Off The Record: నడిగడ్డ ప్రాంతంగా పిలుచుకునే గద్వాల రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. జెండాలు, అజెండాలు మారిపోయినా, ప్రభుత్వాలు మారినా గద్వాల పాలిటిక్స్‌లో వేడి మాత్రం తగ్గదు. ఇలాంటి వాతావరణంలో తాజాగా మారుతున్న పరిణామాలతో గద్వాల పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న సరితా తిరుపతయ్య కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోయారు. గద్వాల ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని బరిలో నిలిచిన సరిత, బిఆర్ఎస్ అభ్యర్ది క్రిష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే… రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… నియోజకవర్గంలో పరిణామాలు మారిపోయాయి. ఆరు నెలల కింద ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఈ పరిణామం గద్వాల కాంగ్రెస్ లో వర్గపోరుకు బీజం వేసింది. నాడు బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడే పొసగని ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరాక కూడా ఆధిపత్య పోరును నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్ళారు. ఇదే ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాన్ని సమ్మర్ సెగల్ని మమరిపించేలా చేస్తోంది. ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్‌లో చేరినా… ఇమడలేక పోతున్నారన్నది ఓ పరిశీలన. ఈ క్రమంలో ఇటీవల ఆయన… నేను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచాను. అదే పార్టీలో కొనసాగుతున్నాను. కావాలని కొంతమంది నామీద దుష్ప్రచారం చేస్తున్నారు. కొందరు కాంగ్రెస్ వ్యక్తులు వాళ్ళ ఫ్లెక్సీల్లో నా ఫోటో వేస్తున్నారు. నా ప్రతిష్టకు భంగం వాటిల్లేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతే కాదు…. రెండు వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారంటూ గద్వాల్ పీఎస్‌లో కంప్లయింట్ ఇచ్చేశారాయన. పార్టీ మారినట్టు తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదు లో పేర్కొన్నారు ఎమ్మెల్యే. అయితే అనర్హత కేసు నుంచి తప్పించుకునేందుకే ఆయన పోలీస్ కంప్లయింట్ డ్రామాకు తెరలేపారన్న చర్చ మొదలైంది ఆ తర్వాత. అలాగే అనర్హత భయం ఉన్న మరికొందరు ఎమ్మెల్యేలతో కలిసి త్వరలో కృష్ణమోహన్ రెడ్డి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలుస్తారన్న ప్రచారం సైతం జరుగుతోంది. అదే జరిగితే…. గద్వాల రాజకీయ పరిణామాలు పూర్తిగా మారే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. ఇదిలా ఉంటే గద్వాలలో మారుతున్న వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడిందట సరితా అండ్ టీం. అసలైన కాంగ్రెస్ నేతలం మేమేనని, కాంగ్రెస్ చేరాక కూడా… తూచ్ నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని ఎమ్మెల్యే అంటున్నారంటే… ఆయన చిత్తశుద్ధి ఏంటో అక్కడే తెలిసిపోతోందని అంటూ.. కామెంట్ చేస్తున్నారట సరిత అనుచరులు. కృష్ణ మోహన్ రెడ్డి ఫిర్యాదు కాపీతోపాటు ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా తెగ వైరల్ చేస్తోందట సరిత వర్గం.
అటు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ కాంగ్రెస్ పెద్దలకు నేరుగా వివరించారట సరిత. ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేయడంతో పాటు… తనకు ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరడం ఇప్పుడు గద్వాలలో చర్చనీయాంశం అయింది. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే… తాజాగా గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి. అనర్హత కేసు ఎపిసోడ్, పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్ళీ కేసీఆర్‌ని కలుస్తారన్న ప్రచారం నడుమ ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. నేను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనే అని ఇటీవల కృష్ణమోహన్‌రెడ్డి పోలీస్ కంప్లయింట్ ఇవ్వడంతో పాటు తాజాగా సరిత అధిష్టానానికి ఇచ్చిన ఫిర్యాదు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. అలాగే… కాస్త సంయమనంతో ఉండాలని ఎమ్మెల్యే బండ్లకు మంత్రి సూచించినట్టు సమాచారం. ఇలా రకరకాల మలుపులతో సాగుతున్న గద్వాల పొలిటికల్ మూవీలో క్లైమాక్స్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.