Off The Record: కరీంనగర్ కాంగ్రెస్ కయ్యాలకు కేరాఫ్‌గా మారిపోయింది. గతంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఉన్న వార్ కాస్తా…ఇప్పుడు లీడర్ల మధ్యకు చేరింది. క్యాడర్‌ను గాడిలో పెట్టి స్థానిక ఎన్నికలకు సమాయాత్తం చేయాల్సిన ఇద్దరు కీలక నేతల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. మానకొండూర్ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ లోక్‌సభ సీటులో పోటీ చేసిన వెలిచాల రాజేందర్‌రావు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. వినాయక చవితి వేడుకల సాక్షిగా ఈ పోరు రోడ్డెక్కింది. ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి ఫోటో వేయలేదని ఆయన వర్గీయులు జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. దళిత ఎమ్మెల్యే పట్ల వెలిచాల చిన్నచూపుతో వ్యవహరించారంటూ తప్పుపట్టారు. దీనికి ప్రతిగా వెలిచాల వర్గీయులు ఆయన ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఆ ఫ్లెక్సీలకు, వెలిచాలకు సంబంధం లేదని వివరణ ఇచ్చినా కవ్వంపల్లి వర్గీయులు సంతృప్తి చెందలేదట. సొంత పార్టీ నేతలే ఇలా కయ్యానికి కాలు దువ్వుతుండటంతో వెలిచాల రాజేందర్‌రావు డైలమాలో పడ్డట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లోనే.. ఆయనకు మద్దతుగా దళిత నేతలు రంగంలోకి దిగి ప్రెస్‌మీట్ పెట్టి కవ్వంపల్లి వర్గీయులను విమర్శించడంతో కాక రేగింది. లొల్లికి కారణమైన ఇద్దరు నేతలు ఎక్కడా బయటకు రాకున్నా.. దళిత వర్గాలు మాత్రం సై అంటే సై అన్నట్టుగా ఒకరినొకరు తిట్టుకోవడం కొత్త టర్న్ తీసుకుంది. అయితే కవ్వంపల్లి, వెలిచాల మధ్య వార్ వెనక కారణాలు వేరే ఉన్నాయన్నది కరీంనగర్ కాంగ్రెస్ సర్కిల్స్‌లో నడుస్తున్న ఇంకో టాక్.
Read Also: Annadata Poru: పోలీసు ఆంక్షలు, గృహ నిర్బంధాలు.. వైసీపీ అన్నదాత పోరు విజయవంతం..
గత ఏడాది కాలంగా కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. దీని మీద చాలామంది కన్నుంది. వెలిచాల రాజేందర్‌రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి మధ్య మూడు ముక్కలాట నడుస్తోంది. అయితే నెల రోజుల నుంచి వెలిచాలకు అసెంబ్లీ ఇన్ఛార్జ్‌తో పాటు, డీసీసీ అధ్యక్షపదవి కూడా ఇవ్వబోతున్నారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. మిగతా ఇద్దరు నేతలు కూడా ఈ విషయాన్ని ఖండించకపోవడంతో వెలిచాలకు ఆల్మోస్ట్ పదవి దక్కినట్టే అని అందరూ భావించారు…ఆయన కూడా తరచూ సీఎం రేవంత్‌ని కలిసి వస్తుండటంతో అంతా కన్‌ఫర్మ్ అనుకున్నారు… సరిగ్గా అదే సమయంలో కవ్వంపల్లి వర్గీయుల ఎపిసోడ్ హస్తం పార్టీ క్యాడర్‌ను గందరగోళ పరుస్తోందట.. డీసీసీ అధ్యక్షుడైన ఎమ్మెల్యే కవ్వంపల్లి ఈ గొడవకు చెక్ పెట్టాల్సి ఉన్నా…కామ్‌గా ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పార్టీలో ఎవరితోనూ గొడవలు లేని వ్యక్తిగా కాస్త సాఫ్ట్ కార్నర్ ఉన్న వెలిచాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి ఎందుకు టార్గెట్ చేసారనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి. సందట్లో సడేమియా అన్నట్టు కరీంనగర్ కాంగ్రెస్‌లోని నేతలు కొందరు తమదైన శైలిలో ఈ అగ్గి చల్లారకుండా చేస్తున్నారనే టాక్ కూడా నడుస్తోందట… నామినేటెడ్ పోస్టులో ఉన్న ఓ లీడర్… ఒక మంత్రి సాయంతో వ్యవహారాన్ని తమవైపు తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అటు మరో మంత్రికి అనుచరులు కూడా వెలిచాలకు సపోర్టు చేస్తున్నారట..
Read Also: Off The Record: పవన్ కల్యాణ్ పొలిటికల్ ఇరకాటంలో పడుతున్నాడా..?
అయితే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులకు సన్నిహితంగా ఉండే నేతలే ఈ వ్యవహారాన్ని మరింత ముదిరేలా ఎగదోస్తున్నారన్న ప్రచారం సైతం ఉంది. మంత్రులకు తెలియకుండా ఇంత వ్యవహారం జరగడం అసాధ్యం కాబట్టి… పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆ ఇద్దరూ పావులు కదుపుతున్నారన్న చర్చలు సైతం ఉన్నాయి. తనకు పదవి కన్ఫామ్, సీఎం అండదండలున్నాయని చెబుతున్న వెలిచాల రాజేందర్‌రావుకు ఈ ఎపిసోడ్‌తో రాజకీయం అంటే ఏంటో తెలిసి వచ్చిందని, ప్రత్యేకించి కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయనేది బోధపడిందన్న టాక్ నడుస్తోంది జిల్లాలో. అందరిని కలుపుకుని పోవాల్సిన డీసీసీ అధ్యక్షుడి నుంచే ఊహించని పరిణామం ఎదురుకావడంతో వెలిచాల శిబిరం కుదుపునకు గురైనట్టు సమాచారం. మరోవైపు మంత్రులతోనే ఢీకొన్న మా కవ్వంపల్లితో మాములుగా ఉండదని అంటున్నారట ఆయన అనుచరులు… వెలిచాలపై పార్టీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించేశారు కూడా. అయితే పదే పదే కయ్యానికి కాలుదువ్వుతున్నారనే పేరున్న కవ్వంపల్లి వివిధ సందర్భాల్లో వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేయాలనే యోచనలో వెలిచాల వర్గీయులు ఉన్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ, బీఆర్ఎస్‌లతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న టైంలో… బలోపేతం కావాల్సిన చోట ఇలా నేతలు రోడ్డెక్కడం క్యాడర్‌ను నారాజ్ చేస్తుందట… క్రమశిక్షణ ముఖ్యం అంటున్న కాంగ్రెస్ పెద్దలు.. ఈ వ్యవహారానికి ఎలా పుల్‌స్టాప్ పెడతారో… చూడాలి…