Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • రాజ్యసభ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్‌..
  • రకరకాల లెక్కలతో వత్తిళ్ళు వచ్చినా నో చెప్పిన అధిష్టానం..
  • ఇప్పుడు ప్రచారంలోకి ఓ ఇంట్రస్టింగ్‌ టాపిక్‌..
  • తనకు రాజ్యసభ సీటు కోసం బీఆర్‌ఎస్‌కు దగ్గరికి ఓ కాంగ్రెస్‌ లీడర్‌?..
  • కేసీఆర్‌తో ఖర్గేకు ఓ మాట చెప్పించమని కేటీఆర్‌కు ఫోన్‌?..
  • మేం చెప్పినట్టు ఇవ్వకుంటే పోటీ పెడతామని బెదిరించాలంటూ ప్రతిపాదన..
  • కాంగ్రెస్‌ నేత ప్రపోజల్‌ విని కేటీఆర్‌ షాక్‌?..
  • అరంగట సాగదీసినా నో చెప్పేసి కేటీఆర్‌ ఫోన్‌ కట్‌ చేశారా?..
  • సొంత పార్టీని బ్లాక్‌ మెయిల్‌ చేయమంటూ పక్క పార్టీ దగ్గరికి వెళ్ళడమేంటి?..
  • కాంగ్రెస్‌ నేత ప్రపోజల్‌ తెలిసి నవ్వుకుంటున్న బీఆర్‌ఎస్‌ వర్గాలు..
Otr Rajya Sabha Ticket

Otr Rajya Sabha Ticket

Off The Record: తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజార్టీ ఉండడంతో ఆ రెండూ కాంగ్రెస్‌ ఖాతాలోనే పడ్డాయి. అదే సమయంలో…బీఆర్ఎస్ కూడా కాస్త గట్టిగా ప్రయత్నిస్తే… కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం గెలిచే అవకాశం ఉండేదన్న చర్చ కూడా జరిగింది. కానీ… తమకు పూర్తి స్థాయి బలం లేదని, అనవసరంగా పోటీ చేసి ఓడిపోయామని అనిపించుకోవడం ఎందుకంటూ బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆ ప్రతిపాదనల్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కొందరు పార్టీ నేతలు, ఆశావాహుల నుంచి రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టాలంటూ ఒత్తిడి వచ్చినా… ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేంత బలం తమకు లేకపోవడంతో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నామని ఆ సమయంలో ప్రకటించింది బీఆర్‌ఎస్‌. అయితే… అప్పుడే ఓ ఆసక్తికరమైన ఘటన జరిగినట్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లోచర్చ జరుగుతోంది. అదీ కూడా…. తనకు రాజ్యసభ టిక్కెట్‌ కోసం ఓ తెలంగాణ కాంగ్రెస్‌ నేత బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌తో రికమండ్‌ చేయించాలనుకున్నారన్న టాపిక్‌ మరింత ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్‌ ఏంటి? కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడుతో మాట్లాడి ఆ పార్టీ టిక్కెట్‌ ఇప్పించడమేంటి…?సదరు లీడర్‌ అసలు మతుండే ఆ ప్రతిపాదన చేశారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే… అందుకు కొన్ని లెక్కలు కూడా చెప్పారట ఆ నాయకుడు. ఇంతకీ విషయం ఏంటంటే… కాంగ్రెస్‌కు కన్ఫామ్‌గా వస్తాయనుకున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒకదాన్ని తనకు ఇప్పించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సంప్రదించారట ఓ కాంగ్రెస్ నేత. తన మనసులోని మాటను కేసీఆర్‌కు చెప్పి ఆయనతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్‌ చేయించి రికమండ్‌ చేయాలని కోరినట్టు తెలిసింది. అలా ఎలా చెబుతారంటే…. బీఆర్‌ఎస్‌ బలాన్ని గుర్తు చేశారట. మేం చెప్పిన కాంగ్రెస్‌ నాయకుడికి మీరు టిక్కెట్‌ ఇస్తే… రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయబోమని, లేదంటే పోటీ పెట్టి ఫైట్‌ టైట్‌ చేస్తామంటూ ఖర్గే మీద వత్తిడి తేవాలంటూ కేటీఆర్‌కే క్రియేటివ్‌ ఐడియా ఇచ్చారట సదరు కాంగ్రెస్‌ లీడర్‌. ఆ ప్రతిపాదన విని కేటీఆర్‌ కూడా నోట మాటరాక షాకైనట్టు తెలిసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడికి కేసీఆర్‌ ఫోన్‌ చేయడమేంటి? పోటీ చేస్తామని బెదిరించాల్సిన అవసరం మాకేంటి అంటూ… బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ముక్కున వేలేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు.

ఈ సంగతి ఇప్పుడు తెలిసిన వాళ్ళంతా… అప్పట్లో కేటీఆర్‌కు త్రివిక్రమ్‌ డైలాగ్‌ గుర్తుకు వచ్చి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లిపోయి ఉండవచ్చంటూ సరదాగా అంటున్నారు. సదరు కాంగ్రెస్‌ లీడర్‌ కేటీఆర్‌ను ఫోన్లోనే ఒప్పించేందుకు అరగంటకు పైగానే మాట్లాడినట్టు తెలిసింది. ఎంతకీ తెగకుండా సాగదీస్తుండటంతో… చిరాకొచ్చిన కేటీఆర్ అదంతా కుదరదన్నా అంటూ ఫోన్‌ కట్‌చేసినట్టు ప్రచారం జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఒకసారి రాజ్యసభకు వెళితే ఆరేళ్ల పాటు తిరుగుండదన్న ఉద్దేశ్యంతో చాలా మంది నాయకులు ట్రయల్స్‌ వేస్తుంటారుగానీ…. ఇలా తన సీటు కోసం సొంత పార్టీని పక్క పార్టీ అధ్యక్షుడు బ్లాక్‌మెయిల్‌ చేయాలని కోరే నాయకుడిని మాత్రం మొదటిసారి చూస్తున్నామంటూ బీఆర్‌ఎస్‌లో కూడా చర్చ జరుగుతోందట. అసలు ఈ ఆలోచనే కొత్తగా ఉంది. ఇప్పటిదాకా ఇలా ఎవరూ ఆలోచించి ఉండకపోవచ్చన్నది తెలంగాణ పొలిటికల్ టాక్‌. అసలు కేసీఆర్‌ గురించి ఆయనేమనుకుంటున్నాడు, మీ పార్టీకి చెందిన ఫలానా నాయకుడికి రాజ్యసభ టిక్కెట్‌ ఇవ్వమని ఖర్గేకు ఆయనెలా చెబుతారు? సదరు కాంగ్రెస్‌ లీడర్‌కు మతుండే ఆ ప్రతిపాదన చేశారా అంటూ నవ్వుకుంటున్నాయట బీఆర్‌ఎస్‌ వర్గాలు.