Off The Record: ప్రొఫెసర్ కోదండరామ్….. పిల్లలకు రాజకీయ పాఠాలు చెప్పే సారు. క్లాస్‌రూమ్ లెసన్స్‌లో తనకు తిరుగులేదని అనింపించుకున్న ఈ మాస్టారు….. పొలిటికల్ ప్రాక్టికల్స్‌లో మాత్రం బాగా వెనుకబడ్డారన్న టాక్ నడుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుదామని రంగంలోకి దిగినా సరైన వ్యూహరచన లేక బోల్తా పడుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. అదే సమయంలో..ఎమ్మెల్సీ అయి ఉండి కూడా సరైన వ్యూహాలు రూపొందించుకోలేకపోతున్నారా? లేక మాట ఇచ్చాం కదా అని… బ్లైండ్‌గా ముందుకు వేసి…ఉన్న ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నారా అన్న డౌట్స్ సైతం వస్తున్నాయట. లెక్క ఎక్కడో తప్పుతోందని అనడానికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన వ్యవహార శైలినే ఉదహరిస్తున్నారు కొందరు. చివరికి సోషల్ మీడియాలో మిత్రపక్షాల కార్యకర్తలే ట్రోల్ చేసే పరిస్థితి. ఇంతకీ… అసలు విషయం ఏంటంటే….ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్‌కు గట్టి షాకే తగిలిందంటూ ఓ వర్గం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసేస్తోంది. వరంగల్- ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో… పన్నాల గోపాల్ రెడ్డికి మద్దతు ఇచ్చారు కోదండరామ్. ఆయన కోసం ప్రచారం కూడా చేశారు.
ఇంతా చేస్తే…. గోపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లు కేవలం 24 మాత్రమే. ప్రొఫెసర్ సాబ్ ఇక్కడే ఇరుకున పడ్డారని అంటున్నారు పరిశీలకులు. కోదండరాం మద్దతిచ్చినా… స్వయంగా ఆయనే వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా… అభ్యర్థికి వచ్చిన ఓట్లు 24. అంటే… కోదండరామ్ పరపతి, ఆయన బలం ఇంతేనని అనుకోవాల్నా… అంతకు మించి ఉంటే ఓట్లు ఎందుకు పడలేదంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారట రాజకీయ ప్రత్యర్థులు. నాటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన కోదండరాం స్వయంగా ప్రచారం చేస్తే 24 ఓట్లు రావడం ఏంటని చర్చకు పెడుతున్నారట. మూడు ఉమ్మడి జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ లెక్కన ఆయన సొంత పార్టీ తెలంగాణ జనసమితి సభ్యులంతా ఓట్లేసినా… ఫలితం ఇంకాస్త మెరుగ్గా ఉండాలి కదా…? అంటే.. తమ అధినేత ఉద్దేశ్యాన్ని తెలంగాణ జనసమితి నాయకులు, కార్యకర్తలు కూడా గ్రహించలేకపోయారా? అంటే… లోపం ఎక్కడున్నట్టు? ఎవరిదైనట్టు? అంటూ లాజిక్‌లు లాగే వాళ్ళు సైతం పెరుగుతున్నారట. పైగా… పోటీ చేసిన పన్నాల గోపాల్ రెడ్డి… జనసమితి పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కూడా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపునే నిలబడాలని వత్తిడి చేశారట పన్నాల. కుదరకపోవడంతో… స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక తర్వాత.. ఎన్నికల ప్రచారానికి కోదండరాం వెళ్ళడం, ఆయనకు 24 ఓట్లే రావడంతో చర్చ మొదలైంది. ఈ వ్యవహారం మీద కోదండరాం సైలెంట్‌గా ఉన్నా… అవతలి వాళ్ళు రచ్చ చేసేట్టు ఉన్నారన్నది ఇంకో వెర్షన్. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే… పన్నాల ఇండిపెండెంట్‌గా కాకుండా… డైరెక్ట్‌గా కోదండరామ్ పార్టీ తరపున పోటీ చేసినా… బలం అంతేనన్న చర్చ జరుగుతోందట.
తమ పార్టీ నాయకుడన్న ఉద్దేశ్యంతో స్వతంత్ర అభ్యర్థికి ఎమ్మెల్సీ ప్రచారం చేయడం, ఆయన చేసినా…కనీసం వంద ఓట్లు కూడా రాలేదంటూ నెగిటివ్ ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోందట సోషల్ మీడియాలో. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమే కానీ… వ్యూహాత్మకంగా ఉండాల్సిన సమయంలో… ముందు వెనక ఆలోచించకుండా….అడుగు ముందుకు వేస్తే…ఇలాగే ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం…. చిన్న తేడా వచ్చినా… పీకి పాకానబెట్టి రచ్చ రంబోలా చేస్తారు. ఇలాంటి విషయాలన్నిటినీ గ్రహించకుండా మాటిచ్చానంటే ముందుకేనిన అంటే ఎలాగని అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా….పొలిటికల్ సైన్స్ మాస్టారికి… ఇంకా క్లాస్‌రూం పాఠాలు చెప్పడమే కానీ… ప్రాక్టికల్స్ అర్ధం కాలేదా..? లేదంటే… మరేదైనా కారణం ఉండి ఉంటదా..? అన్న చర్చ జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో.