Off The Record: టీఆర్ఎస్ పార్టీ BRSగా మారిన తర్వాత ఖమ్మంలో మొదటి బహిరంగ సభ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకుంటున్న సీఎం కేసీఅర్..TRSను భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణతోనే అది సాధ్యమని గులాబీ దళపతి భావిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి BRSకు జాతీయ పార్టీగా గుర్తింపు కోసం గట్టి ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నారట. జాతీయ పార్టీ గుర్తింపు నిబంధనలను వీలైనంత తొందరగా రీచ్ అవ్వాలని గులాబీపార్టీ అధిష్ఠానం సీరియస్‌గా ఆలోచిస్తూ.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.
Read Also: Off The Record: దేవినేనిని మరోసారి టార్గెట్ చేసిన కేశినేని.. గేమ్ స్టార్ట్ చేశారా?
ఈ ఏడాదితోపాటు వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా BRS విస్తరణను వేగవంతం చేయాలనేది కేసీఅర్ ఆలోచన. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పై కూడా BRS స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నదట. ఏపీలో చేరికలను కొనసాగిస్తూనే.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయాలనే వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం అవసరమైన కసరత్తు మొదలు పెట్టిందట. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి సత్తా చాటడంతోపాటు 6శాతం ఓట్లను సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుందట BRS. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న BRS ఒంటరి పొరుకే మొగ్గు చూపుతోందట. ఏపీలో సామాజిక సమీకరణాలు.. రాజకీయ పార్టీల వ్యూహాలను అంచనా వేసి బరిలో అభ్యర్థులను నిలుపుతారని తెలుస్తోంది.
ఆరుశాతం ఓట్లను రీచ్ కావడానికి ఏదో సాదాసీదాగా అభ్యర్థులను ఎంపిక చేయకుండా.. ఆ మేరకు ఓట్లను రాబట్టే బలమైన క్యాండిడేట్స్‌ను ఎంపిక చేస్తారని గులాబీశిబిరంలో చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌కు ఎక్కువ ఆదరణ ఉన్న నియోజకవర్గాలు.. కాస్త ఫర్వాలేదు అనుకున్న సెగ్మెంట్లను గుర్తించి.. అక్కడ గట్టిగానే పావులు కదపాలని చూస్తున్నారట. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అనుగుణంగా మరోసారి వ్యూహాన్ని సమీక్షించి మార్పులు చేర్పులకు అవకాశాలు లేకపోలేదని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం తర్వాత బీఆర్‌ఎస్ ఎక్కువగా రీచ్ అయ్యేది మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశే కావడంతో రణతంత్రం పక్కాగానే ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నారు.