Off The Record: మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తిని తగ్గించకపోగా… సెగలు పొగలు మరింత పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో.. ఆశావహుల్లో అసంతృప్తి ఎక్కువ అవుతోందట. రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మూడు మంత్రి పదవులు భర్తీ అయ్యాయి. ఇంకో మూడు పెండింగ్‌లో ఉన్నాయి. ఆదివారం నాటి కేబినెట్ విస్తరణలో వివేక్‌కి చోటు కల్పించడంపై… అక్కడి నుంచే ఆశలు పెట్టుకున్న ప్రేమ్ సాగర్ రావు అలకబూనారట. పార్టీ కోసం పని చేసిన వారిని కాకుండా… మారి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం అంటే.. సొంతోళ్ళని అవమానించడమేనని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్… మీనాక్షి నటరాజన్ ముందే చెప్పేశారాయన. ఇక కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా… బెర్త్ ఖాయం అనుకున్న సుదర్శన్ రెడ్డిది కూడా సేమ్ సీన్. వివేక్‌తో పాటు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడే మంత్రి పదవి హామీ ఇచ్చారట. ఇద్దరికీ ఒకే రకమైన హామీలు ఇచ్చారు.
ఇప్పుడు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటూ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్ ఉండనే ఉంది. ఐతే… కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని నిజామాబాద్, రంగారెడ్డితోపాటు నల్గొండ.. జిల్లా నుండి పదవులు ఆశిస్తున్న వాళ్లంతా రెడ్డి సామాజిక వర్గం నేతలే అవడంతో… హైకమాండ్ కూడా ఎవరికి బెర్తులు ఇవ్వాలో అర్ధంగాక డైలమాలో పడ్డట్టు సమాచారం. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ వారిని ప్రస్తుతం అధిష్టానం బుజ్జగిస్తోంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో ఏఐసీసీ ముఖ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆయన ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితుల్లో మిగతా మూడు పోస్ట్‌లను ఎప్పుడు భర్తీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మిగతా మూడింటిని భర్తీ చేయవచ్చంటున్నారు. అప్పుడు కూడా … ఆశావహుల చిట్టా చూస్తే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. పార్టీ అధిష్టానం మాత్రం సామాజిక న్యాయం అంటోంది. దీంతో మిగతా మూడు పదవులు ఎవరికి వెళ్తాయన్న ఉత్కంఠ మాత్రం అలాగే ఉంది కాంగ్రెస్ వర్గాల్లో. ఇప్పటికైతే ఆశావహులు కొంత నెమ్మదించినా…మిగిలి ఉన్న మూడు ఖాళీల మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు. అప్పుడైనా కేబినెట్‌లో ఇంత మందిని ఎలా అడ్జెస్ట్ చేస్తారన్నది ప్రశ్నార్ధకమే. కేబినెట్ లోకి మిగిలిన ఆ ముగ్గురు ఎవరు? విప్‌లు, చీఫ్ విప్‌లు ఎవరు? అధిష్టానం ఎలా ఫఐనల్ చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.