Off The Record: తెలంగాణలో.. ఆ మాటకొస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్. ప్రస్తుతం ఇది గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్స్‌గా విడిపోయింది. అదంతా ఒక ఎత్తయితే… త్వరలో ఇక్కడ జరగబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు జాగ్రత్తగా పావులు కదుపుతున్నాయి. ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందన్న క్లారిటీ రాక ముందే…ఎవరి ప్లానింగ్‌లో వాళ్ళు ఉన్నారు. ఇక రూరల్ తెలంగాణ కంటే… హైదరాబాద్ చుట్టు పక్కలే తమకు ఎక్కువ అసెంబ్లీ సీట్లు రావడం, ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇక్కడే సత్తా చాటడం లాంటి కారణాలతో.. జీహెచ్‌ఎంసీ మీద స్పెషల్ ఫోకస్ పెడుతోందట బీఆర్ఎస్. 2020లో గ్రేటర్ ఎన్నికలు జరిగినప్పుడు నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అత్యధిక డివిజన్స్ గెలుచుకుంది. మొత్తం 150 డివిజన్లకు గాను బీఆర్ఎస్ 56 చోట్ల, బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక ఎంఐఎం ఖాతాలో 44 డివిజన్లు పడగా…. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండిటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ మేయర్ పీఠానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 76 కాగా…, అప్పట్లో ఎంఐఎం మద్దతుతో గులాబీ అభ్యర్థి సీట్లో కూర్చున్నారు.
అయితే, అదంతా గతం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు దగ్గరైంది మజ్లిస్ పార్టీ. అందుకే… ఈసారి పూర్తిగా గేమ్ ప్లాన్ మార్చేయాలని అనుకుంటున్నారట బీఆర్‌ఎస్ పెద్దలు. కాంగ్రెస్, మజ్లిస్ దోస్తీ సంగతి ఎలాఉన్నా….కాషాయ పార్టీని గట్టిగా టార్గెట్ చేస్తేనే… తాము ఎక్కువ సీట్లు సాధించగలుగుతామని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అధికార పార్టీని కాకుండా… హైదరాబాద్ వరకు తమ ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని డిక్లేర్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చలేదంటూ ప్రచారం చేసింది. కానీ హైదరాబాద్‌కు వచ్చేసరికి ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా…. రివర్స్ గేమ్ ఉంటుందని చెబుతున్నారు పార్టీ నాయకులు. గ్రామ స్థాయిలో కాషాయదళానికి పట్టు అంతంతమాత్రమేనన్నది విస్తృతాభిప్రాయం. కానీ… హైదరాబాద్, చుట్టుపక్కల ప్రభావం చూపగలుగుతుంది. అందుకే కమలాన్ని గట్టిగా టార్గెట్ చేస్తే… ఎక్కువ సీట్లు గెలవగలుగుతామన్నది గులాబీ ప్లాన్. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వల్ల రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదని, గతంలో గెలిచిన ఆ పార్టీ కార్పొరేటర్లు కూడా సొంతగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని ప్రచారం చేయాలనుకుంటున్నట్టు సమాచారం.
మొన్నటి వరకు 150 సీట్లు ఉన్న జీహెచ్ఎంసీ కాస్తా… ఇప్పుడు మూడు కార్పొరేషన్స్ అవడంతో… డివిజన్స్ సంఖ్య మూడు వందలకు పెరిగింది. దీంతో మెజారిటీ సీట్లు సాధించాలని కారు నేతలు టార్గెట్ పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల టైం నుంచి బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటేనని ప్రచారం చేస్తూ వస్తోంది కాంగ్రెస్. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత కూడా బీఆర్ఎస్ బీజేపీ పొత్తులుంటాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి వాదనలన్నిటినీ కొట్టిపడేయాలంటే…. హైదరాబాద్ ఎన్నికలను అవకాశంగా మల్చుకోవాలని చూస్తోందట బీఆర్‌ఎస్. హైదరాబాద్‌లో బీజేపీని ప్రధాన శత్రువుగా భావించి టార్గెట్ చేస్తే…. ఇటు తమకు ఎక్కువ సీట్లు రావడంతోపాటు… అటు రెండు పార్టీలు ఒకటేనన్న విమర్శల్ని ఏకకాలంలో తిప్పికొట్టవచ్చన్నది గులాబీ ప్లానింగ్ అట. ఇలాగే ముందుకు వెళ్తే మరో రెండున్నర ఏళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉపయోగపడుతుందన్న లెక్కలు కూడా ఉన్నాయట. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కూడా లైట్ తీసుకోకుండా దానితోపాటు… నగరంలో బలంగా ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తే… సింగిల్ అటెంప్ట్‌లో బహుళ రాజకీయ ప్రయోజనాలు చేకూరతాయన్నది కారు పార్టీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది.