అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిర్యాలగూడలో తనకున్న ప్రతికూల పరిస్థితులపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కిన ఆయన.. 2018లో టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు స్కెచ్ వేస్తున్నారు భాస్కరరావు. అయితే రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక.. నియోజకవర్గంలో ఆయనకు ఇంటా బయటా రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. కొత్తలో వాటిని భాస్కరరావు లైట్ తీసుకున్నా.. హ్యాట్రిక్ విజయానికి ఎక్కడ బ్రేక్ పడుతుందోనని కలవపడ్డారట. వెంటనే వ్యూహం మార్చేసి.. గులాబీ పార్టీలో తనపై అసంతృప్తితో ఉన్నవారిని.. దూరంగా జరిగిన వారిని ఆప్యాయంగా పలకరించే పని చేపట్టారు. అంతేకాదు.. పదవులు కట్టబెట్టేస్తున్నారు. అభినందనల పేరుతో పార్టీ నేతలకు శాలువలు కప్పేస్తున్నారు భాస్కరరావు. దీంతో ఎమ్మెల్యే రోజువారీ షెడ్యూల్ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా మారిపోయిందట.
Read Also: OTR about Janasena Party: జనసేనాని వడపోతలు..! పీఆర్పీలో పనిచేసిన నేతలకు గాలం..!
గడిచిన మూడున్నరేళ్లుగా ఎమ్మెల్యే వ్యవహారాలతో భాస్కరరావు కుమారుడు సిద్ధార్థ దూకుడు ప్రదర్శించారు. ఇప్పుడు తనయుడికి బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. కొన్ని వ్యవహారాలకే పరిమితం కావాలని సిద్ధార్థకు చెప్పేశారట ఎమ్మెల్యే. ఎవరివల్ల అయితే తనకు రాజకీయంగా ఇబ్బంది అని భావిస్తున్నారో అలాంటి వారికి స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట. అలాగే పార్టీలో ఇతర నేతలతో ఉన్న బేధాభిప్రాయాలను తొలగించుకునే పనిలో పడ్డారు. మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్‌తో ఎమ్మెల్యే భాస్కరరావుకు పడటం లేదు. ఇప్పుడు ఇద్దరికీ సయోధ్య కుదిరిందట. మున్సిపాలిటీ పరిధిలో పనులు.. ఇతర వ్యవహారాలలో ఒక అవగాహనకు వచ్చారట.
మిర్యాలగూడలో బలమైన సామాజికవర్గంగా ఉన్నారు ఆర్యవైశ్యులు. ఆ వర్గానికి చెందిన మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్‌తో కయ్యానికి కాలు దువ్వడం మొదటికే మోసం వస్తుందని గ్రహించారట భాస్కరరావు. నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం కూడా టచ్ మీ నాట్‌గా ఉంటోందని గుర్తించి.. ఆ వర్గంలో కీలక నేతలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. జడ్పీటీసీ విజయనరసింహారెడ్డికి తెలంగాణ ఆగ్రోస్ ఛైర్మన్ పదవి వచ్చేలా లాబీయింగ్ చేసి.. తనకు అనుకూలంగా చక్రం తిప్పారట. మంత్రికి తెలియకుండానే ఎమ్మెల్యే పనికానిచ్చేశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అధికారపార్టీకే చెందిన శ్రీనివాసరెడ్డి అనే మరో నేతకు రైతుబంధు జిల్లా అధ్యక్ష పదవి వరించేలా జాగ్రత్త పడ్డారట భాస్కరరావు. ఈ విధంగా మిర్యాలగూడలో గెలుపోటములను ప్రభావితం చేసే రెండు సామాజికవర్గాలను ప్రసన్నం చేసుకున్నారని.. ఆ వర్గాల నుంచి డ్యామేజీ లేకుండా చేసుకున్నారని ఎమ్మెల్యే అనుచరులు భావిస్తున్నారట.
ఈ పదవుల పంపకంపై మిర్యాలగూడ బీఆర్‌ఎస్‌లోని ఎస్సీ, ఎస్టీలు కినుక వహించారట. మా సంగతేంటి అని ఎమ్మెల్యే భాస్కరరావును నిలదీస్తున్నట్టు సమాచారం. తమకు రిజర్వ్డ్ అయిన పదవులను కూడా వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారట. దాంతో వారిని కూడా ప్రసన్నం చేసుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు ఎమ్మెల్యే. మొత్తానికి హ్యాట్రిక్ గెలుపు కోసం రూటు మార్చేశారు భాస్కరరావు. ఈ పదవుల పంపకం.. బుజ్జగింపులు.. లాలింపులు.. ఎమ్మెల్యేకు ఎన్నికల్లో కలిసి వస్తాయా అనేది కేడర్ ప్రశ్న.