Off The Record: పెనమలూరు పేచీలు కృష్ణా జిల్లా వైసీపీని కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధినాయకత్వం తీసుకున్న ఓ నిర్ణయం నియోజకవర్గంలో వర్గపోరుకు బీజం వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఎవరో వస్తారని అంచనా వేస్తున్న ఓ వర్గం… ఇప్పుడున్న ఇన్ఛార్జ్‌కి సహాయ నిరాకరణ మొదలుపెట్టేసిందట. దీంతో కొత్త గొడవలు మొదలవుతున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత మంత్రి పార్థసారధి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. కానీ…2024 ఎన్నికలకు ముందు వైసీపీని వదిలేసి టీడీపీ కండువా కప్పుకున్నారాయన. దీంతో… ఆ ఎలక్షన్స్‌లో మాజీ మంత్రి జోగి రమేష్‌ను అభ్యర్థిగా బరిలో దింపింది ఫ్యాన్ పార్టీ. కానీ… ఘోరంగా ఓడిపోయారు జోగి. ఆయన స్థానికుడు కాకున్నా… బీసీ కోటాలో టికెట్ ఇచ్చింది వైసీపీ అదిష్టానం. మొదటి నుంచి ఈ నియోజకవర్గాన్ని బీసీలకే ఇస్తోంది వైసీపీ. 2014లో కుక్కల విద్యాసాగర్‌కు ఇవ్వగా… 2019 పార్థసారథికి కూడా బీసీ కోటాలోనే కేటాయించింది. ఇక 24లో ఓటమి తర్వాత జోగి రమేష్ ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఈసారి మార్పుల్లో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిసైడయ్యారట పార్టీ పెద్దలు. అందుకే కొత్త ఇంచార్జ్‌గా అదే కులానికి చెందిన దేవభక్తుని చక్రవర్తిని నియమించారు. ఏడాది నుంచి అదే పోస్ట్‌లో ఉన్నారాయన.
కానీ… ప్రస్తుతం నియోజకవర్గంలో కొత్త పరిణామాలు చోటు చేసుకోవటం చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతోంది దేవభక్తుని చక్రవర్తి ఫ్యామిలీ. 2014, 2019లో టికెట్ ఆశించినా… బీసీ కోటాలోకి వెళ్ళిపోవడంతో… సైలెంట్ అయ్యారు. కానీ…ఈసారి కమ్మ వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటంతో…వాళ్ళలో ఆశలు పెరిగాయి. అదే సమయంలో చక్రవర్తికి ఇన్ఛార్జ్ పదవితో ఇక తమకు తిరుగులేదన్న నమ్మకంతో ముందుకు వెళ్తోంది దేవభక్తుని ఫ్యామిలీ. కానీ… ఇప్పుడో ప్రచారం ఆ కుటుంబాన్ని కలవర పెడుతోందట. దేవినేని అవినాష్ ఇక్కడకు ఇన్ఛార్జ్‌గా వస్తారని, వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారనే ప్రచారంతో కొత్త పేచీ మొదలైంది. అవినాష్ ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా YCP అధ్యక్షుడిగా, బెజవాడ తూర్పు నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్నారు. కానీ…పెనమలూరు నుంచి పోటీ చేయటానికి ఆసక్తిగా ఉన్నారని ఆయన వర్గం చేస్తున్న ప్రచారం కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటి వరకు అవినాష్ పెదవి విప్పకున్నా… ప్రచారం మాత్రం ఆగడం లేదు. అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ గతంలో కంకిపాడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేయటం, ఆయన వర్గం ఇక్కడ ఉండటంతో వారిలో కొందరు ఈ ప్రచారం చేస్తున్నారనేది లోకల్ టాక్. వాళ్ళే పెనమలూరులో ఉంటూ పూర్తి స్థాయిలో సహకరించకుండా ఈ ప్రచారాలు చేస్తున్నారనేది చక్రవర్తి వర్గం ఆరోపణ.
ఈ పేచీని దేవభక్తుని చక్రవర్తి వర్గం అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళినట్టు తెలిసింది. ఇన్ఛార్జ్ పదవి ఇచ్చే సమయంలో కూడా అధిష్టానం దేవినేని అవినాష్ అభిప్రాయాన్ని తీసుకుందని, ఆ తర్వాతే చక్రవర్తి పేరు ప్రకటించినా… ఇప్పుడు ఈ గోలేంటని మండిపడుతోంది ఆయన వర్గం. అవినాష్ వర్గానికి కూడా కొన్ని పదవులు ఇస్తామని, చక్రవర్తితో కలిసి పనిచేయాలని అప్పుడే చెప్పారన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కలిసి పనిచేస్తామని అప్పట్లో చెప్పిన దేవినేని వర్గం… ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడంతోనే… అనవసరమైన కొత్త సమస్యలు వస్తున్నాయన్నది చక్రవర్తి వర్గం కంప్లయింట్. కానీ… పార్టీ పెద్దలు మాత్రం…. ఇలాంటి ప్రచారాల గురించి ఆలోచించకుండా పనిచేసు కోవాలని ఇన్ఛార్జ్‌కు క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ పెనమలూరు పంచాయతీకి ఇక్కడితో తెర పడుతుందో లేక కంటిన్యూ అవుతుందోనన్నది జిల్లా రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.