Off The Record: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులు తన మాటను ఖాతరు చేయడం లేదని, ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ లేఖలో ఆరోపించారాయన. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి జూపల్లి. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఇద్దరూ తన ఆదేశాల్ని పట్టించుకోకుండా… విధులకు ఆటంకాలు సృష్టిస్తున్నారన్నది మంత్రి బాధ. అయితే… లేఖ తర్వాత ఈ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. మంత్రి తనమీద సీఎస్‌కు ఫిర్యాదు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి….స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ వీఆర్ఎస్కు అనుమతిస్తూ… సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు కూడా. అంతలోనే ఇంకో ట్విస్ట్ ఇచ్చారు మంత్రి. వీఆర్ఎస్కు రిజ్వీ పెట్టుకున్న దరఖాస్తును ఆమోదించ వద్దంటూ… సీఎస్‌కు మరో లేఖ రాశారాయన. ఈ నెల 31 నుంచి రిజ్వీ పదవీ విరమణ అమల్లోకి వస్తుందని బుధవారమే ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు చీఫ్ సెక్రెటరీ.
ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రెండో లేఖ ఇటు రాజకీయ వర్గాలు, అటు బ్యూరోక్రాట్స్‌లో చర్చనీయాంశం అయింది. మంత్రి లేఖతో ఒక్కసారిగా ఎక్సైజ్ శాఖలో అంతర్గత విభేదాలు బయటపడ్డట్టయింది. రిజ్వీ వీఆర్ఎస్కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొద్దంటూ… సీఎస్‌తో వదిలిపెట్టకుండా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా మంత్రి జూపల్లి లేఖ రాయడం ఇంకా కాక పెంచుతోంది. తన విషయంలో రిజ్వీ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా… అక్రమాలకు పాల్పడ్డారంటూ తాజా లేఖలో ఆరోపించారు జూపల్లి.విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. మంత్రిగా తన విధులకు కూడా ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. మద్యం బాటిళ్లపై సెక్యూరిటీ కోసం వేసే హాలోగ్రామ్ స్టిక్కర్ల కాంట్రాక్టును 11 ఏళ్లుగా ఒకే కంపెనీకి ఇస్తున్నారని, మరింత భద్రతతో, లేబుల్స్ మార్చి టెండర్లు పిలవాలని చెప్పినా కనీసం పట్టించుకోలేదని, మళ్లీ పాత వారికే కాంట్రాక్టు కట్టబెట్టారని లేఖలో ప్రస్తావించారు జూపల్లి.
ఇక చిట్టి సృజన్ కేసులో బకాయిలతో పాటు కాంపౌండింగ్ ఫీజు విషయంలో ఇచ్చిన సూచనలను రిజ్వీ పెడచెవిన పెట్టారని తెలిపారు. క్యాప్రికార్న్ బ్లెండర్స్ నుంచి 6 కోట్ల 15 లక్షల రూపాయల్ని డెమరేజ్ చార్జీల కింద చట్టవిరుద్ధంగా వసూలుకు సంబంధించిన ఫైల్స్ ఇవ్వడానికి కూడా నిరాకరించారంటూ ఫైర్ అయ్యారు మినిస్టర్. టీజీబీసీఎల్ ఎండీ అడిగినా వివరాలు ఇవ్వకపోవడం దారుణమని, ఏబీడీ లిమిటెడ్ కంపెనీ మద్యం ఉత్పత్తి, గరిష్ట అమ్మకం ధర విషయంలో చేసిన జాప్యంతో సర్కార్ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందంటూ… సీఎం, సీఎస్‌కు రాసిన లేఖలో ఆరోపించారు జూపల్లి కృష్ణారావు. మరోవైపు లేబుల్స్, హాలోగ్రామ్ టెండర్ల విషయంలో ప్రభుత్వ నిబంధనల మేరకే నడుచుకున్నామని… ఉన్నతాధికారుల సూచనల ప్రకారం ఫైల్స్ మూవ్ చేశామంటున్నారు ఆఫీసర్స్. తెలంగాణ ప్రభుత్వానికి నష్టం వాటిల్లే పనులు చేయలేదని… విధుల పట్ల నిర్లక్ష్యం వహించ లేదని చెబుతున్నారు. మంత్రి ఆదేశాలపై సీఎంవో అధికారులకు ఎప్పుడో సమాచారం ఇచ్చామని వివరణ ఇస్తున్నారు. ఈ పరిణామ క్రమంలో రిజ్వీ వీఆర్ఎస్పై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందోనన్నది ఆసక్తిగా మారింది.