Off The Record: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేశారు మంత్రి నారా లోకేష్. 226 రోజుల పాటు 3వేల132 కిలోమీటర్లు నడిచారాయన. ఆ పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం అవి కాస్త డిఫరెంట్‌గా జరిగాయి. కొందరు ఎమ్మెల్యేలు పాద యాత్రలు చేశారు. నెల్లూరోళ్ళు ఏం చేసినా… కాస్త డిఫరెంట్‌గా ఉండాలనుకున్నారో, లేక ప్రోగ్రామ్ ఏదైనాసరే… మన ముద్ర పడాలనుకున్నారోగానీ… దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర. మొత్తం 3వేల132 కిలోమీటర్ల లోకేష్ పాదయాత్రకు గుర్తుగా ప్రతి నియోజకవర్గంలో అంతే మొత్తంలో విద్యార్ధులకు సైకిల్స్ పంపిణీ చెయ్యాలని ఎమ్మెల్యేలకు సూచించారాయన. అల్లూరు మండలంలో స్వయంగా రవిచంద్ర, పొదలకూరు మండలంలో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోవూరులో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సైకిల్స్ పంపిణీ చేశారు. లోకేష్ పాదయాత్రను గుర్తు చేసుకుంటూ…. ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు కందుకూరు నియోజకవర్గంలో కూడా సైకిళ్ల పంపిణీ జరిగింది.
దాంతోపాటు యాత్ర జరిగిన 226 రోజులకు గుర్తుగా…. నెల్లూరు జిల్లాలోని 226 ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతుల కల్పనతో పాటు అభివృద్ధి చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే…. 26 స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి ఆఖరుకల్లా ప్రభుత్వ స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ పూర్తి చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారట బీదా. అంతవరకు బాగానే ఉన్నా… ఇక్కడే ఒక ఇంట్రస్టింగ్ డిస్కషన్ తెర మీదికి వచ్చింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి నిర్ణయం వెనక భారీ వ్యూహమే ఉందన్న చర్చలు నడుస్తున్నాయి. బీద రవిచంద్ర బాధ్యతలు తీసుకున్నాక.. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనకు సహకరించబోరంటూ స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు, మంత్రులకు రవిచంద్రతో సఖ్యత లేదని కూడా చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే…. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, జిల్లా పార్టీ మొత్తం మీద తనకు పట్టుందని నిరూపించుకునేందుకే రవిచంద్ర ఈ నిర్ణయం తీసుకున్నారన్నది లేటెస్ట్ టాక్. ఎమ్మెల్యేలు, మంత్రులను సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించానని ఆయన చెప్పుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.
అదే సమయంలో ఈ ప్రోగ్రామ్ రూపంలో ఒకరిద్దరితో ఉన్న గ్యాప్‌ను కూడా ఫిల్ చేసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని క్యాడర్ కి చెప్పేందుకే ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నది ఇంకో వెర్షన్. ఇదే సమయంలో లోకేష్ పేరుతో నిర్వహించే ప్రోగ్రామ్ కావడంతో ఆయన మెప్పు పొందే చాన్స్ ఉంటుందని కూడా లెక్కలేసుకుంటున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తే…. రాష్ట్రం మొత్తం మీద నెల్లూరు జిల్లా గుర్తింపు వస్తుందని, లోకేష్ దృష్టిలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుందని ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పారట రవిచంద్ర. దీంతో మిగతా ఎమ్మెల్యేలు సైతం మార్చి ఆఖరులోపు సైకిల్స్‌ను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి ప్రజా ప్రతినిధులతో పాటు క్యాడర్ మరింత దగ్గర అయ్యే దిశగా అడుగులేస్తున్నారట జిల్లా అధ్యక్షుడు. రవిచంద్ర తీసుకున్న నిర్ణయం వెనుక పార్టీ ప్రయోజనాలు ఎలా ఉన్నా.. జిల్లా వ్యాప్తంగా దాదాపు 32వేల సైకిళ్ళ పంపిణీ వల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే… ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేయడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్పుకుంటున్నారు. దీనివెనక ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా…. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాకు మేలు జరుగుతుందని మాత్రం మాట్లాడుకుంటున్నారు.