Off The Record: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నా… పూర్తిగా సమయం కేటాయించలేని పరిస్థితి. అందుకే.. నియోజకవర్గంలోని పార్టీ కేడర్, పనులు, అధికారులతో సమన్వయ బాధ్యతల్ని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అప్పగించారు. అంతకు ముందు కూడా పిఠాపురం కో ఆర్డినేటర్‌గా ఉన్నారాయన. అయితే…మొదట్లో బాగానే ఉన్నా…. రానురాను కాకరకాయ కీకరకాయగా మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. అందర్నీ సమన్వయం చేసుకుంటూ… తాను అందుబాటులో లేనప్పుడు ఆ లోటు తెలియకుండా చూసుకోమని పవన్ బాధ్యతలు అప్పగిస్తే…. ఉదయ్ శ్రీనివాస్ మాత్రం ఆ పని మానేసి సెల్ఫ్ ప్రమోషన్‌లో బాగా బీజీ అయ్యారన్న విమర్శలు వచ్చాయి. తనను తాను ప్రమోట్ చేసుకున్నా… పార్టీ పటిష్టానికి ఏవైనా చర్యలు తీసుకున్నారా అంటే… అదీ లేదట. ఈ క్రమంలోనే పవన్‌తో బాగా గ్యాప్ వచ్చినట్టు తెలిసింది. అసలు నెలలుగా… తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌కు పవన్ అపాయింట్ ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు. అందుకు కారణాలు కూడా చాలా బలంగా ఉన్నాయట. పారిశ్రామిక వ్యర్ధాల నియంత్రణ విషయంలో ఉప్పాడ మత్స్యకారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మాకు న్యాయం చేయాలంటూ తీవ్ర స్థాయిలో ఉద్యమించారు.
దీంతో స్పందించిన పవన్ నాకు 100 రోజుల టైం ఇవ్వండి ఆ లోపు తగిన నిర్ణయం తీసుకుందామంటూ వారిని సముదాయించి ఇన్ఛార్జ్‌గా ఉన్న ఎంపీకి బాధ్యతలు అప్పగించారు. ఆ డెడ్‌లైన్ దగ్గరపడుతున్నా…. ఇంతవరకు అతీగతీ లేదు. ఇక కాకినాడ కలెక్టర్‌తో కూడా ఎంపీకి సత్సంబంధాలు లేవని, దాని ప్రభావం అభివృద్ధి పనులు, పాలనా వ్యవహారాల మీద పడుతోందని స్వయంగా జనసేన వర్గాలే చెప్పుకుంటున్న పరిస్థితి. ఇలాంటి రకరకాల కారణాలతో ఎంపీకి పవర్ కటింగ్ ప్రోగ్రామ్ మొదలైపోయింది. పిఠాపురంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉదయ్ శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు, ఓదురి కిషోర్‌తో ఫైవ్ మాన్ కమిటీని నియమించారు. ఇక ప్రతి నియోజకవర్గంలోనూ వార్డు, బూత్, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముందు పిఠాపురంలో పైలెట్ ప్రాజెక్టుగా ఫినిష్ చేసి మిగతా నియోజకవర్గాల్లో అప్లయ్ చేద్దామనుకున్నారు. అయితే… ఆ కమిటీల విషయంలో కూడా ఎంపీ సాబ్ అత్యుత్సాహం ప్రదర్శించారట. తొలి నుంచి పార్టీలో ఉన్న వాళ్లను పక్కనపెట్టి తన భజనపరులకు ప్రయారిటీ ఇచ్చారన్నది జనసేన వాయిస్. ఎమ్మెల్సీ హరిప్రసాద్ నియోజకవర్గ రాజకీయాల్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు. ఇక కమిటీలో ఉన్న మిగతా వాళ్లని డమ్మీలు చేసే క్రమంలో… అంతా నాకు నచ్చినట్లే జరగాలని చెప్పారట ఉదయ్ శ్రీనివాస్. నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఏమీ జరగకూడదంటూ శాసించే ప్రయత్నం చేయడతో పార్టీ ఆయనకు ఝలక్ ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది. పార్టీ కమిటీల నియామకాల్ని సకాలంలో పూర్తి చేయకపోవడం, నియమించిన వాటిలో వందిమాగధులకే చోటివ్వడం లాంటి కారణాలతో… పార్టీ ఆయన్ని పక్కన పెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీకి బదులుగా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌కి ఆ బాధ్యతలు అప్పగించిందని మాట్లాడుకుంటున్నారు లోకల్ జనసేన లీడర్లు. మామూలుగా ఎంపీ అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి ఉంటుంది.
కానీ… కాకినాడ పరిధిలో మిగతా ఐదు చోట్ల టిడిపి ఎమ్మెల్యేలు ఉండడం, కాకినాడ రూరల్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నా ఆయనతో కూడా ఎంపీకి సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండడంతో పెద్దగా పని ఉండదు. ఇక ఉన్న పిఠాపురం ఒక్క నియోజకవర్గంలో కూడా ఆయన సెట్ చేయలేరా అని జనసేన వర్గాలే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పుడు పై నుంచి వేరే నాయకుడు వచ్చారంటే… ఈయనగారి మీద నమ్మకం లేకనే కదా అంటూ గుసగుసలాడుకుంటున్నారు పిఠాపురం జనసైనికులు. అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కమిట్మెంట్‌తో పని చేయాల్సింది పోయి ఎక్స్ ట్రా యాక్టివిటీస్ అవసరమా అన్నది వాళ్ళ క్వశ్చన్. ఆయన్ని మించి అన్నట్టుగా తోక జాడిస్తే.. ఇలాగే ఉంటుంది, ఎక్కడ కత్తిరించాలో వాళ్ళకు తెలుసునోయ్ అంటున్నారు. జీతాలిచ్చేవాడి మీద జోకులేస్తే… ఇలాగే ఉంటుందంటూ పవన్ పాపులర్ సినిమా డైలాగ్‌ని, ఆ డైలాగ్ చెప్పేటప్పుడు అసిస్టెంట్ ఒకర్ని తల్లకిందులుగా వేలాడదీసిన సీన్‌ని గుర్తు చేసుకుంటున్నారు పిఠాపురం జనసేన కార్యకర్తలు. ఓవరాల్‌గా ఈ కత్తిరింపుల తర్వాతైనా ఎంపీకి జ్ఞానోదయం అవుతుందా? తానేంటి, ఎంతవరకు అన్నది తెలుసుకుంటే ఆయనకే మంచిదన్నది పిఠాపురం టాక్.