Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియరైంది. దానికి సంబంధించి సర్కార్‌కు పలు సూచనలు ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మున్సిపల్, పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్‌కు సిద్ధం కావాలంటూ… ఒక షెడ్యూల్‌తో కూడిన వివరాలు అందజేసింది కమిషన్. వచ్చే ఏడాది జనవరిలోపు మున్సిపాలిటీలకు, ఆ తర్వాత జులైలోపు పంచాయతీలు, జడ్పిటిసి….ఎంపిటిసీలకు ఎన్నికలు జరపాలని సూచించింది. దీంతో అధికార యంత్రాంగం కూడా ఆ దిశగా అడుగులు వేయబోతోంది. అదంతా ఒక ఎత్తయితే…. ఎన్నికల సంఘం నిర్ణయం తర్వాత కూటమి పార్టీల్లో కొత్త చర్చ మొదలైందట. మూడు పార్టీల నడుమ ఎంత వరకు సయోధ్య ఉందన్న విషయంలో వాళ్ళకే అనుమానాలు ఉన్నట్టు తెలుస్తోది. నిస్సందేహంగా… పై స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వాల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని, అదే కిందికి వచ్చేసరికి ప్రశ్నార్ధకమేనన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. గ్రామ, మండల స్థాయిలో…, కొన్ని చోట్లయితే నియోజకవర్గ లెవల్‌లో కూడా మూడు పార్టీల మధ్య అనైక్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు.
Read Also: Mirai : ఓజీ థియేటర్లలో రక్తపాతమే : తేజసజ్జా
కూటమి స్థానిక నేతల మధ్య సఖ్యత చాలా తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో…. లోకల్ బాడీస్ ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలి, ఓటింగ్ మీద దాని ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోందట నేతల మధ్య. ఇలాంటి వాతావరణంలో అసలు క్యాడర్ కలిసి పనిచేస్తుందా? వాళ్ళకని వీళ్ళు, వీళ్ళకని వాళ్ళు అలకలు, పంతాలతో మొదటికే మోసం తెస్తారా అన్న ఆందోళన సైతం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఇప్పటివరకు పై స్థాయిలో ఐక్యత బానే ఉన్నా..కింది లెవల్‌లో మాత్రం కొన్ని చోట్ల క్యాడర్, లీడర్స్ రగిలిపోతున్నపరిస్థితి కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు ముఖ్య నాయకుల్ని టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క యూరియా కొరత ఆందోళనలు, రైతులు రోడ్డెక్కడం లాంటివి కంగారు పెడుతున్నాయట.ఈ ప్రభావం కూడా స్థానిక ఎన్నికలపై పడుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో టీడీపీ జనసేన మధ్య ఐక్యత పై అనేక అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా రెండు పార్టీల ముఖ్య నేతల మధ్యనే మాటలు నడుస్తున్నాయట. ప్రధానంగా…. ఉమ్మడి ఉభయ గోదావరి, ఉత్త్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ జనసేన నేతల మధ్య క్షేత్ర స్థాయిలో సమన్వయం కుదరడం లేదని తెలుస్తోంది.
ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందన్న భయాలు పెరుగుతున్నాయట. ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా….జనంలోకి సరిగ్గా తీసుకు వెళ్లలేకపోతున్నామని, ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని ఇటీవల సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎన్నికలకు వెళ్ళాలి. ఇలా అయితే ఎలాగంటూ… తాజా క్యాబినెట్ మీటింగ్ తర్వాత సీఎం మంత్రులతో అన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలు, మంత్రులు అలర్ట్‌గా ఉంటేనే…..కింది స్థాయిలో క్యాడర్ సరిగ్గా ఉంటుందని సీఎం అన్నట్టు తెలిసింది. ప్రభుత్వం..ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటన్నిటినీ జనంలోకి తీసుకు వెళ్తేనే స్థానికం లో మాంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు మాడు పార్టీల పెద్దలు. అందుకు తగ్గట్టు కింది స్థాయిలో సమన్వయం పెంచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారట కూటమి పెద్దలు.
