Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆత్మకూరు, ఉదయగిరి. అలాంటి చోట్ల కూడా గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జెండా ఎగరేశారు. ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరిలో ఆయన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. ఇక ఎన్నికల తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాబాయ్, అబ్బాయ్ నియోజకవర్గాలకు ముఖం చాటేసి పార్ట్ టైం పొలిటీషియన్స్‌గా మారిపోయారంటూ అసహనంగా ఉంది రెండు నియోజకవర్గాల వైసీపీ కేడర్. ఎలాగూ ఓడిపోయాం…. ఇప్పట్నుంచే ఎగిరెగిరి దంచడం ఎందుకు? ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళ టైం ఉంది…. ఆ దంపుడేందో అప్పుడే చూపించవచ్చులేనని అనుకుంటున్నట్టు సమాచారం. 2022లో అప్పుడు మంత్రిగా ఉన్న గౌతం రెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. కానీ… గత ఎన్నికల్లో ఆయన మీద టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి విజయం సాధించారు. తన సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు నేతల మాటలు వినడం వల్లే విక్రమ్ రెడ్డి ఓడిపోయారని చెప్పుకున్నారు. ఓటమి తర్వాత నియోజకవర్గానికి చుట్టమైపోయారు విక్రమ్. ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో ద్వితీయ శ్రేణి నేతల మధ్య ఆధిపత్యం పోరు నడుస్తున్నా…. విక్రమ్ రెడ్డి అస్సలు పట్టించుకోవడం లేదంటున్నారు.
గత ఎన్నికల్లో అండగా నిలబడి ఆయన కోసం ఖర్చు పెట్టుకున్న వాళ్ళను కూడా ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. వ్యాపారాల పేరుతో బెంగళూరుకే పరిమితం కావడంతో….. ఆత్మకూరు వైసీపీ కేడర్ చిన్నాభిన్నమవుతోందని అంటున్నారు. ఇటీవల మంత్రి ఆనం మేకపాటి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. మాటలు తప్ప మేకపాటి ఫ్యామిలీకి చేతలుండవంటూ అటాక్ చేసినా… కౌంటర్ ఇవ్వడానికి కూడా విక్రమ్ రెడ్డికి టైం లేదన్న అసహనం వైసీపీలో కనిపిస్తోంది. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అన్ని చోట్ల నియోజకవర్గ ఇన్చార్జ్‌ల ఆధ్వర్యంలో జరుగుతుంటే.. విక్రం రెడ్డి మాత్రం ద్వితీయ శ్రేణి నేతలకి అప్పగించారట. దీంతో అది కూడా చప్పగా సాగుతున్నట్టు చెబుతోంది కేడర్. ఇక బాబాయ్ ఇన్ఛార్జ్‌గా ఉన్న ఉదయగిరి విషయానికొస్తే… రాజగోపాల్ రెడ్డి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి అడపాదడపా నియోజకవర్గంలో తిరుగుతున్నారు తప్ప అంత ప్రభావం చూపలేకపోతున్నారట. అటు మేకపాటు రాజగోపాల్ రెడ్డి మాత్రం బ్రాహ్మణపల్లిలోనే మకాం వేసి అప్పుడప్పుడు నేతలతో మాట్లాడుతున్నారు తప్ప.. నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడ్డం లేందటున్నారు. దీంతో తమకు బాధ్యతలు ఇవ్వాలంటూ ఒకరిద్దరు నియోజకవర్గ నేతలు తిరుగుతున్నా… అధిష్టానం మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదట.
ఇక రాష్ట్రంలో మేకపాటి కుటుంబానికి రకరకాల వ్యాపారాలు ఉండటంతో… ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించలేకపోతున్నారన్న అభిప్రాయం రెండు నియోజకవర్గాల్లో ఉందట. మరోవైపు ఇన్ఛార్జ్‌ల పేరుతో.. ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో తిరిగితే.. ఖర్చు తడిసి మోపుడవుతుందని, ఆల్రెడీ గత ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టి నష్టపోయాం కాబట్టి ఇంకొన్నాళ్ళు కామ్‌గానే ఉందామన్న అభిప్రాయం మేకపాటి ఫ్యామిలీలో కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు స్థానికంగా. తమ సీట్లు ఎక్కడికీ పోవన్న ధీమా కూడా ఇందుకు ఒక కారణం అంటున్నారు. పైసలుంటేనే రాజకీయం.. కాబట్టి ఆ ఖర్చేదో ఎన్నికల టైంలో పెట్టి అప్పుడే తిరిగేస్తే సరిపోతుంది కదా అన్నది బాబాయ్, అబ్బాయ్ అభిప్రాయమట. కానీ…అధికారం ఉన్నప్పుడు నేతలుగా చెలామణి అయ్యి.. ప్రతిపక్షంలో పత్తా లేకుండా పోవడం ఏం రాజకీయమంటూ వైసీపీలోని వీళ్ళ వ్యతిరేకవర్గం ప్రశ్నిస్తోంది. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మేకపాటి కుటుంబం.. ప్రజలతో పాటు అధినేతకు దూరమవుతున్నారా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయట నియోజకవర్గాల్లో.