Off The Record: తెలుగుదేశం పార్టీ కంచుకోట గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఇక్కడ వరుసగా మూడు విడతల నుంచి టీడీపీ అభ్యర్ధులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. క్యాండిడేట్ ఎవరన్న దానితో సంబంధం లేదు. జస్ట్ గుంటూరు వెస్ట్ టీడీపీ టిక్కెట్ తెచ్చుకోగలిగితే చాలు…. ఎమ్మెల్యే అయిపోయినట్టే. దానికి చెక్ పెట్టేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసినా… వర్కౌట్ కాలేదు. 2024లో పార్టీ తరపున బలమైన అభ్యర్థిగా భావిస్తూ… మాజీ మంత్రి విడదల రజనీని గుంటూరు వెస్ట్ బరిలో దింపింది వైసీపీ. అయినాసరే… వర్కౌట్ కాలేదు. ఎలాంటి రాజకీయ అనుభవంలేని గళ్లా మాధవి టీడీపీ తరపున పోటీ చేసి 50వేలకు పైగా మెజార్టీతో గెలిచారంటే ఇక్కడ పార్టీ బలం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ…. మాధవి గెలిచాక పరిస్థితులు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. అంతర్గత ముమ్ములాటలతో చివరికి కేడర్‌ని కూడా డైలమాలో పడేస్తున్నారట నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు ఇద్దరూ. 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాళి గిరిధర్ ఆ తర్వాత వైసీపీలో చేరారు. అప్పటినుంచి ఈ నియోజకవర్గ వ్యవహారాలను మరో సీనియర్… కోవెలమూడి రవీంద్ర చూసుకున్నారు. పూర్తి స్థాయి ఇన్ఛార్జ్‌గా ఆయనే కొనసాగారు.
Read Also: HYD Bava Murder: బావమర్దులు.. బావ బతుకు కోరతారు.. కానీ హైదరాబాద్‌లో ఓ బావ బలి కోరారు
మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున గెలిచిన 10మంది కార్పొరేటర్లలో 8మంది ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉన్నారు. ఈ క్రమంలో….2024 ఎన్నికల్లో వెస్ట్ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు రవీంద్ర. కానీ… రకరకాల ఈక్వేషన్స్, కేలిక్యులేషన్స్ అంటూ… ఆయన్ని పక్కనబెట్టి… ఎలాంటి రాజకీయ అనుభవం లేని గళ్లా మాధవిని తెరపైకి తీసుకొచ్చింది టీడీపీ అధిష్టానం. అప్పుడే కోవెలమూడికి మండిపోయినా… పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేక సైలెంట్ అయ్యారట. ఏళ్ళ తరబడి నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ , కేడర్‌కు అండగా ఉంటూ వస్తే… ఫైనల్‌గా పార్టీ టిక్కెట్ తనకు కాకుండా వేరే వాళ్ళకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారట ఆయన. ఎన్నికల సమయంలోనే రవీంద్ర, గళ్లా మాధవి మధ్య విబేధాలు వచ్చినట్టు చెప్పుకున్నారు. అయితే… పార్టీ గెలుపు మీద ఆ ప్రభావం లేకుండా జరిగిపోయింది. అయితే… మూడు నెలల క్రితం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగిన రాజకీయ పరిణామాలతో… కోవెలమూడికి మేయర్‌గా అవకాశం కల్పించింది టీడీపీ అధిష్టానం. దీంతో గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యే, మేయర్ ఇద్దరూ కీలకంగా మారిపోయారు. అలాగే వార్ కూడా ముదిరిపోయిందన్నది స్థానిక పార్టీ వర్గాల మాట. రవీంద్ర గుంటూరు పశ్చిమ ఇన్ ఛార్జిగా ఉన్నప్పుడే నియోజకవర్గం పరిధిలోని 26 డివిజన్లకు అధ్యక్షులను నియమించారు. కొన్ని చోట్ల ఆయన ముఖ్య అనుచరులకే పదవులు దక్కాయన్న విమర్శలున్నాయి.
Read Also: HDFC APK File Scam: ఏపీకే ఫైల్స్‌తో స్కామ్.. హెచ్‌డీఎఫ్‌సీ సీరియస్ వార్నింగ్!
అలాగే… ఎన్నికల సమయంలో వీళ్ళలో కొందరు మాధవిని ఇబ్బంది పెట్టారని కూడా చెప్పుకుంటారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వారిలో కొంతమంది అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారట. అయితే డివిజన్ అధ్యక్షుల పదవీకాలం ముగిసింది. కొత్త వారిని నియమించే క్రమంలో…పరిస్థితిని తనకు అనుకూలంగా మల్చుకున్నారు ఎమ్మెల్యే. పాత డివిజన్ అధ్యక్షులు 16మందిని తప్పించి కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చారామె. అలా పార్టీ పదవులు కోల్పోయిన వాళ్ళలో ఎక్కువ మంది మేయర్ రవీంద్ర అనుచరులే ఉన్నారట. ఇదే ఇప్పుడు గుంటూరు పశ్చిమలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే మాధవి కోవెలమూడి వర్గానికి చెందిన ఒకరిద్దరికి తప్ప… మిగతా వారందరికీ చెక్ పెట్టినట్టు విశ్లేషిస్తున్నారు నియోజకవర్గంలో. వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్యపోరుతో పార్టీ అంటే పడిచచ్చే, డెడికేటెడ్‌గా పనిచేసే సిసలైన నాయకులకు అన్యాయం జరిగిందన్న చర్చలు నడుస్తున్నాయి. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న సీనియర్స్‌ని కూడా పదవుల విషయంలో పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. కొత్త డివిజన్ అధ్యక్షుల ఎంపికలో వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరికి పదవులు కట్టబెట్టడం ఇంకా కలకలం రేపుతోంది. దీన్నే ప్రశ్నిస్తోంది మేయర్ వర్గం. వలస నేకలకు పదవులు ఇచ్చి… పాత వాళ్ళను వదిలేస్తూ…. ఎమ్మెల్యే ఇక్కడ పార్టీని ఏం చేయదల్చుకున్నారంటూ సీరియస్‌గా ప్రశ్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇలా… ఎమ్మెల్యే, మేయర్ మధ్య వార్‌తో…. బలమైన చోట్ పార్టీ పట్టు తగ్గుతుంది తప్ప ఎవ్వరికీ ప్రయోజనం ఉండబోదని కేడరే మాట్లాడుకుంటోంది. అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలంటున్నారు.