తనదాకా వస్తే తెలియదన్నట్టుంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఎఐసీసీ నాయకత్వాన్ని తిట్టినా పట్టించుకునే తీరిక.. ఆలోచన లేదు. ఎవరికి వారు నాకెందుకులే అని వదిలేస్తున్నారట. తిట్టింది నన్ను కాదు కదా అనే భావన మరికొందరిది. తిట్టేవాళ్లు తిట్టని.. పడేవాళ్లు పడని అనుకుంటున్నారో ఏమో.. చివరకు రాహుల్‌గాంధీ మొదలుకొని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరకు అందరినీ దూషించినా ఒక్కరిలోనూ చలనం లేదు. కాంగ్రెస్‌కు లాయలిస్ట్‌గా కొనసాగిన మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ రాహుల్‌గాంధీని, కెసి వేణుగోపాల్‌ను.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని.. పీసీసీ చీఫ్ రేవంత్‌ను ఓ రేంజ్‌లో కడిగిపారేశారు. కాంగ్రెస్ నుంచి అదే తరహాలో మర్రిపై కౌంటర్ అటాక్ ఉంటుందని భావించారు. కానీ కాంగ్రెస్ నేతలు పిన్‌డ్రాప్ సైలెన్స్ పాటిస్తున్నారు. అదే పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదట.
Read Also: Off The Record: గద్వాల టీఆర్ఎస్‌లో కొత్త రగడ..
తెలంగాణలో కాంగ్రెస్‌ని ప్రజలు నమ్మబోరని బాహటంగానే చెప్పారు మర్రి. ఉత్తమ్ హయం నుంచి కాంగ్రెస్ దెబ్బతిందన్నారు. రేవంత్ బ్లాక్‌మెయిల్ చేస్తారని ఆరోపించారు. అయితే ఉత్తమ్‌ను తిట్టారు కదా అని రేవంత్ వర్గం.. రేవంత్‌ను దూషించారు కదా అని ఉత్తమ్ వర్గం.. ఎవరికి వారు సర్ది చెప్పుకొంటున్నారట. రాష్ట్ర నాయకుల సంగతి ఎలా ఉన్నా.. మర్రి ఏకంగా AICC నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని విమర్శిస్తే ఎందుకు రియాక్ట్ కాలేదన్నదే ప్రశ్న. కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో ఉన్న వారు సైతం మౌనమే. చివరకు రేవంత్, ఉత్తమ్‌లు సైతం పెదవి విప్పలేదు. మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయారు కదా.. ఆయన విమర్శలపై స్పందించడం ఎందుకు అనుకున్నారో ఏమో.. మిగతా నాయకులు అదే ఫాలో అయినట్టు ఉన్నారు.
టీ పీసీసీకి చెప్పుకోవడానికి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు.. 13 మంది అధికార ప్రతినిధులు.. డజన్లు కొద్దీ సీనియర్లు ఉన్నారు. వాళ్లంతా కోల్డ్‌స్టోరేజీలోకి వెళ్లిపోయారనే కామెంట్స్ గాంధీభవన్ వర్గాల్లోనే ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ నాయకులకు పార్టీ అజెండా కంటే.. సొంత అజెండాలే ఎక్కువ. ఉన్నది పది మంది కీలక నాయకులైతే.. అందులోనూ ఐదు గ్రూపులుగా టీ కాంగ్రెస్ చీలిపోయింది. అదీ కూడా ఒక కారణమై ఉంటుందని వాదన. కీలక నాయకులు సైతం స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో శ్రేణులకు అంతుచిక్కడం లేదట. రాహుల్‌ను తిట్టినా స్పందించ లేనంత మొద్దుబారి పోయారని సొంత నాయకులపైనే కేడర్ సెటైర్లు వేసుకునే పరిస్థితి నెలకొంది.