Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీల అగ్రనేతల మధ్య సఖ్యత ఎంతలా ఉన్నా…. క్షేత్ర స్థాయిలో మాత్రం అక్కడక్కడా తేడా కొడుతోందన్న వాదనన బయలుదేరింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఈ పరిస్థితి ఉండగా… ఇప్పడు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గం కూడా ఆ లిస్ట్‌లో చేరిందంటున్నారు. ఇక్కడ ఇద్దరు ముఖ్య నేతల మధ్య యుద్ధం పీక్స్‌కు చేరిందట. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మధ్య చాలా ఏళ్ల నుంచి రాజకీయ గొడవలు ఉన్నాయి. గత ఐదేళ్లు వైసీపీ హయాంలోఎమ్మెల్యేగా ఉన్నారు కాపు రామచంద్రారెడ్డి. అప్పట్లో ఇద్దరి మధ్య జరిగిన పోరు అంతా ఇంతా కాదు. ఒకర్నొకరు వ్యక్తిగతంగా దూషించుకునే స్థాయికి వెళ్లారు. అయితే ఎన్నికల సమయంలో కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరిపోయారాయన. ఇక టీడీపీ-బీజేపీ పొత్తు కుదిరాక కూడా అలాగే ఉండిపోయారు. ఈ క్రమంలో రాజకీయ బద్ద శతృవులిద్దరూ ఒకే కూటమిలోకి వచ్చినట్టయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాల్వ శ్రీనివాసులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. కూటమిపరంగా పొత్తు కలిసినప్పటికీ ఈ నేతల మధ్య పగలు ఏ మాత్రం చల్లారలేదట. ఇద్దరి మధ్య ఇప్పుడు ఐరన్ ఓర్ చిచ్చు రగులుతోందట. ఇక్కడ గతంలో సిబిఐ సీజ్ చేసిన టన్నులకొద్దీ ఐరన్ ఓర్‌ను వైసీపీ నాయకులు దోచుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పట్లో వేళ్ళన్నీ కాపు రామచంద్రారెడ్డి వైపు చూపించడంతో ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఐరన్ ఓర్ చోరీ అవుతోందంటూ తాను సిబిఐకి లేఖ రాశానని… కానీ దానిపై చర్యలు తీసుకోలేదన్నారు. గత ఐదేళ్లలో కాదు…. ఇప్పుడసలు అంతకు మించి అక్రమంగా తరలిపోతోందని, దాని మీద కొందరు కోట్లు పోగేసుకుంటున్నారని, దీని వెనక టిడిపి నాయకులు ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు కాపు రామచంద్రారెడ్డి. అదలా ఉంటే… రాయదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని అంశాల మీద ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైందట. ఈ క్రమంలో రాయదుర్గం ప్రాంతంలో ఉన్న క్రషర్ యజమానులు ప్రెస్ మీట్ పెట్టి కాపు రామచంద్రారెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు తమ నుంచి 200 కోట్ల రూపాయలు వసూళ్లు చేశారని… ఇప్పుడు బిజెపి పేరు చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, బిజెపి అగ్రనాయకత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు క్రషర్ యజమానులు. అయితే… క్రషర్ యజమానుల వెనక ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఉన్నారని… వారిని రెచ్చగొట్టి తనపై ఇలా మాట్లాడించారని అంటున్నారట కాపు. ఎవరి దగ్గరో లంచాలు తీసుకునే కర్మ నాకు పట్టలేదంటూ… రాయదుర్గంలో టిడిపి గెలిచినప్పటి నుంచి ఒక్క వ్యభిచార గృహాలు తప్ప అన్ని అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు కాపు. ఇల్లీగల్ వ్యాపారాలకు తాను అడ్డుపడుతున్నానన్న అక్కసుతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కాల్వ శ్రీనివాసులు పై ఫైర్ అయ్యారు కాపు రామచంద్రారెడ్డి. గత ఐదేళ్లలో ఎప్పుడు ఐరన్‌ఓర్ దొంగతనం జరగలేదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్రమంగా తరలించుకొని కోట్లు గడిస్తున్నారన్నారని ఆరోపిస్తూ… కాల్వ శ్రీనివాసులుని టార్గెట్ చేస్తున్నారు కాపు. అలాగే… రాయదుర్గం ప్రాంతంలో ఉన్న పరిశ్రమల యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని కూడా ఆరోపించారాయన. అయితే ఈ ఆరోపణలపై కాల్వ శ్రీనివాసులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఆయన స్పందన ఎలాఉన్నా… ప్రతిపక్ష నేతలకంటే ఎక్కువగా కూటమిలోని మిత్రపక్ష నాయకుల మధ్య విభేదాలు పెరిగిపోవడం, బహిరంగంగానే నువ్వెంత అంటే నువ్వెంత అనేదాకా వెళ్లడం మంచి పరిణామం కాదంటున్నారు పొలిటికల్ పండిట్స్. రెండు పార్టీల అగ్ర నాయకత్వాలు ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోకుంటే… రెండు పార్టీలు నష్టపోవాల్సి వస్తుందన్న వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి రాయదుర్గంలో.