీసుకెళ్లాడు. తిరిగి సురక్షితంగా అమ్మాయిని తీసుకు వచ్చాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు కథ షురూ అయింది. ఆగస్టు 8న తన అన్నయ్య కుమారుడి పుట్టిన రోజు ఉందని చెప్పి మళ్లీ శ్రీ ని తీసుకు వెళ్లాడు. కానీ అలా వెళ్లి తిరిగి వచ్చిన శ్రీ శరీరమంతా గాయాలతో ఇల్లు చేరింది.
పెళ్లి కళతో కళకళలాడాల్సిన కూతురు నీరసంగా.. విచారంగా కనిపించడంతో అసలు ఏమైందని తల్లి ఆరా తీసింది. దీంతో అసలు విషయం బయటపడింది. బిచ్చ తనను పెట్టిన మానసిక, శారీరక ఇబ్బందుల గురించి తల్లికి చెప్పుకుంది శ్రీ. ముఖ్యంగా మరో అబ్బాయితో చాటింగ్ చేశాననే అనుమానంతో తనను శారీరకంగా వాడుకుని వదిలేశాడని తెలిపింది. అంతే కాదు.. తనను పెళ్లి చేసుకునేది లేదని ఖరాఖండిగా చెప్పేశాడని వివరించింది. ఇది విని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు తల్లిదండ్రులు. పైగా నేను పెళ్లి చేసుకోను అని ఫోన్లో మెసేజ్ కూడా పెట్టాడు బిచ్చ. అవసరమైతే చావు అని కూడా చాటింగ్‌లో కనిపిస్తోంది.
ఈ ఘటన జరిగిన తర్వాత శ్రీ తీవ్ర మనస్తాపానికి గురైంది. బిచ్చ చేసిన మోసాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వెంటనే గుర్తించిన పేరెంట్స్ ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. 3 రోజులపాటు మృత్యువుతో పోరాడి మృతి చెందింది. మరోవైపు బిచ్చపై శ్రీ తల్లిదండ్రులు టేకుల పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ప్రస్తుతం నిందితుడు బిచ్చ పరారీలో ఉన్నాడు. గతంలోనూ శ్రీ కాకుండా.. మరో ముగ్గురు అమ్మాయలను ఇలాగే పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకుని మోసం చేసి వదిలేసినట్లు గుర్తించారు. నిత్య పెళ్లి కొడుకు బిచ్చను పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.