Off The Record: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి సొంత గన్‌మ్యాన్ బుల్లెట్ యూరియా రూపంలో గట్టిగానే దిగిందట. గన్‌మ్యాన్ నాగు నాయక్ యూరియా లోడ్‌ను పక్కాదారి పట్టించిన వ్యవహారం… తిరిగి తిరిగి ఎమ్మెల్యేకు మెడకు చుట్టుకున్నట్టు తెలుస్తోంది. అది ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారడంతో…బీఎల్‌ఆర్ మీద అధికార పార్టీ కీలక నేతలు బాగా సీరియస్ అయినట్టు సమాచారం. ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసి…. తన ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే బత్తుల ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారట. చిన్న నిర్లక్ష్యానికి.. ఆయన భారీ మూల్యమే చెల్లించుకొవాల్సి వస్తోందని అంటున్నారు. అసలు నియోజకవర్గంలో యూరియా పంపిణీ సక్రమంగా జరిగి ఉంటే.. ఆయనకుఈ పరిస్థితి వచ్చేదే కాదని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ నాయకుల మితిమీరిన జోక్యం ఫలితాన్నే ఇప్పుడు మిర్యాలగూడ ఎమ్మెల్యే అనుభవిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఎవరికి వారు అతి జోక్యం చేసుకోవడం వల్ల మిర్యాలగూడలో బూమరాంగ్ అయిందని అంటున్నారు. ఇంతకీ… యూరియాకు, ఎమ్మెల్యే గన్‌మ్యాన్‌కు సంబంధం ఏంటంటే… సేమ్ అధికార దర్పమేనన్నదే సమాధానం. అధికారంలో ఉన్న వాళ్ళు తానా అంటే కొందరు ఆఫీసర్స్ తందానా అంటున్న పరిస్థితిని ఆసరా చేసుకుని సొంతానికి వాడుకున్నారట గన్‌మ్యాన్ నాగు నాయక్. ఎమ్మెల్యేని కంటికి రెప్పలా కాపాడుతున్నాను… ఆయన పవర్‌ని మాత్రం ఎందుకు వాడుకోకూడదని అనుకున్నారో ఏమోగానీ… తాను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పీఏని అంటూ… సంబంధిత జిల్లా అధికారి ఒకరికి ఫోన్ చేసి నియోజకవర్గానికి ఓ లోడ్ యూరియా పంపమని చెప్పేశారట.
Read Also: Duddilla Sridhar Babu : హైదరాబాద్‌ను గ్లోబల్ డిజైన్ హబ్‌గా మారుస్తాం
ఇంకేముంది సదరు మహిళా ఆఫీసర్ అలర్ట్ అయిపోయారు. అది ఎమ్మెల్యే హుకుం అనుకున్నారో, లేక స్వామి భక్తిని చాటుకున్నారోగానీ…. వెనకా ముందు ఆలోచించకుండా లోడ్ యూరియా పంపేశారు. అది పూర్తిగా పక్కదారి పట్టింది. విషయం బయటికి పొక్కి… రచ్చ అయి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు. మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యూరియా షాపు పై టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసిన సమయంలో… అక్రమ నిల్వలు బయటపడి అసలు విషయం తెలిసిపోయింది. కానీ కేసు నమోదుకు చేయాల్సిన పోలీస్ అధికారిగాని, ఫిర్యాదు చేయాల్సిన వ్యవసాయశాఖ అధికారిగాని టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్‌కు సహకరించలేదట. చివరకు పోలీస్ బాస్ రంగంలోకి దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టినట్టు తెలిసింది. ఇదంతా మితిమీరిన రాజకీయ జోక్యం వల్లేనంటూ బహిరంగంగానే మాట్లాడేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు రోడ్డెక్కతుండగా, సరఫరా పెంచాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న క్రమంలో…అవకాశం దొరికితే చాలు ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ కాచుకుని కూర్చున్న సందర్బంలో… ఆలర్ట్‌గా ఉండాల్సింది పోయి ఈ గోలేంటని అంటున్నారు. ఎమ్మెల్యే గన్‌మ్యాన్ ఏకంగా లోడ్ యూరియాను పక్కదారి పట్టించడమంటే అదేం చిన్న విషయం కాదు. అటు ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు కూడా.. వెతకబోయిన తీగ కాలుకే తగిలినట్లైంది. దీని గురించి సోషల్ మీడియాలో కూడా చెడుగుడు ఆడేసుకుంటున్నారు గులాబీ లీడర్స్. అత్యంత కీలకమైన సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బాద్యతగా వ్యవహారించాల్సిన ఎమ్మెల్యే కూడా… తన వెంట ఉన్నవాళ్ళలో మంచోళ్ళు ఎవరు, ముంచేటోళ్ళు ఎవరన్నది గుర్తించలేకపోవడంపై…కాంగ్రెస్ పెద్దలు అసహనంగా ఉన్నారట.
దీంతో కాస్త ఆలస్యంగానైనా కళ్ళు తెరిచిన ఎమ్మెల్యే బీఎల్‌ఆర్… డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. తన కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి 2 కోట్ల రూపాయల చెక్కు అందజేశారు. ఇటీవల ఎమ్మెల్యే కుమారుడు సాయిప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో అందుకు సంబంధించిన రిసెప్షన్‌ను భారీ ఎత్తున పెట్టాలనుకున్నానని, కానీ… మనసు మార్చుకుని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చుపెట్టాలనుకున్నానని చెప్పాలు లక్ష్మారెడ్డి. తాను ఇచ్చిన రెండు కోట్ల రూపాయలతో… యూరియా కొని లక్ష మంది రైతులకు తలో బస్తా ఉచితంగా పంపిణీ చేయమని కోరారాయన. అయితే… పైకి రైతు సేవ అని చెబుతున్నా… అసలు విషయంలో మాత్రం డ్యామేజ్ కంట్రోలేనని విశ్లేషిస్తున్నారు ఎక్కువ మంది. అందుకే అడుసు తొక్కనేల…కాలు కడగనేల అంటున్నారు.