Off The Record: డొక్కా మాణిక్య వరప్రసాద్…. ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 2004లో గుంటూరు జిల్లా తాడికొండనుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2009లో కూడా రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు మాజీమంత్రి. ఇంకా చెప్పాలంటే… ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం తీవ్ర ఒడిదుడుకుల్లో పడింది. అందు కారణం అంతా స్వయంకృతమేనంటారు పొలిటికల్ పండిట్స్. నిలకడలేని నిర్ణయాలతో తన రాజకీయ జీవితానికి తానే గొయ్యి తవ్వుకున్నట్టు చెప్పుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు కాంగ్రెస్‌లో ఉన్నా… యాక్టివ్‌గా కనిపించలేదు డొక్కా. ఇక అక్కడుండి పొడిచేదేముందని అనుకున్నారో ఏమోగానీ.. అప్పట్లో వైసీపీలో చేరడానికి ముహూర్తం కూడా పెట్టుకుని ఫ్లెక్సీలు కొట్టించేసుకున్నారట. కానీ.. లాస్ట్ మినిట్‌లో సినిమా మొత్తం మారిపోయి వేరే బొమ్మ పడింది. తన రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావు జోక్యంతో టీడీపీలో చేరిపోయారు డొక్కా. అక్కడ ఆయన సీనియారిటీని గౌరవిస్తూ…రకరకాల కేలిక్యులేషన్స్‌తో ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది తెలుగుదేశం.
ఇక 2019లో పత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారాయన. అప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో… ఆయన మనసు అటువైపు లాగిందట. జంప్‌కొట్టి వచ్చినా… ఫ్యాన్ పార్టీ కూడా ఆయనకు గౌరవంగానే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. తర్వాత ఆయన్ని తాడికొండ ఇన్ఛార్జ్‌గా నియమించింది వైసీపీ అధిష్టానం. కానీ… ఎవరూ ఊహించని విధంగా డొక్కా ఛార్జ్ తీసుకున్న నెలలోపే… తాడికొండ వైసీపీ నేతల నుంచి ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి తప్పించింది పార్టీ అధిష్టానం. ఆ తర్వాతి నుంచి ఎప్పటికప్పుడు పార్టీలో తన అసంతృప్తిని వెళ్ళబుచ్చుతూనే ఉన్నారు మాజీ మంత్రి. ఆ క్రమంలోనే…. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారాయన. ఇక 2024 ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసేందుకు ఆశపడ్డా…ఆ ఛాన్స్ దక్కలేదు. దీంతో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిపోయి…. ఎన్నికల ముందు రెండోసారి టీడీపీ కండువా కప్పుకున్నారాయన. పార్టీ మారినా…. ఆయన ఆశ మాత్రం నెరవేరలేదు. పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయితే… కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో… తమనేత రాజకీయ భవిష్యత్తుకు ఢోకా లేదని భావించారట డొక్కా అనుచరులు. కానీ… ఆ అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. పార్టీలోకి వస్తే వచ్చావుగానీ… ఎక్కువ సీన్ చేయకు అన్నట్టుగా ఉందట టీడీపీ అధిష్టానం తీరు. ఏ విషయంలోనూ ఆయనకు ప్రాధాన్యం దక్కడం లేదని అంటున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే… అసలు టీడీపీలో డొక్కా మాణిక్యవరప్రసాద్ అనే నాయకుడు ఉన్నాడన్న సంగతే మర్చిపోయేలా వ్యవహారాలు నడుస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఆయన సన్నిహితులు.
తాము ఏదో… ఊహించేసుకుని పార్టీలోకి వస్తే…. ఇక్కడ ఇంకేదేదో జరిగిపోతోందంటూ కిందా మీదా అవుతున్నట్టు తెలిసింది. కనీసం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్దామన్నా, అక్కడ మాట్లాడాలనుకుంటున్నా… పార్టీ ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదన్న చర్చ నడుస్తోంది. దీంతో ఉనికి కోసం ఇప్పుడాయన నానా తంటాలు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. టీడీపీ అధిష్టానం దృష్టిలో పడటం కోసం కాస్త… రూట్ మార్చి వైసీపీ అధినేత జగన్, కీలక నేతలపై రోజూ మీడియాలో కామెంట్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారట. కానీ… ఇక్కడ కూడా తేడా కొడుతోందట. ప్రత్యర్థుల మీద విమర్శల పేరుతో ఈయనగారు ఎంత చించుకున్నా… అక్కడ పట్టించుకోవాల్సిన వాళ్ళు మాత్రం జానేదేవ్ అంటున్నట్టు సమాచారం. ఇంకా చెప్పాలంటే…ఈ మాజీ మంత్రిని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదట. కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని చెప్పుకుంటున్నారు. ఇలా.. ఎంత చేసినా ఎగిరెగిరి దంచినా… డొక్కాకు మాత్రం పార్టీలో గుర్తింపు సంగతి తర్వాత కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన వర్గీయులు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారట. కుదురులేని నిర్ణయాలతో పార్టీలు మార్చి… చివరికి ఎవరికీ నమ్మలేకుండా పోవడం వల్లే డొక్కాకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు పరిశీలకులు. ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఆయన దగ్గర ఎలాంటి వ్యూహాలు ఉన్నాయో చూడాలి.